హైదరాబాద్, ఆగస్టు 3 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీలో పనిచేస్తున్న కండక్టర్లు, డ్రైవర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించి అధ్యయనం చేసేందుకు యాజమాన్యం ఒక ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. సీసీఏ నిబంధనల ఆధారంగా మార్గదర్శకాలను రూపొందించేందుకు, ఈ అంశంపై సిఫార్సులు అందజేసేందుకు ఎనిమిది మంది సభ్యులతో కూడిన కమిటీని నిర్దేశిస్తూ ఆర్టీసీ ఎండీ వై నాగిరెడ్డి ఆదేశాలు జారీ చేశారు.
కమిటీ కన్వీనర్‌గా సీటీఎం ఎస్ శ్రీదేవి వ్యవహరిస్తారు. సభ్యులుగా ఈడీలు ఖుస్రో షా ఖాన్, ఏ శ్రీధర్, ఆర్ఎంలు ఎన్ సుచరిత, బీ రాజు, డిప్యూటీ ఆర్ఎం ఎస్ భూపతిరెడ్డి, హైదరాబాద్ డీఎం పీ ఉపేందర్, మియాపూర్-2 డీఎం వై సుఖేందర్‌రెడ్డి ఉన్నారు. వీరు డ్రైవర్లు, కండక్టర్ల ఉద్యోగ భద్రతకు సంబంధించిన అన్ని సమస్యలు, అంశాలను సమగ్రంగా పరిశీలించి, తగిన సిఫార్సులతో కూడిన నివేదికను ఎండీకి అందజేస్తారు. ఈ కమిటీ సభ్యులందరూ త్వరలోనే సమావేశమై తదుపరి చర్యలపై చర్చించి యాజమాన్యానికి నివేదిక అందజేయనున్నారు.