యూత్‌కు కనెక్ట్ అయ్యే సినిమాలు చేయాలంటే శేఖర్ కమ్ముల తర్వాతే ఎవరైనా. ఈ టాలెంటెడ్ డైరెక్టర్ కు అమెరికా మార్కెట్లో ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. యూఎస్‌లో టాలీవుడ్ టాప్ స్టార్లకు మించిన బ్రాండ్ నేమ్ శేఖర్ కమ్ములకు ఉంటుంది. ఈ డైరెక్టర్ తీసిన ఫిదా యూఎస్ఏలో 2 మిలియన్ల డాలర్లకుపైగా కలెక్షన్లను రాబట్టింది. మిగిలిన సినిమాలు కూడా ఓవర్సీస్ మార్కెట్లో బ్లాక్ బాస్టర్ గా నిలిచాయి. అయితే ప్రస్తుతం లవ్‌స్టోరీ సినిమా చేస్తున్న శేఖర్ కమ్ములకు ఓవర్సీస్ మార్కెట్ గురించి కొంత టెన్షన్ మొదలైందట.
యూఎస్ఏలో ఇప్పటివరకు సరైన సినీ మార్కెట్ ఓపెన్ కాకపోవడంతో బిజినెస్ డల్ అయిపోయింది. ఇటీవల విడుదలైన సినిమాలకు 300 వేల డాలర్లు (రూ. 2కోట్ల 20 లక్షలలోపే)కంటే తక్కువ బిజినెస్ అయిందని టాక్. ఈ బిజినెస్ ఇలాగే కొనసాగితే శేఖర్ కమ్ముల చిత్రం యూఎస్‌లో భారీ నష్టాలనే చవిచూసే అవకాశముంది. శేఖర్ కమ్ముల ఈ చిత్రానికి రెమ్యునరేషన్ తీసుకోకుండా మొత్తం బిజినెస్ లో భాగస్వామ్యం అవుతుండటంతో ఓవర్సీస్ మార్కెట్‌పై ఆలోచనలో పడినట్టు జోరుగా చర్చ నడుస్తోంది.