హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఆవిర్భవించిన తరువాత 2014 నుంచి ఇప్పటి వరకు మొత్తం ఎనిమిది ఉప ఎన్నికలు జరిగాయి. వీటిలో ఆరు ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీయే జయకేతనం ఎగురవేసింది. రాష్ట్ర ఏర్పాటైన తొలినాళ్లలో వరంగల్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పసునూరి దయాకర్ 4 లక్షల పైచిలుకు మెజారిటీ సాధించి దేశంలోనే అత్యధిక మెజారిటీ సాధించిన అభ్యర్థుల్లో 7వ స్థానంలో నిలిచారు. అప్పటినుంచి ఇప్పటిదాకా జరిగిన అన్ని ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ మినహా మిగతా అన్నింటా విజయం సాధించింది. 2020లో దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నికలో టీఆర్ఎస్ అభ్యర్థి కేవలం వెయ్యి ఓట్ల పైచిలుకు ఓట్ల తేడాతో ఓడిపోయారు. తాజాగా హుజూరాబాద్‌లో బీజేపీ కాంగ్రెస్‌లు కుమ్మక్కు అయ్యాయి. చివరి నిమిషంలో డమ్మీ అభ్యర్థిని నిలబెట్టిన కాంగ్రెస్.. తన ఓటును బీజేపీకి బదలాయించింది. కాంగ్రెస్, బీజేపీలు ఏకమై టీఆర్ఎస్ను దెబ్బకొట్టాలని చూసినా టీఆర్ఎస్ ఓటుబ్యాంకును కొంచెం కూడా కదిలించలేకపోవడం గమనార్హం.
2014 నుంచి జరిగిన ఉప ఎన్నికల్లో గెలిచిన టీఆర్ఎస్ అభ్యర్థులు
2014 మెదక్ లోక్‌సభ : కొత్త ప్రభాకర్‌రెడ్డి
2015 వరంగల్ లోక్‌సభ : పసునూరి దయాకర్
2016 పాలేరు అసెంబ్లీ : తుమ్మల నాగేశ్వర్రావు
2016 నారాయణ్‌ఖేడ్ అసెంబ్లీ : ఎం భూపాల్‌రెడ్డి
2019లో హుజూర్నగర్ అసెంబ్లీ : శానంపూడి సైదిరెడ్డి
2021 నాగార్జునసాగర్ అసెంబ్లీ : నోముల భగత్