ఒక పార్టీని స్థాపించడం, నడిపించడం చాలా కష్టం. అందునా జాతీయపార్టీలే పెద్ద సైజు ప్రాంతీయ పార్టీలుగా మారుతున్న సంధికాలంలో, ఒక ప్రాంతీయ పార్టీ ఇరువై ఏండ్ల సక్సెస్ఫుల్ జర్నీ సులువైనదేమీ కాదు. చాలా విలువైనది కూడా. ఒక ఉద్యమాన్ని నిర్మించి, లక్ష్యాన్ని ముద్దాడి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలించడం పరిపాలనాదక్షుడైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కే సాధ్యమైంది.
తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) పార్టీ అధినేత అయిన కేసీఆర్ ముమ్మాటికీ ఉద్యమ రథి, ప్రభుత్వ సారథి, రాష్ర్టాన్ని బంగారు తెలంగాణగా మార్చిన మార్గదర్శి. చరిత్రలో నిలిచిపోయే ‘రైతుబంధు’, ‘దళితబంధు’ వంటి అనేక వినూత్న పథకాలతో తెలంగాణ బిడ్డల ఆత్మబంధుగా మారిన కేసీఆర్‌కే ఈ అరుదైన గౌరవం దక్కుతుంది.
దేశంలో కేంద్ర ప్రభుత్వాల ఏకపక్ష, పక్షపాత పాలన కారణంగానే అభివృద్ధిలో ప్రాంతీయ అసమానతలు పెరిగాయి. ప్రజల ఆకాంక్షల మేరకు ఆత్మగౌరవ నినాదంతో రాష్ర్టాల్లో ప్రాంతీయపార్టీలు ఆవిర్భవించాయి. అధికారంలో కి వచ్చాయి. స్వాతంత్య్రానికి ముందే.. 1920లో పంజాబ్‌లో శిరోమణి అకాలీదళ్; 1925లో సీపీఐ; 1927లో హైదరాబాద్ స్టేట్‌లో ఆల్ ఇండి యా మజ్లిస్, ఇత్తెహదుల్ ముస్లిమీన్; 1939లో పశ్చిమబెంగాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్; 1932లో జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్; 1940లో కేరళలో రెవెల్యూషనరీ సొషలిస్ట్ పార్టీలు ప్రాంతీయంగా ఏర్పడ్డాయి.
అయితే, దేశంలో జాతీయపార్టీలను కాదని ప్రాంతీయపార్టీలకు ప్రజలు పట్టం కట్టడం 1950 దశాబ్దంలోనే మొదలైంది. తమిళనాడులో అన్నాదురై నాయకత్వంలో ‘ద్రవిడ మున్నేట్ర కజగం’ (డీఎంకే) అధికారంలోకి వచ్చింది.1963లో ఏర్ప డిన మహారాష్ట్ర వాది గోమంతక్ పార్టీ గోవాలో కొంతకాలం అధికారంలో ఉన్నది. 1972లో తమిళనాడులో ఏర్పడిన ఆల్ ఇండియా అన్నా ద్రావిడ మున్నేట్ర కజగం (ఏఐఏడీఎంకే) డీఎంకేకు ప్రతి గా అధికారాన్ని చేపట్టింది.
1972లో శిబూ సోరెన్ నాయకత్వంలో జార్ఖం డ్ ముక్తి మోర్చా, 1982లో నాటి ఉమ్మడి ఏపీలో టీడీపీ, 1984లో యూపీలో బీఎస్పీ, 1985లో అసోంలో అస్సాం గణపరిషత్, 1992లో యూపీ లో సమాజ్ వాదీ పార్టీ, 1997లో బీహార్‌లో రాష్ట్రీ య జనతాదళ్, ఒడిషాలో బిజూజనతాదళ్, 1998 లో బెంగాల్లో తృణమూల్ కాంగ్రె స్, 1999లో దేవెగౌడ, నితీష్‌కుమార్‌లు వేర్వేరుగా జనతాదళ్ సెక్యులర్, జనతాదళ్ యునైటెడ్ పార్టీలు అధికా రం చేపట్టాయి. 2001లో చిరకాల ప్రజల ఆకాంక్ష రాష్ట్రసాధన లక్ష్యంగా టీఆర్ఎస్, 2009లో ఏర్పడిన వైఎస్ఆర్సీపీ, 2012లో ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీలు ఆయా రాష్ర్టాల్లో అధికారంలోకి వచ్చాయి. మహారాష్ట్రలో శివసేన, ఎన్సీపీ, జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్, మిజోరంలో మిజో నేషనల్ ఫ్రంట్ తదితర ప్రాంతీయపార్టీలకు కూడా ప్రజల్లో మంచి ఆదరణ ఉన్నది. ఆయా పార్టీల ఆవిర్భావానికి ఆయా రాష్ర్టాల్లోని ప్రత్యేక పరిస్థితులే కారణం.
తెలంగాణలో టీఆర్ఎస్ ప్రస్థానం విశిష్టమైనది. తెలంగాణ త్యాగాల పునాదులపై నిలబడింది. తెలంగాణలో ఆంధ్ర కలిసిన నాటినుంచే ఈ కృత్రి మ విలీనానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు ఉద్భవించాయి. ఈ నేపథ్యంలోంచే మలిదశ ఉద్య మం పురుడుపోసుకొని తెలంగాణ సాకారమైంది.
శాంతియుతంగా ఉద్యమం: నాలుగు సార్లు ఎమ్మెల్యేగా, రెండుసార్లు మంత్రిగా వ్యవహరించిన కేసీఆర్ డిప్యూటీ స్పీకర్ పదవికి 2001 ఏప్రిల్ 21న రాజీనామా చేసి 2001 ఏప్రిల్ 27న టీఆర్ఎస్ను ఏర్పాటుచేశారు. పదవీ త్యాగం పునాది మీద, తెలంగాణ రాష్ట్ర ఆకాంక్షతో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. సుదీర్ఘ ఉద్యమాలు, ప్రాణత్యాగాలు, సాఫల్యాలుగా టీఆర్ఎస్ ఉద్యమ ప్రస్థానం కొనసాగింది. ఈ 14 ఏండ్ల ఉద్యమాన్ని కేసీఆర్ శాంతియుతంగా నిర్వహించటం గమనార్హం.
వ్యూహాలు, ఎత్తుగడలతో ఉద్యమానికి ఊపు: 2004 ఎన్నికల్లో కాంగ్రెస్‌తో పొత్తుతో, కరీంనగర్ లో అప్పటి యూపీఏ చైర్పర్సన్, కాంగ్రెస్ అధినేత్రి సోనియాతో ప్రత్యేక తెలంగాణ ఇస్తామని ప్రకటింపజేయడం ఒక మైలురాయి. దేశంలోని 35 పార్టీల అభిప్రాయాలను తెలంగాణకు అనుకూలంగా తీసుకరావడం వంటివన్నీ తెలంగాణ సాధనకు చేరువ చేసిన ఎత్తుగడలు. 2006లో యూపీఏ నుంచి బయటకు వచ్చి, చేసిన రాజీనామాలు, కరీంనగర్ ఉప ఎన్నికలో రెండు లక్షలకు పైగా మెజార్టీ విజయం నాటి ఉద్యమానికి ఓ సరికొత్త ఊపు.
సావు నోట్లో తల పెట్టి: ‘కేసీఆర్ సచ్చుడో, తెలంగాణ వచ్చుడో’ తేలిపోవాలని, 2009 నవంబర్ 29న కేసీఆర్ తెలంగాణ సాధన లక్ష్యంగా ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. 2009, డిసెంబర్ 9 చరిత్రాత్మకంగా చిదంబరం తెలంగాణ ప్రక్రియను ప్రారంభిస్తున్నామని ప్రకటించి, కొద్ది గంటల్లోనే యూ టర్న్ తీసుకున్నది. దీనికి నిరసనగా తెలంగాణలో ఉద్యమం ఉధృతమై ప్రాణత్యాగాల కొలిమి గా తెలంగాణ మారింది. ఉమ్మడి రాష్ట్ర అసెంబ్లీలో 2014 జనవరి 30న ప్రవేశపెట్టగా, లోక్‌సభలో ఫిబ్రవరి 18న,రాజ్యసభలో ఫిబ్రవరి 20న ఆమోదం పొందింది. రాష్ట్రపతి మార్చి 1న తెలంగాణ బిల్లుకు ఆమోదం తెలిపినప్పటికీ, గెజిట్‌లో 2014 జూన్ 2 అపాయింటెడ్ డేగా పేర్కొన్నారు. దీంతో జూన్ 2న, తెలంగాణ రాష్ట్రం అవతరించింది.
తెలంగాణ ఆవిర్భావం-అభివృద్ధి చరిత్ర: ఉద్యమాన్ని నడిపిన నేత కేసీఆరే, ప్రభుత్వాధినేత అయ్యారు. దీంతో ఉద్యమకాలంలో ప్రజల ఆకాంక్షలు, అవసరాలు, తెలంగాణ వనరులు, భౌగోళిక పరిస్థితులు తెలిసిన కేసీఆర్‌తో ఆధునిక తెలంగాణ చరిత్ర కొత్తపుంతలు తొక్కుతున్నది. సాగునీటి ప్రాజెక్టులు, అభివృద్ధి, సంక్షేమాలను సమపాళ్లల్లో మేళవించి చేస్తున్న అభివృద్ధి మన్ననలు పొందుతున్నది. కాళేశ్వరం ప్రాజెక్టు, ఎస్సారెస్పీ, దేవాదుల నీళ్ళు నీలి విప్లవాన్ని తెచ్చాయి. గ్రామాలు సస్యశ్యామలమవుతున్నాయి. తెలంగాణ కోటి ఎకరాల మాగాణమైంది.
ప్రజల్లో పెరిగిన ప్రాబల్యం: 2014 వరకు టీఆర్ఎస్కు 34.04 శాతం ఓట్లు వచ్చాయి. తెలంగాణలో 2009, 2014 మధ్య ఐదేండ్లలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీల ఓటు వాటా 20 శాతం తగ్గి కను మరుగయ్యాయి. 2009లో కేవలం 4 శాతం నుం చి 2014లో 34.04 శాతానికి ఓటు వాటాను పెంచుకోవడం ద్వారా టీఆర్ఎస్ తెలంగాణలో అజేయ రాజకీయ శక్తిగా ఎదిగింది. 2018లో 46.86 శాతం ఓట్ల బలం, బలగంతో ప్రతి ఎన్నికలోనూ టీఆర్ఎస్ విజయ ఢంకా మోగిస్తున్నది.
ప్రభుత్వం, పార్టీ వేర్వేరు కాదు. పార్టీ సిద్ధాంతా లు, మ్యానిఫెస్టోలే ప్రభుత్వ లక్ష్యాలుగా మారుతా యి. అవే ఆ తర్వాత పథకాలుగా రూపుదిద్దుకొని అమలవుతాయి. అంటే, పార్టీ-ప్రభుత్వం-అభివృద్ధి-యంత్రాంగం ఎడతెగకుండా ఉండాల్సిన ఓ గొలుసు. తెలంగాణలో ఆ గొలుసుకట్టును సరిగ్గా, సమర్థవంతంగా నడిపిస్తున్నది టీఆర్ఎస్.
పద్నాలుగేండ్ల ఉద్యమ ప్రస్థానంలోనూ, తెలంగాణ ఆవిర్భావం తర్వాత ప్రభుత్వాన్ని నడపడంలోనూ, ఆయా పథకాల రూపకల్పన, అమల్లోనూ, సుపరిపాలన అందించడంలోనూ, మానవతను చాటుకోవడంలోనూ, ఆత్మగౌరవంతో ప్రజలను నిలబెట్డంలోనూ టీఆర్ఎస్, ఆ పార్టీ అధినేత కేసీఆర్ కృషి ఎనలేనిది. ఉద్య మ పార్టీగా టీఆర్ఎస్ క్రమశిక్షణాయుత కార్యకర్తల సైన్యం గలది. ఈ రోజు టీఆర్ఎస్ ఇరువై ఏండ్ల ఉత్సవాలను జరుపుకొంటున్నది. పార్టీ అధినేత కేసీఆర్ నేతృత్వంలోనే పైరుపచ్చల బంగారు తెలంగాణ కావాలని ఆశిద్దాం.
మార్గం లక్ష్మీనారాయణ
98489 97273