లాస్ ఏంజిల్స్: టామ్ క్రూజ్ నటించిన టాప్ గన్ మావరిక్ చిత్రాన్ని పారామౌంట్ పిక్చర్స్ సంస్థ నిర్మించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ ఫిల్మ్ ప్రపంచవ్యాప్తంగా బాక్సాఫీసు రికార్డులను బద్దలు కొడుతోంది. అయితే ఈ సినిమాపై కాపీరైట్ ఉల్లంఘన కింద కోర్టులో దావా దాఖలైంది. 1986లో రిలీజైన టాప్ గన్ చిత్రాన్ని.. ఆ నాటి ఇజ్రాయిలీ రచయిత రాసిన కథ ఆధారంగా చిత్రీకరించారు. అయితే ఆ రచయిత వారుసుల నుంచి అనుమతి తీసుకోకుండా టాప్ గన్ మావరిక్ చిత్రాన్ని నిర్మించారని పారామౌంట్పై ఆరోపణలు వస్తున్నాయి. రైటర్ ఈహద్ యోనే ఫ్యామిలీ నుంచి హక్కులు పొందలేదని పారామౌంట్పై కేసు బుక్కైంది. అయితే ఈ దావాపై కోర్టులోనే తేల్చుకోనున్నట్లు పారామౌంట్ సంస్థ ప్రకటనలో వెల్లడించింది.
టాప్ గన్ మావరిక్ చిత్రం విడుదలై రెండు వారాలు అవుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సినిమా ఇప్పటికే 548 మిలియన్ల డాలర్లు వసూల్ చేసింది.నేవీ పైలెట్ పీట్ మావరిక్ పాత్రలో టామ్ క్రూజ్ ఇరగదీశాడు. అయితే పారామౌంట్ సంస్థపై సోమవారం లాస్ ఏంజిల్స్ ఫెడరల్ కోర్టులో దావా వేశారు. అమెరికా కాపీరైట్ చట్టం ప్రకారం పారామౌంట్ సంస్థ తమ నుంచి హక్కులు పొందలేదని షోష్, యువల్ యోనాలు తమ అఫిడవిట్లో పేర్కొన్నారు.