నమస్తే డాక్టర్‌గారు. నా వయసు 29 సంవత్సరాలు. తొలిసారి గర్భం ధరించాను. ప్రస్తుతం ఏడోనెల. ఈ మధ్య పొట్ట విపరీతంగా దురద వస్తున్నది. గీరితే మచ్చలు పడతాయని పెద్దవాళ్లు చెబుతున్నారు. మాయిశ్చరైజర్ రాసుకుంటున్నా పెద్దగా ఉపయోగం ఉండటం లేదు. పాపాయికి హాని కలగకుండా ఉండేలా ఏదైనా ఆయింట్మెంట్ రాసుకోవచ్చా. అలాగే డెలివరీ తర్వాత స్ట్రెచ్‌మార్క్స్ రాకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుపగలరు.
-ఓ సోదరి
గర్భధారణ సమయంలో నెలలు నిండుతున్న కొద్దీ పొట్ట చర్మం బాగా సాగడం, దానివల్ల ఎక్కువగా దురద రావడం అన్నది సర్వసాధారణమైన విషయమే. అయితే ఇది అనుభవిస్తున్న వారికి ఇబ్బందిగానే అనిపిస్తుంది. నిజానికి ఇలా దురద రావడానికి కారణం, పొట్ట పరిమాణం పెరుగుతున్నంతగా చర్మం సాగలేకపోవడమే. ఇలా చర్మం సాగకపోవడం వల్ల లోపల ఉన్న ఫైబర్లు తెగిపోతాయి. దానివల్ల దురద, అసౌకర్యం కలుగుతూ ఉంటాయి.
ఇవి తెగిపోవడం వల్లే ప్రసవం అయిన తర్వాత కూడా పొట్ట మీద స్ట్రెచ్‌మార్క్స్ అలాగే ఉండిపోతాయి. కేవలం అయిదు శాతం మందికి మాత్రమే డెలివరీ తర్వాత కూడా పొట్ట మచ్చలు లేకుండా సాధారణ స్థితికి వస్తుంది. అంటే వాళ్లలో చర్మానికి సాగే గుణాన్నిచ్చే కొలాజెన్ స్థాయులు అంత ఎక్కువగా ఉంటాయన్న మాట. ఇది జన్మతః వచ్చే శరీర తత్వం. కాబట్టి మీరు గీరినా, గీరకపోయినా మచ్చలు పడటం అన్నది మీ చేతిలో ఉండదు. కాకపోతే స్నానం చేశాక, శరీరం కాస్త తడిపొడిగా ఉన్నప్పుడే పొట్టకు ఆలివ్‌నూనె, లేదా కొబ్బరినూనె రాసుకోండి. దురద నుంచి ఉపశమనం ఉంటుంది.
మీ సమస్యల్ని మాకు తెలపాలనుకుంటే, zindagi@ntnews.com కు మెయిల్ చేయండి.
డాక్టర్ పి. బాలాంబ
సీనియర్ గైనకాలజిస్ట్