హైదరాబాద్ : నగరంలో విషాద ఘటన చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులు రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. చర్లపల్లి-ఘట్కేసర్ రైల్వేస్టేషన్ల మధ్య ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. వారి ఆత్మహత్యలకు గల కారణాలు తెలియాల్సి ఉందని చెప్పారు.
ఇవాళ తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో రైల్వే ట్రాక్‌పై మూడు మృతదేహాలు పడి ఉండటాన్ని చూసిన గూడ్స్ రైలు లోకోపైలట్ వాకీటాకీ ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాంతో పోలీసులు హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకున్నారు. మృతులు బోడుప్పల్ ప్రాంతానికి చెందిన తల్లి పిన్నింటి విజయశాంతి (38), కొడుకు విశాల్ రెడ్డి, కుమార్తె చేతన రెడ్డిలుగా గుర్తించారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. విజయశాంతి కూతురు చేతన రెడ్డి ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతుండగా, కొడుకు విశాల్ రెడ్డి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాడు. విజయశాంతి తన ఇద్దరు పిల్లలతో హైదరాబాద్‌లోని బోడుప్పల్లో ఉంటుండగా.. ఆమె భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నాడు.