పెద్దఅడిశర్లపల్లి/ మిర్యాలగూడ రూరల్, మార్చి 18 : మిర్యాలగూడ మండలంలోని కాల్వపల్లి గంగమ్మగట్టు వద్ద ఎన్నెస్పీ మేజర్ ముల్కల కాల్వలో మునిగి వ్యక్తి మృతిచెందాడు. మిర్యాలగూడ రూరల్ ఎస్ఐ బి.సర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ జిల్లా మిర్యా లగూడ పట్టణం సీతారాంపురం వీధికి చెందిన మేడబోయిన భాస్కర్(37) శుక్రవారం స్నేహితులతో కలిసి హోలి వేడుకలు జరుపుకొన్నాడు. ఇదేరోజు తన పుట్టిన రోజు కావడంతో గంగమ్మ గట్టు వద్దకు వెళ్లి కేక్ కట్ చేసి దావత్ చేసుకున్నారు. అనంతరం ముల్కల కాల్వలో ఈతకు దిగారు. ఈ క్రమంలో భాస్కర్ కల్వర్టు మీది నుంచి కాల్వలోకి దూకాడు. నీట మునిగి ఎంతకూ బయటకు రాకపోవడంతో స్నేహితులు ఆందోళన చెందారు. భాస్కర్ అన్న శ్రీనివాస్‌కు సమాచారం అందించగా సంఘటనా స్థలానికి వచ్చి కాల్వలో వెతుకగా మృత దేహం లభ్యమైంది. శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పంచనామా నిర్వహించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ప్రాంతీయ దవాఖానకు తరలించారు. మృతుడికి భార్య తిరుపతమ్మ, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు.
హోలి వేడుకల్లో విషాధం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా పెద్దఅడిశర్లపల్లి మండలంలోని అక్కంపల్లి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ సమీపంలోని ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో యువకుడు గల్లంతయ్యాడు. మిర్యాలగూడ మండలంలో ఎన్నెస్పీ మేజర్ ముల్కల కాల్వలో మునిగి వ్యక్తి మృతిచెందాడు. వివరాలిలా ఉన్నాయి.. కొండమల్ల్లేపల్లి మండలం చిన్న అడిశర్లపల్లి గ్రామానికి చెందిన మహేశ్ (25) కొండమల్లేపల్లిలో మొబైల్ షాపులో పనిచేస్తు న్నాడు. శుక్రవారం హోలి సంబురాల్లో పాల్గొన్న మహేశ్.. స్నేహితులతో కలిసి ఏఎమ్మార్పీ ప్రధాన కాల్వలో ఈతకు వెళ్లాడు. గేటు పైనుంచి కాల్వలోకి దూకిన మహేశ్ అధిక ప్రవాహానికి కొట్టుకుపో యాడు. ఎంతకూ బయటికి తేలకపోవడంతో స్నేహితులు పోలీసులకు సమాచారమిచ్చారు. మహేశ్ ఆచూకీ కోసం పోలీసులు, బంధువులు గాలిస్తున్నారు.