హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ధాన్యం కొనుగోళ్ల అంశంపై పార్లమెంటులో పోరాడుతున్న టీఆర్ఎస్ ఎంపీలు సోమవారం కూడా ఆందోళనలు కొనసాగించారు. యాసంగి ధాన్యం కొనుగోళ్లపై స్పష్టమైన ప్రకటన చేయాలంటూ పార్లమెంటు ఉభయసభలను స్తంభింపజేశారు. రాజ్యసభలో పార్టీ పార్లమెంటరీ నేత కే కేశవరావు, ఎంపీలు కెప్టెన్ లక్ష్మీకాంతరావు, కేఆర్ సురేశ్‌రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్ ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోళ్ల అంశాన్ని తేల్చాలని పట్టుబట్టారు. దాదాపు గంటసేపు నిలబడి నిరసన తెలిపారు. నినాదాలతో హోరెత్తించారు. అయినా కేంద్రం స్పందించకపోవడంతో రాజ్యసభ నుంచి వాకౌట్ చేశారు.
లోక్‌సభలో టీఆర్ఎస్ పక్షనేత నామా నాగేశ్వర్రావు సభ ప్రారంభం కాగానే యాసంగి పంట కొనుగోళ్లపై తేల్చిచెప్పాలని నినాదాలు చేశారు. ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, గడ్డం రంజిత్‌రెడ్డి, మన్నె శ్రీనివాస్‌రెడ్డి, పోతుగంటి రాములు, పసునూరి దయాకర్, మాలోతు కవిత, వెంకటేశ్ నేతకాని స్పీకర్ పోడియానికి ఇరువైపులా వెల్‌లో నిలబడి నినాదాలు చేశారు. రాష్ట్ర రైతాంగాన్ని ఆదుకోవాలని, కేంద్రం మొండి వైఖరిని వీడాలని నినదించారు. కనీస మద్దతు ధరపై జాతీయ విధానం ప్రకటించి, దానికి చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌పై నామా నాగేశ్వర్రావు వాయిదా తీర్మానమిచ్చారు. దీనిని స్పీకర్ ఓం బిర్లా తోసిపుచ్చారు. కేంద్రం దిగొచ్చి, రైతులకు న్యాయం చేసేదాకా తమ పోరాటం కొనసాగుతుందని టీఆర్ఎస్ ఎంపీలు తేల్చి చెప్పారు. టీఆర్ఎస్ ఎంపీల నినాదాలతో లోక్‌సభ దద్దరిల్లింది. స్పీకర్ మాట్లాడే అవకాశం ఇవ్వకపోవడం, కేంద్రం నుంచి కనీస స్పందన లేకపోవడంతో సభ నుంచి వాకౌట్ చేశారు.
అంబేద్కర్ విగ్రహం దగ్గర నినాదాలు
రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా టీఆర్ఎస్ ఎంపీలు ఘన నివాళి అర్పించారు. రాజ్యాంగ స్ఫూర్తికి భిన్నంగా వ్యవహరిస్తున్న కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అంబేద్కర్ విగ్రహం వద్ద కొద్దిసేపు నిరసన చేపట్టారు. ఆహారధాన్యాల సేకరణ, వాటిని నిల్వచేసే బాధ్యతలను కేంద్రం విస్మరిస్తున్నదని విమర్శించారు.
నేడు వినూత్న నిరసన
శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచీ పార్లమెంటులో గట్టిగా పోరాడుతున్నా కేంద్ర ప్రభుత్వ వైఖరి మారకపోవడంతో టీఆర్ఎస్ ఎంపీలు మంగళవారం వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేయనున్నట్టు సమాచారం. ముఖ్యమంత్రి కేసీఆర్ సూచన మేరకు పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నేత నామా నాగేశ్వర్రావు పార్లమెంటులో భావసారూప్యత గల పార్టీలతో సమాలోచనలు జరుపుతున్నట్టు తెలుస్తున్నది.