e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, January 18, 2022
Home News గులాబీ దళం కర్షక గళం

గులాబీ దళం కర్షక గళం

 • ధాన్యం సేకరణపై కేంద్రాన్ని నిలదీసిన టీఆర్‌ఎస్‌ ఎంపీలు
 • మద్దతు ధరపై చట్టం చేయాలని డిమాండ్‌
 • పోడియం వద్ద ధర్నాతో దద్దరిల్లిన ఉభయ సభలు
 • రైతుల పక్షాన నిలిచిన ఎంపీలకు వెల్లువెత్తుతున్న రైతుల మద్దతు
 • టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికి అండగా ఉంటామని ప్రకటన
 • కేంద్రం దిగొచ్చే వరకూ పోరుబాట వీడమన్న ఎంపీ నామా
 • స్వాగతించిన వామపక్ష పార్టీలు

యాసంగిలో ధాన్యం సేకరణపై కేంద్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. వానకాలం, యాసంగి సీజన్లు కలిపి ఎంత ధాన్యం సేకరిస్తారో స్పష్టత ఇవ్వడానికి నిరాకరించింది. ధాన్యం కొనుగోళ్లపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పూటకో మాట, రోజుకో వైఖరితో రైతులు గందరగోళానికి గురవుతున్నారు. దీంతో టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన గళం వినిపించారు. పోడియంలోనే ఉండి ధర్నా చేసి పార్లమెంట్‌ను కుదిపేశారు. సమగ్ర ధాన్యం సేకరణ పాలసీ ప్రకటించాలని పట్టుబట్టారు. ఆహార ధాన్యాల సేకరణలో జాతీయ సమగ్ర విధానాన్ని ప్రకటించాలని కేంద్రాన్ని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర వ్యవసాయ రంగం, రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు. తెలంగాణలో ధాన్యం కొనాలని, ఎమ్మెస్పీపై చట్టం చేయాలని, అమర కిసాన్ల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరారు. టీఆర్‌ఎస్‌ ఎంపీల పోరాటానికి యావత్‌ రైతాంగం మద్దతుగా నిలుస్తున్నది. టీఆర్‌ఎస్‌కు వెన్నంటే ఉంటామని కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటామని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. బీజేపీ సర్కార్‌ మొండి వైఖరిపై కర్షకులు దుమ్మెత్తిపోస్తున్నారు.

ఖమ్మం, డిసెంబర్‌ 1 (నమస్తే తెలంగాణ, ప్రతినిధి): రైతాంగ సమస్యలపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌ ఉభయ సభల్లో చేస్తున్న ఆందోళనలకు ఉమ్మడి జిల్లా రైతాంగం నుంచి మద్దతు లభిస్తున్నది. యాసంగి ధాన్యం సేకరణపై కేంద్రం వైఖరిని నిరసిస్తూ బుధవారం టీఆర్‌ఎస్‌ స్పీకర్‌ పోడియం వద్ద గంటల కొద్దీ బైఠాయించడం, తమ పక్షాన పోరాడడాన్ని రైతాంగం స్వాగతిస్తున్నది. పంటల మద్దతు ధరలకు చట్టబద్ధత కల్పించాలన్న డిమాండ్‌తో టీఆర్‌ఎస్‌ లోక్‌సభా పక్ష నాయకుడు, ఎంపీ నామా నాగేశ్వరరావు వాయిదా తీర్మానాన్ని సైతం ఇచ్చిన సంగతి విదితమే. తెలంగాణలో సాగునీరు పుష్పలంగా లభించడంతో ఏటా రైతులు పెద్ద ఎత్తున వరి సాగు చేస్తారు. ఏటా వరి సాగు విస్తీర్ణం పెరుగుతున్నది. రైతులకు ఇబ్బందులు లేకుండారాష్ట్ర ప్రభుత్వమే ఏటా ధాన్యం కొంటున్నది.

- Advertisement -

ఈ సారి యాసంగిలో కేంద్రం ధాన్యాన్ని కొనలేమని చెప్పడంతో రైతులు ఆందోళనకు గురవుతున్నారు. దీంతో సీఎం కేసీఆర్‌ ఉద్యమానికి పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వం వివిధ రూపాల్లో ఒత్తిడి పెంచే ప్రయత్నాలను ప్రారంభించారు. ఇప్పటికే రెండు జిల్లాల్లో పార్టీ నాయకులు ధర్నాలు సైతం చేశారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్‌ హైదరాబాద్‌లో ధర్నాకు దిగి రైతులకు అండగా నిలిచారు. తాజాగా టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో గళమెత్తుతున్నారు. ఉభయ సభల్లో రైతు సమస్యలను లేవనెత్తుతున్నారు. బుధవారం లోక్‌సభలో స్పీకర్‌ పోడియం ముందు బైఠాయించారు. కేంద్ర ప్రభుత్వ మొండి వైఖరిని ఎండగడుతున్నారు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో సీపీఎం, సీపీఐ, న్యూడెమోక్రసీ పార్టీలు రైతాంగ సమస్యలపై టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళనలను స్వాగతించాయి. భవిష్యత్తులో రైతుల పక్షాన ఇదే రీతిలో ఆందోళనకు పూనుకోవాలని ఆయా పార్టీలు అభిప్రాయపడ్డాయి. రైతులు సైతం టీఆర్‌ఎస్‌ ఎంపీల ఆందోళనకు మద్దతు పలికి స్వాగతించారు.

రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం
దేశంలో రైతులకు న్యాయం జరిగే వరకూ పోరాటం కొనసాగిస్తాం. బీజేపీ సర్కార్‌ ధాన్యం కొనుగోళ్లపై స్పష్టత ఇవ్వకుండా మోసం చేస్తున్నది. కేంద్రం వైఖరిపై పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలందరం నిరసన గళం వినిపించాం. జాతీయ ఆహార ధాన్యాల సేకరణ విధానం, కనీస మద్దతు ధరకు చట్టబద్ధతపై చర్చకు స్పీకర్‌ వాయిదా తీర్మానం ఇచ్చారు. ఈ విషయం సున్నితమైనదని, తెలంగాణ రైతుల సమస్య అని తీర్మానంలో వివరించాను. ఇచ్చిన వాయిదా తీర్మానాన్ని స్పీకర్‌ తిరసరించడం సరికాదు.

 • ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు కేంద్ర విధానాలను ఎండగట్టాల్సిందే..
  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలు అవలంబిస్తున్నది. ధాన్యాన్ని కొనలేమని చెప్పడం దారుణం. దీనిపై పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రాన్ని నిలదీయడం మాకెంతో బలాన్నిచ్చింది. రానున్న ఎన్నికల్లో రైతులు బీజేపీకి తగిన గుణపాఠం చెబుతారు. సీఎం కేసీఆర్‌ వైపే మేమంతా ఉంటాం. మోదీ విధానాలను ప్రతి ఒక్కరూ ఎండగట్టాల్సిందే..
 • చిట్టిన్ని వీరభధ్రం, రైతు, బురద రాఘవాపురం, ఏన్కూరు మండలం

మన ఎంపీలకు సెల్యూట్‌
ధాన్యం సేకరణ, రైతాంగ సమస్యలపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో గళమెత్తడం అభినందనీయం. తెలంగాణపై వివక్ష చూపుతున్న కేంద్రంపై యుద్ధం ప్రకటించారు. కర్షకుల కోసం పార్లమెంట్‌లో పోడియం వద్దకు వెళ్లి ధర్నా చేపట్టడం ఎంతో బలమిచ్చింది. వారికి సెల్యూట్‌ చేస్తున్నా. ఇప్పటికైనా కేంద్రం దిగొచ్చి పంటలకు కనీస మద్దతు ధర కల్పించాలి. రైతు సంక్షేమమే ధ్యేయంగా పోరుబాటపట్టిన టీఆర్‌ఎస్‌ ఎంపీలకు రైతుల మద్దతు ఉంటుంది.

 • తాతా ఉపేందర్‌, రైతు, విశ్వనాథపల్లి, కారేపల్లి మండలం

కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలి
తెలంగాణ రైతులపై కేంద్రం వివక్ష చూపుతున్నది. వివక్షను నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ఎంపీలు చేస్తున్న పోరాటాన్ని మేం స్వాగతిస్తున్నాం. పార్లమెంటులో ప్రస్తావనకు తెచ్చి కేంద్రం నిరసన తెలియజేయడం హర్షణీయం. కేంద్రం దేశంలోని ఇతర రాష్ర్టాల్లో ఎలా అయితే ధాన్యాన్ని కొనుగోలు చేస్తుందో తెలంగాణలోనూ కొనుగోలు చేయాలి. సమగ్రమైన వ్యవసాయ విధానాన్ని అమలులోకి తీసుకురావాలి. కేంద్రం మొండి వైఖరి వీడాలి.

 • పోటు రంగారావు, సీపీఐ(ఎంల్‌) న్యూ డెమోక్రసీ రాష్ట్ర సహాయ కార్యదర్శి, ఖమ్మం

నిరసనలను ఉధృతం చేయాలి
యాసంగిలో ధాన్యం కొనుగోలుపై కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి ప్రదర్శిస్తున్నది. రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చినట్లే ధాన్యం కొనుగోలుపైనా ఉద్యమాలను ఉధృతం చేయాలి. పంటల మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించాలనే విషయంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు చేస్తున్న ఆందోళనను స్వాగతిస్తున్నాం. వారి డిమాండ్లకు కేంద్రం స్పందించాలి. – పోటు ప్రసాద్‌, సీపీఐ జిల్లా కార్యదర్శి, ఖమ్మం

రైతులకు అండగా టీఆర్‌ఎస్‌
టీఆర్‌ఎస్‌ రైతులకు అండగా నిలుస్తున్నది. కేంద్రం ధాన్యం కొనుగోలు చేయాల్సిందేనని టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో నిలదీయడం హర్షణీయం. తెలంగాణలో ధాన్యం కొనుగోలు చేసే వరకు ఎంపీలు పోరాటం సాగించాలని కోరుతున్నాం. రైతు ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు రూ. 25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని కోరడాన్ని స్వాగతిస్తున్నాం.

 • కుంజా నాగయ్య, రైతు, దుమ్ముగూడెం

కేంద్రం రాజకీయాలు ఆపాలి..
రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా కేంద్రం తప్పించుకోవాలని చూస్తున్నది. కాలయాపన చేస్తున్నది. రైతులకు అన్యాయం చేయాలనుకోవడం దారుణం. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు చేస్తున్న పోరాటానికి మేం మద్దతు ఇస్తున్నాం. కేంద్రం స్పందించే వరకు ఆందోళనలు కొనసాగుతూనే ఉంటాయి.

 • చిన్ని రామకృష్ణ, గ్రామస్తుడు, కమలాపురం, మణుగూరు మండలం

ఎంపీల పోరాటం స్ఫూర్తిదాయకం..
రైతుల పక్షాన నిలబడి తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో పోరాటం చేస్తున్నారు. పార్లమెంట్‌లో పోడియం వద్దకు వెళ్లి నిరసన తెలుపుతున్నారు. రైతుల కోసం బలంగా నిలబడుతున్నారు. వారి పోరాటం స్ఫూర్తిదాయకం. కొన్నిరోజులుగా ధాన్యం కొనుగోలుపై రైతుల్లో ఆందోళన ఉన్నది. టీఆర్‌ఎస్‌ ఎంపీలు మా తరఫున పోరాటం చేస్తున్నారు. వారికి రైతుల తరఫున ధన్యవాదాలు.

 • తిరుమల శెట్టి జానయ్య, రైతు, చిరుమర్రి, ముదిగొండ మండలం

ఎంపీలు ధాన్యం కొనేలా చేస్తారు..
టీఆర్‌ఎస్‌ ఎల్లప్పుడూ రైతుల పక్షాన నిలుస్తుందని చెప్పడానికి ఎంపీలు చేస్తున్న నిరసనే నిదర్శనం. రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ఇబ్బందులు ఎ దురైనా ధాన్యం కొంటున్నది. కరోనా వంటి సంక్షోభ కాలంలోనూ చివరి ధాన్యం గింజ వరకూ కొన్నది. రైతుల ఖాతాల్లో డబ్బు జమ చేసింది. కేంద్ర ప్రభుత్వం యాసంగి ధాన్యాన్ని కొనలేమని చెప్పడం అన్యాయం. రైతుల తరఫున పోరాటం చేస్తున్న ఎంపీలకు కృతజ్ఞతలు.

 • ధనియాకుల ప్రభాకర్‌రావు, రైతు, గోకినేపల్లి, ముదిగొండ మండలం

ఎంపీల ఆందోళనను స్వాగతిస్తున్నాం
ధాన్యం కొనుగోలు విషయంపై టీఆర్‌ఎస్‌ ఎంపీలు కేంద్రానికి వ్యతిరేకంగా ఉద్యమించడాన్ని మేం స్వాగతిస్తున్నాం. ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి కేంద్రం మెడలు వంచాలి. యాసంగిలో రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేసేలా చేయాలి. రాష్ట్ర రైతాంగం పండించిన ధాన్యాన్ని కేంద్రం 100 శాతం కొనుగోలు చేయాల్సిందే.
-నున్నా నాగేశ్వరరావు, సీపీఎం జిల్లా కార్యదర్శి, ఖమ్మం

బీజేపీ, కాంగ్రెస్‌ రాజకీయాలు శోచనీయం
తెలంగాణ రైతాంగంపై కాంగ్రెస్‌, బీజేపీలు చేస్తున్న రాజకీయాలు శోచనీయం. రాష్ట్రంలో వ్యవసాయ రంగ అభివృద్ధిని సహించలేక ఆ పార్టీలు రాజకీయాలు చేస్తున్నాయి. పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలు రాష్ట్ర రైతాంగానికి మద్దతుగా పోడియం వద్ద ధర్నా చేశారు. అయినా కేంద్రం స్పందించ డం లేదు. రైతుల తరఫున పోరాటం చేస్తున్న ఎం పీలకు కృతజ్ఞతలు.

 • బాగం వెంకటేశ్వరరావు, రైతు, సిద్ధిక్‌నగర్‌ గ్రామం, కొణిజర్ల

రైతు పక్షపాతి సీఎం కేసీఆర్‌
సీఎం కేసీఆర్‌ రైతు పక్షపాతి. ఆయన నేతృత్వంలో ఢిల్లీలో మన ఎంపీలు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రైతుల పక్షాన పోరాటం చేస్తున్నారు. పార్లమెంటు పోడియం ముందు బైఠాయించి కేంద్రంపై గళం విప్పారు. కేసీఆర్‌ దీక్ష చేపట్టిన మరుసటి రోజే కేంద్రం రైతు చట్టాలను రద్దు చేస్తామని ప్రకటించింది. ఈ దీక్షతో కేసీఆర్‌ దేశ రైతులకు మేలు చేశారు.

 • గడ్డం సుబ్బారావు, రైతు, మాటూరుపేట, మధిర మండలం

రైతులకు అన్యాయం..
రైతు లేనిదే ప్రపంచం లేదు. తిండీ లేదు. రైతులు పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వం కొనకపోగా వారిని అన్యాయం చేయాలని చూస్తున్నది. దీనిపై తెలంగాణ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన తెలపడం హర్షణీయం. తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షాన నిలుస్తుంది అనడానికి ఇదే నిదర్శనం. వారికి అండగా రైతులు ఉంటారు. కేంద్రం మెడలు వంచుతారు.

 • పెరుగు వెంకన్న, రైతు, కోయగూడెం, టేకులపల్లి మండలం

అశువులు బాసిన రైతులకు పరిహారం ఇవ్వాలి
రైతాంగ సమస్యల కోసం పోరా టం చేసి మృతిచెందిన వారికి కేంద్రం నష్ట పరిహారం ఇవ్వాలి. ఇవ్వక పోతే రైతుల ఉసురు బీజేపీ సర్కార్‌కు తగులుతుంది. పార్లమెంట్‌లో మన ఎంపీలు చేస్తున్న నిరసనకు రైతులంతా మద్దతుగా ఉంటారు. ఎక్కడా రాజీ లేదు. జైకిసాన్‌ అంటూ నినదిస్తాం తెలంగాణ ప్రభుత్వం రైతుల పక్షపాతి. కేంద్రం రైతులు జోలికి వస్తే ఊరుకోం.

 • బత్తుల శోభన్‌, రైతు సమితి అధ్యక్షుడు, దుమ్ముగూడెం

పార్లమెంట్‌ సభ్యులకు మా మద్దతు..
కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అడ్డగోలుగా చట్టాలు తీసుకువస్తున్నది. రైతులను గందరగోళంలోకి నెడుతున్నది. రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కొనలేమని చెప్పడం సమంజసం కాదు. టీఆర్‌ఎస్‌ ఎంపీలు పార్లమెంట్‌లో నిరసన తెలిపి రైతులకు అండగా నిలుస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ధన్యవాదాలు.

 • మోకాళ్ల బుచ్చయ్య, రైతు, గుండాల
Advertisement

Most Viewed

-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement