హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): సింగరేణి కార్మికులతో చెలగాటం ఆడొద్దని కేంద్ర ప్రభుత్వాన్ని టీఆర్ఎస్ హెచ్చరించింది. 4 బొగ్గు బ్లాకులను వేలం వేయాలని తీసుకొన్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది. వేలం ఆపకుంటే పెద్దఎత్తున ఉద్యమాన్ని చేపడతామని స్పష్టం చేసింది. వేలం ఆపాలంటూ సింగరేణి కార్మికులు చేపట్టిన సమ్మెకు టీఆర్ఎస్ పార్టీ సంఘీభావాన్ని ప్రకటించింది.
గురువారం తెలంగాణ భవన్లో ఎంపీలు వెంకటేశ్‌నేత, గడ్డం రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ మాదిరెడ్డి శ్రీనివాస్‌రెడ్డి, పెద్దపల్లి జడ్పీ చైర్మన్ పుట్ట మధు విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌నేత కేంద్రంపై నిప్పులు చెరిగారు. ప్రధాని మోదీ నిన్నటిదాకా రైతుల జీవితాలతో ఆడుకొని ఇప్పుడు సింగరేణి కార్మికుల జీవితాలతో ఆటలు ఆడుతున్నారని మండిపడ్డారు.
సీఎం కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాలతో సింగరేణి లాభాల బాటలో పయనిస్తున్న తరుణంలో జేబీఆర్‌ఓసీ-3, శ్రావణ్‌పల్లి ఓసీ, కోయగూడెం ఓసీ-3, కేకే6యూజీ బ్లాక్‌లను వేలం వేసి ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టాలని ప్రధాని మోదీ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. వీటిని వేలం వేయటం ద్వారా ఎస్సీ, ఎస్టీ వర్గాల పిల్లల ఉపాధికి అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఎంపీలు బండి సంజయ్, అర్వింద్ ఇందుకు బాధ్యత వహించాలని అన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలకు సిగ్గు, శరం, చీమూనెత్తురు ఉంటే కేంద్రాన్ని ఒప్పించి వేలాన్ని ఆపించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం చేస్తున్న సమ్మెకు టీఆర్ఎస్ సంపూర్ణ మద్దతు ఇస్తుందని, అవసరమైతే ఢిల్లీలో ధర్నా చేపడతామని ఆయన ప్రకటించారు.
కలిసివచ్చేవాళ్లతో కలిసి పోరాడతాం: ఎంపీ రంజిత్‌రెడ్డి
సీఎం కేసీఆర్ నాయకత్వంలో సింగరేణి కార్మికులకు భద్రత పెరిగిందని ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి అన్నారు. ఇప్పటికే అనేక సంస్థల్ని ప్రైవేట్‌కు కట్టబెట్టిన కేంద్రం కన్ను ఇప్పుడు సింగరేణిపై పడిందని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా అన్ని వర్గాల వ్యతిరేకతను మోదీ సర్కారు మూటగట్టుకుంటున్నదని మండిపడ్డారు. కోల్ బ్లాక్‌ల వేలానికి వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో పెద్ద ఎత్తున ఉద్యమాన్ని కొనసాగిస్తామని స్పష్టం చేశారు.
అదానీ, అంబానీలకు కట్టబెట్టడమే మోదీ లక్ష్యం: ఎమ్మెల్యే గండ్ర
దేశవ్యాప్తంగా లాభాల బాటలో నడిచే సంస్థల్ని అదానీ, అంబానీలకు కట్టబెడుతున్నారని, అందులో భాగంగానే సింగరేణి సంస్థను దశలవారీగా నీరుగార్చటమే ప్రధాని మోదీ లక్ష్యం అని ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆరోపించారు. సింగరేణిలో కేంద్రం వాటా 49 శాతమే అని, రాష్ట్ర ప్రభుత్వ వాటా 51 శాతం ఉన్నదని, ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా కేంద్రం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు.