హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): అనేక ఆటుపోట్లకు గురై నష్టాల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)ని గట్టెక్కించేందుకు స్వల్పంగా బస్సు చార్జీలను పెంచాలని సంస్థ యాజమాన్యం నిర్ణయించింది. వరుసగా రెండేండ్లు కరోనా కారణంగా లాక్డౌన్ విధింపుతో ప్రయాణికులు లేక తీవ్రంగా నష్టపోయిన టీఎస్ఆర్టీసీపై భారీ స్థాయిలో పెరిగిన డీజిల్ ధరల పిడుగు పడింది. దీనికితోడు విడిభాగాల ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో చార్జీలు పెంచక తప్పడంలేదని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ చెప్పారు.
తీవ్ర నష్టాల్లో కూరుకుపోయిన ఆర్టీసీని రాష్ట్ర ప్రభుత్వం అనేక రకాలుగా ఆదుకున్నదని, అయినప్పటికీ తప్పనిసరి పరిస్థితుల్లో స్వల్పంగా చార్జీలు పెంచాలని నిర్ణయించామని తెలిపారు. పల్లెవెలుగు, ఆర్డినరీ బస్సులకు కిలోమీటరుకు 25 పైసల చొప్పున, ఎక్స్‌ప్రెస్, ఆ పై సర్వీస్‌లకు 30 పైసల చొప్పున పెంచాలని భావిస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ ప్రతిపాదనలను సీఎం కేసీఆర్‌కు పంపామని, త్వరలోనే నిర్ణయం వస్తుందని చెప్పారు. ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ కార్యాలయంలో బుధవారం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, రవాణాశాఖ కార్యదర్శి కేఎస్ శ్రీనివాసరాజు, ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్, రవాణాశాఖ కమిషనర్ ఎంఆర్ఎం రావులతో కలిసి మంత్రి మీడియాతో మాట్లాడారు.
నష్టాల్లో ఉన్న ఆర్టీసీని ఆదుకొనేందుకు సీఎం కేసీఆర్ గతంలో ఎన్నడూలేని విధంగా బడ్జెట్లో రూ.1500 కోట్లు కేటాయించారని చెప్పారు. బడ్జెట్యేతరంగా బ్యాంక్ గ్యారెంటీల ద్వారా మరో రూ.1500 కోట్లతో ఆదుకున్నారని గుర్తుచేశారు. పక్క రాష్ర్టాల్లో ఆర్టీసీ కార్మికులను ఉద్యోగాల్లోంచి తొలగిస్తుంటే, తెలంగాణ ప్రభుత్వం మాత్రం వారిని కడుపులో పెట్టుకొని చూసుకుంటున్నదని చెప్పారు. కరోనా నుంచి బయటపడిన తర్వాత ఆర్టీసీ ఆదాయం ఇప్పుడే కొద్దికొద్దిగా పెరుగుతున్నదని తెలిపారు. అయినప్పటికీ ఇంకా నష్టాలు వస్తున్నాయని, అనివార్య పరిస్థితుల్లోనే చార్జీలు పెంచాల్సి వస్తున్నదని వివరించారు.
చార్జీల పెంపుపై ప్రజలు సైతం సానుకూలంగానే ఉన్నట్టు తెలుస్తున్నదని మంత్రి పువ్వాడ అన్నారు. ఇటీవల నిర్వహించిన ఒక సర్వేలో 4.3శాతం మంది మాత్రమే బస్సు చార్జీల పెంపును వ్యతిరేకించారని వెల్లడించారు. కేంద్రం డీజిల్ ధరలను గత రెండేండ్లలో 27.5శాతం పెంచిందని, ఇతర విడిభాగాల ధరలు అంతకంతకు పెరుగుతున్నాయని తెలిపారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలవల్లనే ఆర్టీసీ చార్జీలు పెంచాల్సి వస్తున్నదని, ఈ విషయాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తిచేశారు. పల్లెవెలుగు, సిటీ ఆర్డినరీ, సిటీ సబర్బన్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కనిష్ఠ చార్జీలు రూ.10 చొప్పున.. మెట్రో డీలక్స్, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో రూ.15 చొప్పున వసూలు చేస్తున్నారు. అలాగే డీలక్స్ బస్సుల్లో రూ.20, సూపర్ లగ్జరీ బస్సుల్లో రూ.25, రాజధాని ఏసీ బస్సుల్లో రూ.35, గరుడప్లస్ ఏసీ బస్సుల్లో రూ.35 చొప్పున వసూలు చేస్తున్నారు. ఈ చార్జీలపై కిలోమీటర్‌కు 25, 30 పైసల చొప్పున పెంచితే ఏడాదికి సుమారు రూ.850 కోట్ల వరకు అదనంగా ఆదాయం సమకూరుతుందని మంత్రి తెలిపారు.
ఆర్టీసీలో కొన్ని డిపోలు మూసివేస్తున్నట్టు వస్తున్న వార్తల్లో వాస్తవంలేదని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ స్పష్టం చేశారు. కొందరు కావాలని అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆర్టీసీని మరింత బలోపేతం చేసే దిశగా అన్ని చర్యలూ తీసుకుంటున్నామని తెలిపారు.