మందమర్రి రూరల్/నెన్నెల, మే 31 : మంచిర్యాల జిల్లాలో పలుచోట్ల ఆదివారం గాలివాన బీభత్సం సృష్టించింది. మందమర్రి మండలం సారంగపల్లి, చిర్రకుంట,మామిడిగట్టు, ఆదిల్పేట, పొన్నారం గ్రామాల్లో మధ్యాహ్నం ఒక్కసారిగా గాలివానతో పాటు వర్షం పడింది. అక్కడక్కడా చెట్లు విరిగిపడ్డాయి. మామిడిగట్టుకు చెందిన గుర్రం వెంకటేశ్గౌడ్కు చెందిన ఇంటి పైకప్పు రేకులు ఎగిరిపోయాయి. ఆదిల్పేటలో పలుచోట్ల విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి.
కరెంట్ తీగలు తెగిపోయాయి. విద్యుత్ సరఫరా నిలిచిపోయి ప్రజలు ఇబ్బందులు పడ్డారు. సర్పంచ్ నెండుగురి పున్నం దెబ్బతిన్న ఇండ్లను పరిశీలించారు. పలుచోట్ల కొనుగోలు కే్రందాల్లోని ధాన్యం తడిసి ముద్దయింది. షరతులు లేకుండా కొనుగోలు చేయాలని రైతులు కోరుతున్నారు. నెన్నెల మండలం కొత్తూరు గ్రామంలోని మొదటి వార్డులో పోశం ఇంటి సమీపంలో తాటిచెట్టుపై పిడుగు పడడంతో మంటలు లేచాయి. గాలిదుమారానికి జెండా వెంకటపూర్లో చెట్ల కొమ్ములు విరిగిపడడంతో 15 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి. పలుచోట్ల ఇండ్లరేకుల పై కప్పులు ఎగిరిపడ్డాయి.