ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్ అని..అల్పులు, సంకుచిత ధోరణి ఉన్నవాళ్లు ఈ దేశాన్ని పాలిస్తుండడం అత్యంత ఆందోళన కలిగిస్తున్న అంశమని రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి (Singireddy Niranjanreddy) అన్నారు.
జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ (Cmkcr )నాయకత్వ ఆవశ్యకత, (PM Modi) మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైమంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ..పాలకుల పోకడల మీద విశాలమైన అవగాహన, అందివస్తున్న శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని సజావుగా వినియోగిస్తూ మానవ కళ్యాణానికి తోడ్పడాలి. అలా కాకుండా విద్వేషపూరితంగా, వినాశనం దిశగా మానవత్వ కోణం లేకుండా ఈ దేశాన్ని నడిపిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఈ నేపథ్యంలో దేశ రాజకీయాల్లో కేసీఆర్ కీలకపాత్ర పోషించాలని ప్రజల నుండి డిమాండ్ వస్తున్నది. ఇది రాజకీయ కాంక్ష కాదు..ఈనాటి అనివార్య పరిస్థితుల్లో ముఖ్య అవసరమని స్పష్టం చేశారు.
90వ దశకంలో తెలుగునేల నుండి జాతీయస్థాయి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేసింది తెలుగు చైతన్యమే.
మాకు ఎదురులేదన్న కాంగ్రెస్ను అతలాకుతలం చేసి నేషనల్ ఫ్రంట్, యునైటెడ్ ఫ్రంట్లు ఏర్పడి ఈ దేశ ఫెడరల్ స్ఫూర్తికి నిదర్శనంగా నిలిచాయి. ప్రాంతీయ పార్టీల కలయికే ఈ దేశానికి ప్రత్యామ్నాయ ప్రభుత్వాలు అందించగలవని చరిత్రలో రుజువైందన్నారు. ఈ దేశం ఏ రాజకీయ పార్టీ గుత్తాధిపత్యం కాదు..ఈ దేశం రాష్ట్రాల సమాహారం. భిన్నసంస్కృతులు, భాషలు, ఆచార వ్యవహారాలు కలిగిన భారత్ ఓ వైవిధ్య భరితమైన దేశం.
భారతదేశం పరిణతి చెందిన ప్రజాస్వామ్యాన్ని కలిగి ఉన్నది..భారత ప్రజలు వివిధ సందర్భాల్లో తాము కోరుకున్న ప్రభుత్వాలను ఏర్పాటు చేసుకోవడం అందరూ చూస్తున్నదే. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యామ్నాయంగా మరో ప్రభుత్వం రావాలని ప్రజల మనసుల్లో బలంగా ఉంది ..దానికి ప్రాతిపదిక సిద్దంగా ఉన్నది. నేడు సమర్దవంతంగా నడవని కేంద్రం, ప్రజల అభిలాషలు నెరవేర్చని కేంద్రం .. జనసామాన్యం జీవితాలు అతలాకుతలం చేసింది. ప్రైవేటు, బడా కార్పోరేట్లకు మాత్రమే తోడ్పడుతున్నది. దేశంలోని 60 శాతం ప్రజలు ఆధారపడిన రైతాంగం జీవితాలను పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ఎదుగుతున్న సమాజాన్ని కేంద్రం కుత్సిత బుద్దితో విభజించి ప్రజల మధ్య అగాధాలు సృష్టించి విడదీస్తున్నది. ఆధునిక యుగంలో ఆధునిక మానవులుగా అవతరించకుండా దుర్మార్గంగా ప్రవరిస్తున్నదన్నారు.
ఈ నేపథ్యంలో దేశ ప్రజలను ఐక్యంగా ఉంచడం ఒకటి..ప్రజల అవసరాలను గుర్తించి మానవ వనరులను, సహజ వనరులను సద్వినియోగ పరచాల్సిన దక్షత, దార్శనికత అవసరం ఉన్నదని..అందుకే దార్శనిక పాలకులు రావాలని ప్రజలు భావిస్తున్నారని అభిప్రాయపడ్డారు. సకల వనరులు ఉండి ప్రపంచంలో అగ్రగామిగా ఉండాల్సిన భారత్లో 75 ఏళ్ల స్వాతంత్య్రం తర్వాత కూడా అమలవుతున్న విధానాలు తిరోగమనం వైపు సాగుతున్నాయి
మోడీ కంటే ముందే ఎమ్మెల్యేగా కేసీఆర్ ఎన్నిక..
మోడీ కంటే ముందే కేసీఆర్ 1985లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు .. ఆ తర్వాత ఏడుసార్లు ఎమ్మెల్యేగా, నాలుగు సార్లు ఎంపీగా గెలిచారు.. మంత్రిగా , డిప్యూటీ స్పీకర్ గా, కేంద్ర మంత్రిగా, మరియు రెండు సార్లు ముఖ్యమంత్రి కావడమే కాకుండా 14 ఏండ్లు భారత రాజ్యాంగ పరిధిలో ఒక మహా సుధీర్ఘ ఉద్యమాన్ని నడిపి రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా .. దేశానికి రాష్ట్ర అభివృద్ధిని ఆదర్శంగా నిలిపారన్నారు. అదే మోడీ గారు 2002 నుండి ముఖ్యమంత్రిగా , ఎనిమిదేండ్లు ప్రధానిగా ఉన్నా కేసీఆర్ గారి కన్నా జూనియర్ అని అన్నారు. పలు మాజీ దేశాధినేతలు, కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులతో అభినందనలు పొందారు
అత్యంత పరిజ్ఞానం, లోతైన పరిశోధన, ఆంగ్ల, తెలుగు, ఉర్దూ ( హింది) భాషల్లో అనర్గళంగా మాట్లాడి ప్రజలను ఆకట్టుకునే సీఎం కేసీఆర్ ప్రసంగాలు ప్రజలను కదిలించాయి, కదిలిస్తున్నాయి. ఆలోచింపచేస్తున్నాయని పేర్కొన్నారు.
ఈ దేశంలో భిన్న పార్టీలను కలిపి నడిపే దీక్ష, దక్షత కేసీఆర్కు మాత్రమే ఉన్నదని మంత్రి నిరంజన్ రెడ్డి న్నారు. ఈ సువిశాల దేశానికి నాయకత్వం వహించే వ్యక్తి తెలంగాణ నుండి ఎదగడం ఈ నేల గర్వించదగ్గ విషయం. పరాయి పెత్తనాన్ని మోసే బానిసలు ఈ గొప్పతనం గమనించలేరు. ఇక్కడి చైతన్యం ఈ ప్రజల జీవితాల నుండి పుట్టిన అనుభవం. ఈ దేశంలోని పీడిత, తాడిత ప్రజల భవిష్యత్ కేసీఆర్ గారి నాయకత్వంలో మరింత అర్థవంతంగా ఉంటుందని పునరుద్ఘాటించారు.