Arunachal Pradesh : అరుణాచల్ ప్రదేశ్‌లో బుల్లెట్ గాయాలతో ఒక పులి మరణించింది. అంతకంటే రెండు రోజులముందు ఒక కానిస్టేబుల్‌ను పులి చంపి తినేసింది. దీంతో ఆ పులిని ఎవరైనా ప్రతీకారంతో కాల్చి చంపారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్, దిగువ దిబాంగ్ వ్యాలీ జిల్లా, మయోడియా ప్రాంతంలో జరిగింది.
సోమవారం సాయంత్రం చిక్సెంగ్ మన్పాంగ్ అనే హెడ్ కానిస్టేబుల్ బైకుపై వెళ్తుండగా అతడిపై పులి దాడి చేసి చంపినట్లు తెలుస్తోంది. అతడు కనిపించకపోవడంతో పోలీసులు, ఫారెస్టు అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం అతడి మృతదేహం లభ్యమైంది. సగం వరకు మృతదేహాన్ని పులి తిన్నట్లు గుర్తించారు. దీంతో స్థానికులు తీవ్ర ఆగ్రహావేశాలకు లోనయ్యారు. పులిని బంధించాలని, అంతం చేయాలని కోరారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఎవరూ బయటకు రావొద్దని, పులి సంచారం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని ఆదేశాలు జారీచేశారు. ఇదే సమయంలో కానిస్టేబుల్‌పై పులి దాడి చేయడాన్ని ఎవరూ చూడలేదు. కానీ, ఆ ప్రాంతంలో పులి సంచరించడాన్ని కొందరు చూశారు. దీంతో అతడిని పులి చంపి ఉంటుందని భావిస్తున్నారు. ఈ ఘటన జరిగిన రెండు రోజుల తర్వాత గురువారం అటవీ ప్రాంతంలో ఒక పులి చనిపోయి కనిపించింది. బుల్లెట్ గాయాలతోనే ఆ పులి మరణించినట్లు గుర్తించారు.
అయితే, ఆ పులిని ఎవరు కాల్చి చంపారు అనే విషయంలో స్పష్టత లేదు. కానిస్టేబుల్ మృతికి ప్రతీకారంగా ఎవరైనా కాల్చి చంపారా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. మరణించింది ఆడపులి. అయితే, కానిస్టేబుల్‌పై దాడి చేసింది ఇదే పులా.. లేక మరోటా అనే విషయంలో కూడా స్పష్టత లేదు. ఏదేమైనా అటు అటవీ అధికారుల నిర్లక్ష్యం.. ఇటు మనుషుల చర్యలు వల్ల అటవీ జంతువులకు నివాసం కరువవడం వంటి అంశాలే కానిస్టేబుల్ మరణానికి, పులి ప్రాణం పోవడానికి కారణమైందని జంతు ప్రేమికులు అంటున్నారు. ఘటనలపై విచారణ కొనసాగుతోంది.