న్యూఢిల్లీ : ఇటీవల నిత్యవసర వస్తువులతో పాటు పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. దీంతో జనం ఇబ్బందులకు గురవుతున్నారు. తాజాగా ప్రయుఖ డెయిరీ సంస్థ అమూల్ పాల ధరలను పెంచనున్నట్లు తెలుస్తున్నది. ఇటీవల అమూల ధరలు పెరగ్గా.. మళ్లీ మరోసారి పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. పెరుగుతున్న ఇంధన ధరలు, లాజిస్టిక్స్, ప్యాకేజింగ్ ఖర్చుల కారణంగా ధరను పెంచడం తప్ప మరో మార్గం లేదని కంపెనీ అధికారులు పేర్కొంటున్నారు. ధరలు ఏమాత్రం తగ్గకపోవచ్చని, త్వరలో పెరుగబోతున్నాయని కంపెనీ ఎండీ ఆర్ఎస్ సోధి తెలిపారు. ఇంతకు ముందు అమూల్ పాల ధర మార్చి 1న లీటర్కు రూ.2 పెరిగింది. అయితే, తాజాగా ఎంత మేరకు పెంచుతారనే విషయం స్పష్టంగా తెలియరాలేదు.
ప్రస్తుతం ఇంధన ధరలు మూడింట ఒకవంతు పెరిగాయని, దీంతో పాటు కోల్డ్ స్టోరేజీల ఖర్చు సైతం పెరిగిందని కంపెనీ ఎండీ పేర్కొన్నారు. లాజిస్టిక్స్ ధర సైతం క్రమంగా పెరుగుతోందని, ప్యాకేజింగ్ సైతం ఖరీదైందని.. తద్వారా ధరలు పెంచడానికి కారణాలని అధికారులు పేర్కొంటున్నారు. ఇదిలా ఉండగా.. గత రెండేళ్లలో అమూల్ పాల ధరలను ఎనిమిది శాతం పెరిగాయి. దేశంలో ఇంధన ధరలు మండిపోతున్నాయి. బుధవారం దేశవ్యాప్తంగా మరోసారి ధరలు పెరిగాయి. లీటర్కు పెట్రోల్, డీజిల్పై 80 పైసల చొప్పున పెరిగింది. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.105.41కి చేరగా.. డీజిల్ ధర రూ.96.67కు పెరిగింది. మరో వైపు సీఎన్జీ ధరలు సైతం పెరుగుతున్నాయి. బుధవారం ఢిల్లీలో కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధర మరోసారి పెరిగింది. ఈ పెంపుతో ఢిల్లీలో సీఎన్జీ ధర రూ.2.5 పెరిగి కిలోకు రూ.66.61కి చేరింది.