హైదరాబాద్ : జీహెచ్ఎంసీలో 30 సర్కిళ్లు, 6 జోన్లు ఏర్పాటు చేసినందుకు టీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ ధన్యవాదాలు తెలిపారు. శాసనసభలో బడ్జెట్ పద్దులపై చర్చ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడారు. నగర శివారు ప్రాంతాలు వేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఈ ప్రాంతాల్లో జనాభా పెరుగుతుంది.. మౌలిక సదుపాయాలు ఎన్ని కల్పించినా అక్కడక్కడ సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని చెప్పారు.
హైదరాబాద్ నగరంలో తాగునీటి సమస్య చాలా వరకు తీరిందన్నారు. గడిచిన నాలుగైదు ఏండ్ల నుంచి నగరంలో తాగునీటి సమస్య లేదన్నారు. నగర ప్రజలకు తాగునీరు అందించాలనే ఉద్దేశంతో.. శివారు ప్రాంతాల్లో రిజర్వాయర్లను ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. భవిష్యత్‌లో తాగునీటి సమస్యలు రాకుండా ఉండేందుకు ప్రస్తుతమున్న రూ. 250 కోట్లకు అదనపు కేటాయింపులు చేయాలని కోరారు. ఇంటింటికీ నీళ్లు ఇస్తామన్న మాట నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్ అని తెలిపారు. ఉచితంగా నీరు అందిస్తామని చెప్పి.. అమలు చేయడంతో నగర ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బల్క్ వాటర్ కనెక్షన్ నుంచి ఇండివిజ్యువల్ కనెక్షన్‌కు మారేందుకు సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. వ్యూహాత్మక నాలా అభివృద్ధి పథకం మంచి నిర్ణయమని ఎమ్మెల్యే వివేకానంద గౌడ అన్నారు.