‘వరుణ్‌తేజ్ అంటే నాకు చాలా ఇష్టం. మా కుటుంబ సభ్యుడని ఈ మాట చెప్పడం లేదు. అతను ఎంచుకునే ప్రతి కథలో ఏదో కొత్తదనం ఉంటుంది. ‘గని’ సినిమా కోసం చాలా కష్టపడ్డాడు. కొన్ని నెలల పాటు సిక్స్‌ప్యాక్ మెయిన్‌టెయిన్ చేయడం మామూలు విషయం కాదు’అన్నారు అల్లు అర్జున్. శనివారం ఏపీలోని విశాఖపట్నంలో జరిగిన ‘గని’ ప్రీరిలీజ్ వేడుకకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. వరుణ్‌తేజ్ కథానాయకుడిగా నటిస్తున్న ఈ చిత్రానికి కిరణ్ కొర్రపాటి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో అల్లు బాబీ, సిద్ధు ముద్ద నిర్మిస్తున్నారు. ఈ నెల 8న ప్రేక్షకుల ముందుకురానుంది. అల్లు అర్జున్ మాట్లాడుతూ ‘ఈ సినిమా ద్వారా నా అన్నయ్య అల్లు బాబీ అధికారికంగా నిర్మాతగా మారడం చాలా సంతోషంగా ఉంది. నా ప్రతి సినిమా విషయంలో అన్నయ్య జడ్జిమెంట్ ఉంటుంది. తను ఓ కథను ఓకే చేశాడంటే అది ఖచ్చితంగా హిట్ అనుకోవాలి. ఈ సినిమాకు మరో నిర్మాత సిద్ధు ఎన్నో కష్టాలు పడి ఇండస్ట్రీలో నిలబడ్డాడు’అని చెప్పారు. అల్లు పతాకాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఎగరేసిన తన తనయుడు అల్లు అర్జున్ను సభాముఖంగా అభినందిస్తున్నానని..భవిష్యత్తులో వరుణ్‌తేజ్‌తో ‘కేజీఎఫ్’ వంటి భారీ సినిమా తీస్తానని అల్లు అరవింద్ పేర్కొన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ ‘మూడు సంవత్సరాలు కష్టపడి ఈ సినిమా పూర్తి చేశాం. కథానుగుణంగా సిక్స్‌ప్యాక్ అవసరం పడటంతో..అన్నయ్య రామ్‌చరణ్ ఓ ట్రైనర్‌ను సమకూర్చాడు. సినిమాలో నా పాత్ర సహజంగా కనిపించాలని బాక్సింగ్ నేర్చుకున్నా’అన్నారు. కొత్త నిర్మాతలమైనా ప్రతి విషయంలో శ్రద్ధ తీసుకొని సినిమాను తెరకెక్కించామని నిర్మాతలు అల్లు బాబీ, సిద్ధు ముద్ద తెలిపారు. ఈ సినిమా కోసం మూడేళ్లు కష్టపడ్డామని..పవన్‌కల్యాణ్ కెరీర్లో ‘తమ్ముడు’ఎలా మైలురాయిలా నిలిచిందో..వరుణ్‌తేజ్ కెరీర్‌కు ఈ సినిమా అంతే గుర్తింపు తీసుకొస్తుందని దర్శకుడు కిరణ్ కొర్రపాటి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులందరూ పాల్గొన్నారు.