కన్నడ అగ్ర నటుడు పునీత్‌రాజ్‌కుమార్ హఠాన్మరణంతో యావత్ భారతీయ చిత్రసీమలో విషాదఛాయలు అలుముకున్నాయి. వివిధ భాషలకు చెందిన నటీనటులు సోషల్‌మీడియా వేదికల ద్వారా తమ సంతాపాన్ని ప్రకటించారు. కెరీర్ పతాకస్థాయిలో కొనసాగుతున్న తరుణంలో పునీత్‌రాజ్‌కుమార్ అర్థాంతరంగా నిష్క్రమించడం దురదృష్టకరమన్నారు. పునీత్‌రాజ్‌కుమార్ స్నేహతత్వాన్ని, ఔదార్యగుణాన్ని కొనియాడారు.
తెలుగు పరిశ్రమలో జూనియర్ ఎన్టీఆర్‌తో పునీత్‌రాజ్‌కుమార్‌కు చక్కటి అనుబంధం ఉంది. ఎన్టీఆర్‌ను తాను కుటుంబ సభ్యుడిగా భావిస్తానని పునీత్‌రాజ్‌కుమార్ చెప్పేవారు. పునీత్ హఠాన్మరణం పట్ల ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ‘నా హృదయం ముక్కలైంది. ఇంత త్వరగా నువ్వు వెళ్లిపోయావంటే నమ్మలేకపోతున్నా’ అంటూ సంతాపం ప్రకటించారు.
‘ కన్నడ చిత్రసీమతో పాటు భారతీయ పరిశ్రమకు పునీత్‌రాజ్‌కుమార్ మరణం తీరని లోటు. వారి కుటుంబానికి ఆ భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని కోరుకుంటున్నా’.
-చిరంజీవి
‘పునీత్ మరణం నన్ను షాక్‌కు గురిచేసింది. ఆయన చక్కటి వినయశీలి. నా జీవితంలో కలిసిన గొప్ప వ్యక్తుల్లో పునీత్‌రాజ్‌కుమార్ ఒకరు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నా’
–మహేష్‌బాబు
‘నాకు సోదరుడు వంటి పునీత్‌రాజ్‌కుమార్ లేరనే వార్తను నమ్మలేకపోతున్నా. కల్మషం లేని స్వచ్ఛమైన హృదయం ఆయన సొంతం. నటుడిగానే కాకుండా తన ఉన్నతమైన వ్యక్తిత్వంతో ఎందరో హృదయాల్ని గెలుచుకున్నాడు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నా’
–రామ్‌చరణ్
‘పునీత్‌రాజ్‌కుమార్ మరణవార్త విని దిగ్భ్రాంతి చెందా. ఏమాత్రం నమ్మశక్యంగా అనిపించలేదు. ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపం’ – పవన్‌కల్యాణ్
‘నా ప్రియమైన అప్పు…చాలా త్వరగా వెళ్లిపోయావ్..నా మనసు వికలమైంది. ఇది నా జీవితంలో దుర్దినం’
–ప్రకాష్‌రాజ్
‘ఈ వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. పునీత్‌రాజ్‌కుమార్‌ను కొన్నిసార్లు కలిశాను. ఆయన ఆతిథ్యాన్ని ఎప్పటికి మర్చిపోలేను. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే కనిపిస్తారు. చిన్న వయసులోనే ఆయన ఈ లోకాన్ని విడిచివెళ్లడం బాధాకరం’
–రాజమౌళి
‘పునీత్‌రాజ్‌కుమార్ మృతి కన్నడ చిత్రసీమకు తీరనిలోటు. నేను గొప్ప స్నేహితుడిని కోల్పోయా. బాల నటుడిగా సినీరంగ ప్రవేశం చేసి అంచెలంచెలుగా అగ్ర నటుడిగా ఎదిగారు. గాయకుడు, నిర్మాత, వ్యాఖ్యాతగా బహుముఖ ప్రజ్ఞతో తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు నా సానుభూతి తెలియజేస్తున్నా’. – బాలకృష్ణ
‘భగవంతుడు ఒక్కోసారి ఇంత నిర్దయగా ఎందుకు ప్రవర్తిస్తాడో అర్థం కాదు. పునీత్‌రాజ్‌కుమార్ గొప్ప వ్యక్తిత్వం కలవాడు. భారతీయ సినీ ప్రపంచానికే ఇదొక విషాదకరమైన రోజు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి’. – మెహన్‌బాబు
‘పునీత్‌రాజ్‌కుమార్ లేరనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నా. చిన్న వయసులోనే మనల్ని విడిచి వెళ్లాడు. ఆయన కుటుంబ సభ్యులకు నా సంతాపం’
-నాగార్జున
‘పునీత్‌రాజ్‌కుమార్ మరణం నా హృదయాన్ని విషాదంలో నింపింది. చక్కటి స్నేహశీలి, మృధుస్వభావి ఇంత త్వరగా నిష్క్రమించడం బాధాకరం. ఆయన కుటుంబానికి, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నా’.
–అనుష్కశెట్టి
‘పునీత్‌రాజ్‌కుమార్ మరణించారనే విషయాన్ని అస్సలు నమ్మలేకపోతున్నా. కేవలం కన్నడ ఇండస్ట్రీకి మాత్రమే కాదు యావత్ భారతీయ సినీరంగానికి ఆయన మరణం తీరని లోటు. ఆయన ఆత్మకు శాంతికలగాలి’
–పూజాహెగ్డ్డే
‘మీరు లేరనే వార్త విని నా హృదయం విషాదంతో నిండిపోయింది. మిమ్మల్ని కలిసిన రోజులు గుర్తొస్తున్నాయి. మీ కుటుంబానికి దేవుడు శక్తినివ్వాలని కోరుకుంటున్నా. – విజయ్ దేవరకొండ