నూతన సాంకేతికతలను ఎప్పటికప్పుడు అందిపుచ్చుకొనే రంగాల్లో రియల్ ఎస్టేట్ రంగం ముందుంటుంది. ముఖ్యంగా భవన నిర్మాణం, వసతుల విషయంలో టెక్నాలజీ అత్యంత కీలకపాత్ర పోషిస్తున్నది. అందుకే ఒకప్పటితో పోల్చితే ఇప్పుడు వసతుల్లో, నిర్మాణశైలిలో ఎంతో మార్పు వచ్చింది. ఇంట్లోని వస్తువులు సైతం ఇంటర్నెట్కు కనెక్ట్ అవుతున్నాయి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), మెషిన్ లెర్నింగ్ (ఎంఎల్) లాంటి ఆధునిక సాంకేతికతలతో ఇండ్లు ‘స్మార్ట్ హోమ్స్’గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో భవిష్యత్తులో రియల్ ఎస్టేట్ రంగం రూపురేఖలను మార్చబోయే టాప్ టెక్నాలజీలను మస్సాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటీ)లోని రియల్ ఎస్టేట్ వింగ్ విడుదల చేసింది. ఇందులో కొన్ని ముఖ్యమైన టెక్నాలజీలను పరిశీలిస్తే..
డిజిటల్ ఫ్యాబ్రికేషన్
సింపుల్‌గా చెప్పాలంటే 3డీ ప్రింటింగ్. ఈ విధానంలో ఇంటి నిర్మాణానికి కావాల్సిన అన్ని వస్తువులను అక్కడికక్కడే 3డీ ప్రింటింగ్ ద్వారా ముద్రిస్తారు. అవసరమైతే ఇల్లు మొత్తాన్ని 3డీ ప్రింటింగ్ టెక్నాలజీతో నిర్మించేందుకూ అవకాశం ఉంటుంది. దీంతో నిర్మాణ సమయం, ఖర్చు కలిసివస్తాయి. మనకు కావాల్సిన ఆకారంలో, నాణ్యమైన వస్తువులను అతి తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. 3డీ ప్రింటింగ్‌కు తర్వాతి తరమైన 4డీ ప్రింటింగ్పైనా ప్రస్తుతం ప్రయోగాలు జరుగుతున్నాయి. ఈ ప్రింటర్ల ద్వారా తయారు చేసిన వస్తువులను నిర్ణీత బలంతో మరో రూపంలోకి మార్చేందుకు అవకాశం ఉంటుందని భావిస్తున్నారు.
5జీ, ఐవోటీ
ఇల్లు, ఆఫీస్ వాతావరణాన్ని పూర్తిగా మార్చివేసే టెక్నాలజీలు ఇవి. ఇంట్లోని వస్తువులన్నింటినీ ఇంటర్నెట్కు అనుసంధానించడమే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐవోటీ). ఇంట్లోని పరికరాలను కృత్రిమ మేధస్సు సాయంతో ఆటోమ్యాటిక్‌గా నడిపేందుకు అవకాశం కలుగుతుంది. ఇది పూర్తిస్థాయిలో సాకారం కావాలంటే ఐదోతరం (5జీ) టెక్నాలజీతో కూడిన ఇంటర్నెట్ అందుబాటులోకి రావాలి. ప్రస్తుతం అందుబాటులో ఉన్న 4జీ ఇంటర్నెట్తో కేవలం కొన్ని రకాల గృహోపకరణాలు, స్విచ్‌లను మాత్రమే నియంత్రించగలుగుతున్నాం.
వర్చువల్ రియాలిటీ
సాధారణంగా స్థలాలు, ఇండ్లు కొనేముందు అక్కడికి వెళ్లి క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత నిర్ణయం తీసుకుంటాం. అయితే ఫీల్డ్‌కు వెళ్లడం ప్రతిసారీ సాధ్యం కాకపోవచ్చు. ఈ కొరతను వర్చువల్ రియాలిటీ తీర్చుతుంది. ప్రపంచంలో ఎక్కడున్నా ఈ టెక్నాలజీ సాయంతో ప్రత్యక్షంగా చూసిన అనుభూతి పొందొచ్చు. ఎక్కడో ఉన్న నిర్మాణాలను సైతం ఇంటి నుంచే పర్యవేక్షించవచ్చు.
గ్రాఫీన్
ఇది కర్బన అణువులతో కూడిన పారదర్శక పదార్థం. ఇనుము కన్నా 100 రెట్లు దృఢంగా ఉంటుంది. స్థితిస్థాపక గుణాన్ని కలిగి ఉండి మంచి వాహకంగా పనిచేస్తుంది. అనేక రకాల ద్రవాలు, వాయువుల నుంచి రక్షణ కలిగి ఉంటుంది. గ్రాఫీన్‌తో కూడిన కాంక్రీట్‌ను వాడితే భవనాలు ఇప్పటికన్నా అత్యంత దృఢంగా తయారవుతాయి. సంప్రదాయ కాంక్రీట్‌తో పోల్చితే తక్కువ మెటీరియల్ అవసరమవుతుంది.
సెల్ఫ్ క్లీనింగ్ మెటీరియల్స్
వస్తువులు శుభ్రంగా ఉండాలంటే నిత్యం తుడువడమో, కడుగడమో చేయాల్సిందే. ముఖ్యంగా అద్దాల విషయంలో జాగ్రత్తలు ఎక్కువగా తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి పరిష్కారంగా దుమ్ము, ధూళిని, బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను స్వతహాగా శుభ్రం చేసుకునే ‘సెల్ఫ్ క్లీనింగ్ మెటీరియల్స్’ను అభివృద్ధి చేస్తున్నారు. తామరాకుల స్ఫూర్తితో వీటిని తయారు చేస్తున్నారు. ఇవి అందుబాటులోకి వస్తే నిర్వహణ వ్యయం చాలావరకు తగ్గుతుంది.
హైపర్ సెల్స్
ఇవి రోబోటిక్ క్యూబ్స్. అంటే ఘనాకారంలో ఉండే ఇటుకలు అనుకోవచ్చు. వీటికి స్థితిస్థాపక శక్తి ఉంటుంది. నిర్మాణానికి తగినట్టుగా తమ ఆకారాలను మార్చుకోగలవు. రోబో సినిమాలో రోబోలన్నీ కలిసి పాముగా, పెద్ద రోబోగా, బాల్ మాదిరిగా, బుల్లెట్‌గా మారినట్టే.. కంప్యూటర్లో ఒక డిజైన్‌ను ఇచ్చి హైపర్సెల్స్కు ఆదేశాలు పంపితే అవి ఆ ఆకారంలోకి మారిపోతాయి. అంతేకాకుండా ఇవి సమాచారాన్ని సైతం ప్రసారం చేయగలుగుతాయి. ఇల్లు లేదా ఆఫీస్ రూపురేఖలను ఇష్టం వచ్చినప్పుడు మార్చుకునే వెసులుబాటు కలుగుతుంది. ప్రస్తుతం ఈ టెక్నాలజీ ప్రయోగ దశలో ఉన్నది. 10 సెంటీమీటర్లున్నహైపర్సెల్స్ను అభివృద్ధి చేశారు.