
హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో టెంపుల్ టూరిజం వృద్ధిబాటలో పయనిస్తున్నది. ప్రముఖ పుణ్యక్షేత్రాలున్న జిల్లాలను సందర్శించేవారి సంఖ్య పెరుగుతున్నది. కరోనా ఉద్ధృతి తగ్గిన నేపథ్యంలోనూ ఇతర పర్యాటక ప్రాంతాలతో పోల్చుకొంటే, ఆధ్యాత్మిక కేంద్రాలున్న ప్రాంతాలు ఎక్కువగా కళకళలాడుతున్నాయి. ఈ ఏడాది జూలై వరకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కలిపి కోటీ 66 లక్షల మంది పర్యాటక ప్రాంతాలను సందర్శించగా, ఇందులో కోటీ 18 లక్షల మంది ఆధ్యాత్మిక క్షేత్రాలను సందర్శించడం విశేషం. 2019, 2020 సంవత్సరాల్లో హైదరాబాద్‌ను సందర్శించిన వారి కంటే వేములవాడ రాజన్న కొలువుదీరిన రాజన్న సిరిసిల్ల జిల్లాను సందర్శించినవారి సంఖ్య ఎక్కువగా ఉన్నది. లక్ష్మీనరసింహస్వామి కొలువుదీరిన యాదాద్రి భువనగిరి జిల్లా, రాములోరు నడియాడిన భద్రాది కొత్తగూడెం, చదువుల తల్లి బాసర సరస్వతీదేవి కొలువైన నిర్మల్, దక్షిణ భారత్‌లోనే ప్రముఖ డియోసెస్ చర్చి ఉన్న మెదక్ జిల్లాలను ఎక్కువ సంఖ్యలో సందర్శిస్తున్నారు.
పుణ్యక్షేత్రాల్లో హరితహోటళ్లకు గిరాకీ
పుణ్యక్షేత్రాలున్న ప్రాంతాల్లోనే హరిత హోటళ్ల బుక్సింగ్స్ ఎక్కువగా ఉంటున్నాయి. హైదరాబాద్ నుంచి వేములవాడ, యాదాద్రి, కొమురవెళ్లి, కొండగట్టుకు టూరిజం ప్రత్యేక ప్యాకేజీలు నిర్వహిస్తున్నాం. యునెస్కో గుర్తింపు పొందిన రామప్పతోపాటు యాదాద్రిలో టూరిజం, హరితహోటళ్ల అభివృద్ధిపై దృష్టి సారించాం.
