న్యూయార్క్ : మానవుల ఆయుర్దాయంలో మన ఊహకందనంత కీలక పాత్ర పోషిస్తున్న ఒక చిన్న అవయవంపై జరిగిన అధ్యయన ఫలితాలు అందరినీ విస్తుపోయేలా చేస్తున్నాయి. మానవుని రొమ్ము పైభాగాన ఉండే ఈ అతి చిన్న అవయవం దశాబ్దాలుగా గుర్తింపునకు కూడా నోచుకోకపోవడం విశేషం. అదే ‘థైమస్ గ్రంథి’. పిల్లల్లో రోగ నిరోధక వ్యవస్థ అభివృద్ధి చెందడంలో కీలక పాత్ర పోషించే ‘థైమస్ గ్రంథి’ వయసు పెరిగే కొద్దీ క్షీణించి కుంచించుకుపోతుంది. ‘ఇమ్యూన్ సెల్ గ్రేవ్‌యార్డ్'(రోగ నిరోధక కణాల శ్మశాన వాటిక)గా పిలిచే ‘థైమస్ గ్రంథి’ మనిషి పెరిగిన తరువాత కూడా తన ఉనికిని కోల్పోదని తాజా పరిశోధనలు నిరూపిస్తున్నాయి.
హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన ఆంకాలజిస్ట్ హ్యూగో ‘సైన్స్ అలర్ట్’తో మాట్లాడుతూ పెద్దలలో కూడా ఈ ‘థైమస్ గ్రంధి’ ముఖ్యమైనది కావచ్చని, పరిశోధనల తర్వాత వచ్చిన ఫలితాలు చూసి ఆశ్చర్యపోయామన్నారు. ఈ అధ్యయనంలో రెండు వేర్వేరు సమూహాల నుంచి డాటా సేకరించి విశ్లేషించింది. దీనిలో థైమస్ అత్యంత ఆరోగ్యంగా ఉన్నవారు, తక్కువ థైమస్ ఆరోగ్యంతో ఉన్నవారితో పోలిస్తే 12 ఏండ్ల తర్వాత మరణించే అవకాశం దాదాపు 50 శాతం తక్కువగా ఉన్నదని తేలిందన్నారు.