హైదరాబాద్, జూలై 16 (నమస్తే తెలంగాణ) ః తిరుమలలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత నిఘా ఏర్పాటు చేయాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) నిర్ణయించింది. శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంచారం, భక్తుల సంఖ్య, సర్వదర్శనం, గదుల అద్దె తదితర విషయాల్లో అక్రమాలను కట్టడిచేయడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని భావిస్తోంది.
ఈ మేరకు ఈ టెక్నాలజీని సరఫరా చేసే జౌత్సాహిక సంస్థల నుంచి టీటీడీ టెండర్లు ఆహ్వానిస్తోంది. ఈనెల 31లోగా ఔత్సాహికులు తమ పరికరాలను ప్రదర్శించి, టెండర్లలో పాల్గొనాలని టీటీడీ పేర్కొంది. తిరుమలలో శ్రీవారి దర్శనానికి వచ్చే మార్గం నుంచి క్యూలైన్లు, కంపార్ట్మెంట్లు, భక్తుల ముఖ గుర్తింపు, టోకెన్ల జారీ వంటి అన్ని రికార్డు చేసే విధంగా ఈ టెక్నాలజీని వినియోగించనున్నారు.