పవన్ కళ్యాణ్ మాత్రమే కాదు.. త్రివిక్రమ్‌కు సైతం జీవితాంతం మరచిపోలేని డిజాస్టర్ అజ్ఞాతవాసి. పవన్ కళ్యాణ్ 25వ సినిమా అంటూ ఆకాశమంత అంచనాలతో వచ్చిన ఈ సినిమా అత్యంత దారుణంగా నిరాశ పరిచింది. దాంతో త్రివిక్రమ్ కు ఆ లోటు అలాగే ఉండిపోయింది. అందుకే ఆ కసి ఇప్పుడు మరో సినిమాపై చూపిస్తున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఈ ఇద్దరూ ముందు మంచి స్నేహితులు ఆ తర్వాతే టెక్నీషియన్స్. పవన్ కోసం ఏం చేయడానికైనా సిద్ధంగానే ఉంటాడు మాటల మాంత్రికుడు. ఇప్పుడు కూడా ఇదే చేస్తున్నాడు.
తాను ఇండస్ట్రీలో అగ్ర దర్శకుడిగా ఉన్నా కూడా తన స్నేహితుడు పవన్ కళ్యాణ్ కోసం ఒక మెట్టు దిగి డైలాగ్ రైటర్ గా మారాడు. పవన్ సినిమా కోసం స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నాడు. పవన్ చేతిలో ప్రస్తుతం 6 సినిమాలు ఉన్నాయి. అందులో వకీల్ సాబ్ ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుంది. మరోవైపు క్రిష్ దర్శకత్వంలో సినిమా కూడా త్వరలోనే పట్టాలెక్కింది. హరీష్ శంకర్, సురేందర్ రెడ్డి లైన్ లో ఉన్నారు. వీళ్లతో పాటు ఈ మధ్య సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు పవన్. మలయాళంలో బ్లాక్ బస్టర్ గా నిలిచిన అయ్యప్పుమ్ కొషియన్ సినిమాకు ఇది రీమేక్. ఈ సినిమా తెలుగులో చేయాలని.. చేస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ కు రిఫర్ చేసింది త్రివిక్రమ్ శ్రీనివాసే. దాంతో సినిమా బాధ్యతలు కూడా ఈయన తీసుకున్నాడు.
ఈ సినిమాకు స్క్రీన్ ప్లే, మాటలు రాస్తున్నాడు త్రివిక్రమ్. కుర్ర దర్శకుడు కావడంతో అతనికి గురూజీ సహాయ సహకారాలు అందిస్తున్నాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ రీమేక్ కు సాగర్ కే చంద్ర దర్శకుడు అయితే దర్శకత్వ పర్యవేక్షణ త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్నమాట. అంతే కాదు కథ విషయంలో కూడా ఆయన తగిన మార్పులు చేస్తున్నాడు. డైలాగ్ వెర్షన్ సిద్ధం చేస్తున్నాడు. స్క్రీన్ ప్లే లో కీలకమైన మార్పులు చేసి పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గట్టుగా తెలుగులో ఈ కథకు తుది మెరుగులు దిద్దుతున్నాడు త్రివిక్రమ్. పవన్ ఎప్పుడు ఏ డైలాగ్ చెబితే బాగుంటుంది అనే విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు త్రివిక్రమ్.
ఈ సినిమాతో అజ్ఞాతవాసి చేదు జ్ఞాపకం మరిపించాలని ప్రయత్నిస్తున్నాడు మాటల మాంత్రికుడు. పదేళ్ల కింద తాను స్టార్ డైరెక్టర్ అయినా కూడా పవన్ కోసం తీన్ మార్ కోసం మాటలు రాసాడు త్రివిక్రమ్. ఇప్పుడు మరోసారి ఇదే చేస్తున్నాడు. ఏదేమైనా కూడా పవన్, త్రివిక్రమ్ కలుస్తున్నారనే ఆలోచన కూడా అభిమానులకు ఫుల్ కిక్ ఇస్తుంది. ఇక ఈ సినిమా హిట్టయితే అజ్ఞాతవాసి ఈజీగా మరిచిపోతారు అభిమానులు.