తిరువనంతపురం: రెండో వివాహం రిజిస్ట్రేషన్(Second Marriage Registration ) కోసం ముస్లిం వ్యక్తి తన మొదటి భార్య అనుమతి తీసుకోవాల్సిందే అని కేరళ హైకోర్టు పేర్కొన్నది. కేరళ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజస్ రూల్స్ ప్రకారం రెండో వివాహం రిజిస్ట్రేషన్ కుదరని హైకోర్టు చెప్పింది. రిజిస్ట్రేషన్ కోసం ముందుగా నోటిఫై చేయాల్సి ఉంటుందని, ఆ తర్వాత మొదటి భార్య అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుందని కేరళ కోర్టు పేర్కొన్నది. జస్టిస్ పీవీ కున్హికృష్ణన్ ఈ కేసులో తన తీర్పును వెలువరించారు.
ముస్లిం వ్యక్తిగత చట్టాల ప్రకారం ఆ మతానికి చెందిన మగవారికి ఎంతమంది భార్యలనైనా కలిగి ఉండవచ్చు అని, కానీ ఆ హక్కుతో రాజ్యాంగ సూత్రాలైన సమానత్వాన్ని అధిగమించలేమని జస్టిస్ కున్హికృష్ణన్ తెలిపారు. 2008 నాటి కేరళ వివాహ చట్టాల ప్రకారం మ్యారేజ్ రిజిస్ట్రేషన్ లీగల్ అంశమని, ఆ ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలన్నారు. మొదటి భార్య నోటీసు ఇచ్చిన తర్వాతే రెండో పెళ్లి రిజిస్ట్రేషన్ జరుగుతుందని కోర్టు చెప్పింది.
ఒకవేళ పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే రాజ్యాంగ ప్రక్రియలను గౌరవించాలన్నారు. ముస్లిం వ్యక్తి ఎవరైనా.. మొదటి భార్యను కాదని, రెండో పెళ్లిని రిజిస్టర్ చేసుకోలేరని కోర్టు తెలిపింది. ఒకవేళ మొదటి భార్య ఆ ముస్లిం వ్యక్తి యొక్క రెండో పెళ్లి రిజిస్ట్రేషన్‌ను అడ్డుకుంటే అప్పుడు రిజిస్ట్రార్ దాన్ని పక్కనపెట్టేయాలని కోర్టు పేర్కొన్నది.