Donald Trump : అగ్రరాజ్యం అమెరికా (USA) లో జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార రిపబ్లికన్ పార్టీ (Republical party) కి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. న్యూయార్క్ (New York) మేయర్ ఎన్నికలు (Mayor elections) సహా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో డెమోక్రాట్స్ (Democrats) విజయం సాధించారు. ఈ ఫలితాలపై అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) స్పందించారు.
బ్యాలెట్లో తన పేరు లేకపోవడం కూడా ఓటమిగల కారణాల్లో ఒకటని అర్థం వచ్చేలా ఆయన తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అయిన ట్రూత్ సోషల్లో ఒక పోస్టు పెట్టారు. ‘బ్యాలెట్లో ట్రంప్ పేరు లేదు. మరోవైపు నెల రోజులకుపైగా ఫెడరల్ షట్డౌన్ కొనసాగుతోంది. ఈ రెండు కారణాలవల్ల రిపబ్లికన్లు ఎన్నికల్లో ఓడిపోవాల్సి వచ్చింది’ అని పోల్స్టర్స్ సర్వే వెల్లడించిన అభిప్రాయాన్ని ట్రంప్ తన ట్రూత్ సోషల్లో షేర్ చేశారు. దాంతో ఆ పోస్ట్ నెట్టింట వైరల్గా అవుతోంది.
అదేవిధంగా కాలిఫోర్నియాలో ఎన్నికల ఫలితాలపై కూడా ట్రంప్ అసహనం వ్యక్తంచేశారు. రాజ్యాంగ విరుద్ధమైన రీమ్యాపింగ్ పేరుతో కాలిఫోర్నియాలో భారీ స్కామ్ జరిగిందని ఆరోపించారు. ఓటింగ్ ప్రక్రియలోనూ రిగ్గింగ్ చోటుచేసుకుందని విమర్శించారు. మెయిల్-ఇన్ ఓట్లను పక్కనబెట్టేశారని, ఇది చాలా తీవ్రమైన అంశమని మండిపడ్డారు.
కాగా న్యూయార్క్లో మేయర్ పదవికి జరిగిన ఎన్నికల్లో భారత మూలాలు ఉన్న డెమోక్రాట్ నేత జొహ్రాన్ మమ్దానీ విజయం సాధించారు. ఇక న్యూజెర్సీలో డెమోక్రటిక్ పార్టీకి చెందిన మైకీ షెరిల్ గవర్నర్గా గెలిచారు. 1960 తర్వాత వరుసగా మూడుసార్లు న్యూజెర్సీ గవర్నర్ పదవి డెమోక్రాట్లకు దక్కడం విశేషం. వర్జీనియాలోనూ డెమోక్రాట్ నేత ఆబిగేల్ స్పాన్బర్గర్ గెలిచారు.