ముంబై: భారత సీనియర్ వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహాను స్పోర్ట్స్ జర్నలిస్టు బొరియా మజుందార్ బెదిరించిన ఘటనలో భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కఠిన చర్యలకు పూనుకుంది. ఇంటర్వ్యూ ఇవ్వనందుకు సాహాపై బెదిరింపులకు పాల్పడిన మజుందార్‌పై బోర్డు రెండేండ్ల నిషేధం విధించింది. సస్పెన్షన్ సమయంలో ప్లేయర్లను ఇంటర్వ్యూలను చేయొద్దని.. మీడియా అక్రిడిటేషన్ ఇవ్వొద్దని అన్ని క్రికెట్ సంఘాలను బోర్డు ఆదేశించింది.
క్రికెట్‌కు సంబంధించిన కార్యక్రమాలకు రెండేండ్ల పాటు అతడిని దూరం చేసింది. ఈ మేరకు అన్ని రాష్ర్టాల క్రికెట్ సంఘాలకు బీసీసీఐ తాత్కాలిక సీఈవో హేమంగ్ అమిన్ లేఖ పంపారు. ఇంటర్వ్యూ కోసం ఓ జర్నలిస్ట్ బెదిరింపులకు పాల్పడ్డాడని సాహా కొన్ని రోజుల కిందట సోషల్ మీడియా వేదికగా వాపోయాడు. దీనికి సంబంధించిన స్క్రీన్షాట్లను పంచుకున్నా.. అతడి పేరు బహిర్గతం చేయలేదు.
ఆటగాడిపై బెదిరింపులను తీవ్రంగా పరిగణించిన బోర్డు ఫిబ్రవరి 25న రాజీవ్ శుక్లా, అరుణ్ సింగ్ ధుమాల్, ప్రభ్‌తేజ్ సింగ్ భాటియాతో కూడిన త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇద్దరి వాదనలు విన్న అనంతరం ‘మజుందార్ బెదిరింపు ధోరణితో వ్యవహరించారు’ అని నిర్ధారించి నివేదిక సమర్పించింది. నివేదికను పరిశీలించిన బోర్డు అపెక్స్ కౌన్సిల్ మజుందార్‌ను రెండేండ్ల పాటు నిషేధించాలని సిఫారసు చేసింది. దీంతో మజుందార్ రెండేండ్ల పాటు క్రికెట్ కార్యకలాపాలకు దూరం కానున్నాడు.