నటీనటులు: హర్ష రోషన్, కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, శాన్వీ మేఘన, నిహాల్ కోధాటి, దయానంద్ రెడ్డి తదితరులు
కథ, దర్శకత్వం: సీ సుప్రీత్ కృష్ణ
నిర్మాతలు: రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీ వరుణ్, శ్రీరాముల రెడ్డి, సుప్రీత్ సి కృష్ణ
మ్యూజిక్: సంతు ఓంకార్
Tuk Tuk | ఇటీవల కుడుంబస్తాన్ అనే తమిళ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న తెలుగమ్మాయి శాన్వి మేఘన, నాని సమర్పణలో వచ్చిన కోర్ట్ సినిమాతో హిట్ కొట్టిన హర్ష్ రోషన్, నటులు కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు, నిహాల్ కోధాటి ముఖ్యతారలుగా వచ్చిన తాజా చిత్రం ‘టుక్ టుక్’ (Tuk Tuk). ఈ సినిమాకు సి.సుప్రీత్ కృష్ణ దర్శకత్వం వహించగా.. చిత్రవాహిని మరియు ఆర్.వై.జీ సినిమాస్ పతాకంపై రాహుల్ రెడ్డి, లోక్కు శ్రీవరుణ్, శ్రీరాముల రెడ్డిలు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం నేడు ప్రేక్షకుల మందుకు వచ్చి పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతుంది. అయితే సూపర్నాచురల్ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా రివ్యూ ఎలా ఉందో ఒకసారి చూసుకుంటే..
కథ
చిత్తూరు జిల్లాలోని ఒక చిన్న గ్రామంలో ముగ్గురు టీనేజీ కుర్రాళ్ళు హర్ష్ (హర్ష్ రోషన్), కార్తీక్ (కార్తికేయ దేవ్), స్టీవ్ (స్టీవెన్ మధు) జీవితంలో ఎటువంటి లక్ష్యం లేకుండా జల్సాగా గడుపుతుంటారు. రోజూ సాయంత్రం ఒక చెట్టు కింద కూర్చుని బూతు వీడియోలు చూస్తూ, ఊరి చెరువు దగ్గర ఆడవాళ్ళు స్నానం చేస్తుంటే దొంగచాటుగా చూడటం వీళ్ళ రొటీన్. ఒకరోజు ఈ వీడియోలు చూస్తూ హర్ష్‌కి ఒక ఆలోచన వస్తుంది. ఇలాంటి వీడియోలు తామే తీసి ఆన్లైన్లో పెడితే డబ్బులు సంపాదించవచ్చని. కానీ దానికి కెమెరా కావాలి, డబ్బు లేదు. హర్ష్ తన తండ్రిని డబ్బు అడుగుతాడు. తండ్రి, డబ్బు సంపాదించాలంటే కష్టపడాలి. ఈ సారి వినాయక చవితి వస్తోంది, ఊరిలో వేడుక నిర్వహించి విరాళాలు సేకరించు, అందులో కెమెరా కొనుక్కో అని సలహా ఇస్తాడు.
ముగ్గురూ ఈ ఆలోచనను సీరియస్‌గా తీసుకుని, వినాయక చవితి వేడుకకు ప్లాన్ చేస్తారు. ఈ క్రమంలో వాళ్ళ ఇంటి వెనకాల మూలన పడి ఉన్న ఒక పాత బజాజ్ చేతక్ స్కూటర్‌ను మెకానిక్‌తో రిపేర్ చేయిస్తారు. అనంతరం దీనిని టుక్ టుక్ బండిలా తయారుచేస్తారు. ఇక టుక్ టుక్ బండిపైనే వినాయకుడి విగ్రహాన్ని పెట్టి ఊరేగింపుగా నిమజ్జనం చేస్తారు. అయితే నిమజ్జనం తర్వాత ఆ స్కూటర్లో చాలా మర్పులు వస్తాయి. దానికి అదే కదులుతుంటుంది. దానికి అదే స్టార్ట్ అవుతుంది. అయితే ఈ స్కూటర్లో ఆత్మ ఉందని తర్వాత తెలుస్తుంది. ఇంతకీ స్కూటర్‌లోకి ఆత్మ ఎలా వచ్చింది. అసలు స్కూటర్‌కి శిల్ప(శాన్వి మేఘన)కి సంబంధం ఏంటి అనేది తెలియాలంటే ఈ సినిమా చూడాల్సిందే.
విశ్లేషణ:
“టుక్ టుక్” సినిమా తెలుగులో గతంలో వచ్చిన “బామ్మ మాట బంగారు బాట,” “కారా మజాకా,” “మెకానిక్ మామయ్య” లాంటి చిత్రాలను గుర్తుకుతెస్తుంది. ఒక వాహనం దానంతట అదే ఆపరేట్ అవడం, భయపెట్టడం, నవ్వించడం వంటి అంశాలను పాత తెలుగులో కూడా చూసే ఉంటాం. అయితే ఈ సినిమాలో ముగ్గురు కుర్రాళ్ళు ఒక పాత స్కూటర్‌ను “టుక్ టుక్” బండిగా మార్చి, దానిలో దేవుడు ఉన్నాడని ప్రచారం చేసి డబ్బులు సంపాదించే కథ ఆసక్తికరంగా మొదలవుతుంది. ఈ బండి ఆత్మ విన్యాసాలు, పిల్లలు అడిగే ప్రశ్నలకు హ్యాండిల్ ఊపి సైగలతో సమాధానాలు ఇవ్వడం.. సరదాగా, కొత్తగా అనిపిస్తుంది. సినిమాలో హాస్యం బాగా పండింది. ముగ్గురు కుర్రాళ్ళు బండిని తయారు చేసే సీన్స్, ఆ బండితో ఊరిని ఏలాడం, ఆత్మ ఉందని తెలిసాక భయపడి పరుగులు తీయడం ఇవన్నీ నవ్వు తెప్పిస్తాయి. ఆత్మ కథను వివరించే ఫ్లాష్‌బ్యాక్ కాస్త బలహీనంగా, సాగదీతగా అనిపిస్తుంది. ఆ ఆత్మ ఎందుకు, ఎలా బండిలోకి వచ్చిందనే ప్రశ్నకు స్పష్టమైన సమాధానం దొరకదు, ఇది ఒక లోపంగా కనిపిస్తుంది. లవ్ స్టోరీని కొత్త కోణంలో చూపించే ప్రయత్నం ఆకట్టుకుంటుంది. హీరోయిన్ పాత్రను బాగా రాసుకున్నాడు దర్శకుడు. క్లైమాక్స్ కూడా చాలా సింపుల్‌గా, ఊహించినట్టే ముగుస్తుంది. కాస్త బలమైన ట్విస్ట్ ఆశించిన వాళ్ళకు నిరాశే.
నటీనటులు
సలార్, కోర్టు వంటి సినిమాలతో బాలనటుడిగా తన సత్తా చాటిన హర్ష్ రోషన్ “టుక్ టుక్”లో మరోసారి తన నటనా ప్రతిభను నిరూపించాడు. ఈ సినిమాను తన భుజాలపై మోసిన విధానం చూస్తే, చిన్న వయసులోనే పెద్ద బాధ్యతలను నెత్తినెత్తుకునే నైపుణ్యం అతడిలో కనిపిస్తుంది. తన పాత్రతో పాటు మిగతా ఇద్దరు కుర్రాళ్ళ కూడా తమ పాత్రలకు న్యాయం చేశారు.
తెలుగమ్మాయి శాన్వీ మేఘన కూడా తన నటనతో అలరించింది. ముఖ్యంగా సెకండ్ హాఫ్‌ను భావోద్వేగపరంగా మలిచి, సినిమాకు ఒక ఎమోషనల్ డెప్త్ తీసుకొచ్చింది. ఆమె పాత్ర సినిమాకు పూర్తిత్వాన్ని ఇవ్వడమే కాక, కీలక సన్నివేశాల్లో తన నటనతో ప్రేక్షకులను కట్టిపడేసింది. తండ్రి పాత్రలో దయానంద్ రెడ్డి మరోసారి తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. మిగతా నటీనటులు కార్తికేయ దేవ్, స్టీవెన్ మధు తదితరులు తమ పాత్రల్లో జీవం పోసి, కథను సజీవంగా నడిపించడంలో విజయవంతమయ్యారు.
సాంకేతిక అంశాల విషయానికి వస్తే..
“టుక్ టుక్” సినిమా ఆకట్టుకునే విజువల్ అనుభవాన్ని అందించింది. సినిమాటోగ్రఫీ ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పవచ్చు. నిజమైన లొకేషన్లలో చిత్రీకరించడంతో పచ్చని గ్రామీణ వాతావరణం కళ్ళకు ఇంపుగా ఉంది. ప్రతి ఫ్రేమ్‌లోనూ గ్రామ సౌందర్యాన్ని అద్భుతంగా బంధించారు. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ (బీజీఎం) కథను పెంచే విధంగా సాగింది. ముఖ్యంగా వింటేజ్ సీన్లలో ఆ పాతకాలపు ఫీల్‌ను తెప్పించడంలో బీజీఎం సఫలమైంది. ఆర్ట్ డిపార్ట్మెంట్ కృషి కూడా చప్పట్లు కొట్టించేలా ఉంది.
మూడు చక్రాల టుక్ టుక్ బండిని రూపొందించిన విధానం సినిమాకు ప్రత్యేక ఆకర్షణను తెచ్చిపెట్టింది. ఓవరాల్‌గా, ఫ్యామిలీతో కలిసి రిలాక్స్‌గా ఎంజాయ్ చేయడానికి “టుక్ టుక్” ఒక మంచి ఎంపిక. పెద్ద ట్విస్ట్‌లు లేకపోయినా, ఉన్నంతలో ఆకట్టుకునే వినోదాన్ని అందించింది.
రేటింగ్ : 2.75