న్యూఢిల్లీ, మే 31: వన్యప్రాణి సంరక్షకుడు, రచయిత వాల్మీక్ థాపర్(73) శనివారం ఉదయం న్యూఢిల్లీలోని తన నివాసంలో కన్నుమూశారు. థాపర్ తన జీవితాన్ని వన్యప్రాణుల అధ్యయనానికి, ముఖ్యంగా రాజస్థాన్‌లోని రంథంభోర్ నేషనల్ పార్కులోని పులుల సంరక్షణకు అంకితం చేశారు. 1988లో రంథంభోర్ ఫౌండేషన్‌ను ఇతరులతోకలసి స్థాపించారు. ఈ ఎన్జీవో గ్రామీణ ప్రజలను భాగస్వామ్యులను చేస్తూ వన్యప్రాణి సంరక్షణ చర్యలపై కృషి చేసింది.
తన ఐదు దశాబ్దాల కెరీర్లో థాపర్ పులుల వేటకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తీసుకురావాలని, పులుల ఆవాసాలను పరిరక్షించాలని ప్రభుత్వాలపై గట్టి ఒత్తిడి తీసుకువచ్చారు. ప్రధాని అధ్యక్షతన ఉన్న జాతీయ వన్యప్రాణుల బోర్డుతో సహా 150కి పైగా ప్రభుత్వ కమిటీలు, టాస్క్ ఫోర్సులలో ఆయన సభ్యునిగా ఉన్నారు. ల్యాండ్ ఆఫ్ ది టైగర్: ఎ నేచురల్ హిస్టరీ ఆఫ్ ది ఇండియన్ సబ్‌కాంటినెంట్(1997), టైగర్ ఫైర్ఐ500 ఇయర్స్ ఆఫ్ ది టైగర్ ఇన్ ఇండియాతో సహా వన్య ప్రాణులపై ఆయన 30కి పైగా పుస్తకాలు రాశారు. బీబీసీ వంటి చానల్స్ కోసం ఆయన డాక్యుమెంటరీ నిర్మించారు.