హైదరాబాద్ : నగరంలో ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు లంచం తీసుకుంటూ ఏసీబీకి( ACB ) పట్టుబడ్డారు. బాధితుల పక్షాన నిలబడవలసిన ఓ ఏఎస్సై ( ASI ) నిందితుడి నుంచి లంచం ( Bribe ) తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన వైనం హైదరాబాద్‌లోని చైతన్యపురి పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. ఏఎస్సై పూసాల బాలయ్య( ASI Pusala Balaiah) బుధవారం నిందితుడి నుంచి రూ.15 వేలు లంచం ఏసీబీ అధికారులకు పట్టుబడ్డాడు. అప్పటికే నిందితుడిపై ఉన్న క్రిమినల్ కేసును మారుస్తూ లోక్ అదాలత్‌లో ఫిర్యాదుదారుడితో రాజీ కుదుర్చాలని ఏఎస్సైను నిందితుడు సంప్రదించాడు. అయితే లంచం డిమాండ్ చేయడంతో బుధవారం రూ. 15 వేలు తీసుకుంటుండగా ఏసీబీ రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకుంది. ఏఎస్సైపై కేసు నమోదు చేసి నగదును స్వాధీనం చేసుకుని నాంపల్లి ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు.
ఏసీబీకి పట్టుబడ్డ ఉస్మానియా వర్సిటీ ఇద్దరు బిల్లింగ్ సెక్షన్ ఉద్యోగులు
హైదరాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీలో పే బిల్ సెక్షన్లో పనిచేస్తున్న సీనియర్, జూనియర్ అసిస్టెంట్లను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. బాధితుడి తల్లికి చెందిన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం చేసుకున్న దరఖాస్తును ఉన్నతాధికారులను పంపించాలని పే బిల్ సెక్షన్ సీనియర్ అసిస్టెంట్ అరవింద్, జూనియర్ అసిస్టెంట్ కె. రమేష్‌ను సంప్రదించాడు. అందుకు లంచం డిమాండ్ చేయగా సీనియర్ అసిస్టెంట్ ప్రోద్భలంతోనే జూనియర్ అసిస్టెంట్ బుధవారం రూ.13 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్‌హ్యండెడ్‌గా పట్టుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు.