అమరావతి : విశాఖ( Visaka ) చేపల రేవు నుంచి వేటకు వెళ్లి సముద్రంలో గల్లంతయిన ఆరుగురు మృతి చెందారని ప్రభుత్వం నియమించిన త్రీమెన్ కమిటీ ( Threemen committee ) స్పష్టం చేసింది. ఈ మేరకు ప్రభుత్వానికి కమిటీ నివేదికను సమర్పించింది. దీంతో ఆరుగురు మత్స్యకారులు మృతి చెందినట్లు నిర్దారించారు.
గత శనివారం చేపల రేవు నుంచి బయలు దేరి తిరిగి వస్తుండగా బారీ అలతో బోటు బోల్తా ( Boat Accident ) పడింది. ఆ సమయంలో బోటు యజమాని, డ్రైవర్ కారె చిన్నాతో పాటు ఆరుగురు మత్స్యకారులున్నారు. వీరంతా రాత్రి వరకు బోల్తా పడ్డ బోటును పట్టుకుని ఉన్నారు. రాత్రి అదే సమయంలో అటువైపువచ్చిన వాణిజ్య నౌక వద్దకు వెళ్లిన కారె చిన్నాను నావికులు కాపాడారు. మిగతా మత్స్యకారుల జాడ తెలియరాలేదు.
ఈ విషయం ఆదివారం బయటకు రావడంతో కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేశారు. స్పందించిన ప్రభుత్వం కోస్టుగార్డు సిబ్బందితో గాలింపు చర్యలు మొదలు పెట్టారు. చివరకు ఆరుగురు గల్లంతుపై త్రీమెన్ కమిటీని వేసి నివేదికను కోరగా పలు కోణాల్లో విచారించిన కమిటీ తుది రిపోర్టును ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో ఆరుగురు మత్స్యకారులు మృతి చెందారని ప్రకటించింది. కాగా మృతుల కుటుంబాలకు ప్రభుత్వం రూ.10 లక్షల ఆర్థిక సహాయాన్ని బుధవారం అందజేసింది.