హైదరాబాద్, అక్టోబర్ 27 (నమస్తే తెలంగాణ): పరిశ్రమలకు సత్వర అనుమతులు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న టీఎస్ ఐపాస్ దేశంలోనే అత్యుత్తమమని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) దక్షిణ ప్రాంత చైర్మన్ సీకే రంగనాథన్ ప్రశంసించారు. బుధవారం హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి వర్చువల్‌గా మీడియాతో మాట్లాడుతూ.. వరంగల్, నిజామాబాద్ లాంటి ద్వితీయశ్రేణి నగరాల్లో పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వ కృషి భేష్ అని కొనియాడారు. టెక్స్టైల్ పార్క్, ఎలక్ట్రానిక్స్ పార్క్, ఫార్మాసిటీ తదితర రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు తెలిపారు. ఉత్పత్తులకు డిమాండ్‌ను కల్పించడం, ప్రభుత్వ, ప్రైవేట్ పెట్టుబడులను ఆకర్షించడం, ఉద్యోగాల కల్పన, ఎగుమతుల అంశాలు ప్రాతిపదికగా ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నట్టు వివరించారు. కార్పొరేట్ సంస్థల వ్యాపార వ్యూహాలపై వ్యాపారవేత్తలకు అవగాహన కల్పించేందుకు లైట్‌హౌస్ పేరిట తెలంగాణలో ప్రయోగాత్మక ప్రాజెక్టును చేపట్టనున్నట్టు వెల్లడించారు. తెలంగాణలో రక్షణ, ఏరోస్పేస్ రంగాల అభివృద్ధి కోసం ప్రభుత్వం, పరిశ్రమలు ఒక కన్సార్టియంగా ఏర్పడాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు.