హైదరాబాద్, నవంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా తగ్గుముఖం పట్టడంతో గచ్చిబౌలిలోని టిమ్స్‌లో సాధారణ వైద్యసేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు టిమ్స్‌లో కొవిడ్ రోగులకు మాత్రమే చికిత్స అందిస్తున్నారు. ఇకపై 200 పడకలు మినహాయించి సాధారణ వైద్యసేవలు ప్రారంభించాలని అధికారులను వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశించారు. గురువారం హైదరాబాద్‌లోని ఎంసీహెచ్చార్డీలో వైద్యారోగ్య శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్షించారు. కింగ్ కోఠి దవాఖానలో సాధారణ వైద్యసేవలు పునరుద్ధరించాలని, టిమ్స్ సిబ్బంది పెండింగ్ జీతాలు, దవాఖాన బకాయిలు చెల్లించాలని నిర్ణయించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులు, టీకాలు, కొత్త మెడికల్ కాలేజీలు, కొత్త మల్టీ స్పెషాలిటీ దవాఖానల నిర్మాణం, వరంగల్‌లోని మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మాణం తదితరాలపై చర్చించారు. రాష్ట్రంలో బుధవారం నాటికి 84.3% మందికి మొదటి డోస్, 38.5% మందికి రెండో డోస్ వేశారని చెప్పారు. వ్యాక్సినేషన్ వేగం పెంచడంపై శనివారం అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా వైద్యాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించాలని నిర్ణయించారు.