శంకర్పల్లి రూరల్, జూలై 14 : గిరిజనులు వ్యవసాయం చేసుకునే బిల్లా దాఖలా భూముల్లో రియల్ వ్యాపారులు పాగా వేశారని శంకర్పల్లి మండలం మోకిలతండా గ్రామ గిరిజన రైతులు అన్నారు. మంగళవారం వారు మాట్లాడుతూ.. గత 30 రోజులుగా దీక్ష చేస్తున్న తమ వైపు ప్రభుత్వ పెద్దలు కానీ, ప్రజాప్రతినిధులు కానీ కన్నెత్తి చూడటం లేదని ఆవేదన చెందుతున్నారు. మమ్మల్ని పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో సరైన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు.
అన్యాయంగా, అక్రమంగా సర్వే నంబర్ లేని 32 ఎకరాల బిల్లా దాఖలా భూములను కొందరు బడా రియల్ వ్యాపారులు ధనార్జనే ధ్యేయంగా రెవెన్యూ అధికారులతో కుమ్మకై సొంతం చేసుకుని మా ఉసురు పోసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాణాలు పణంగా పట్టైనా సరే.. మా భూములను రక్షించుకుంటామన్నారు. న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని, మున్ముందు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు.