ఎండలు మొదలయ్యాయి. ఉదయం నుంచే చెమటలు పట్టిస్తున్నాయి. ఈ క్రమంలో మార్నింగ్ వాక్ వెళ్లేటప్పుడు సన్‌స్క్రీన్ లోషన్ రాసుకుంటున్నాం. అయితే, సన్‌స్క్రీన్ వాడితే విటమిన్ డి లోపం వస్తుందా..?
చర్మ సంరక్షణ కోసం రకరకాల క్రీములు వాడుతుంటారు. ముఖ్యంగా, ఎండకాలంలో బయటికి వెళ్లేముందు సన్స్క్రీన్లోషన్స్ తప్పకుండా రాసుకుంటారు. సూర్యుని నుంచి వచ్చే యూవీ కిరణాల నుంచి చర్మాన్ని రక్షించడంలో ఈ సన్‌స్క్రీన్ సమర్థంగా పనిచేస్తుంది. టానింగ్, చర్మంపై నల్లటి మచ్చలు, సూర్యకాంతి వల్ల కలిగే అకాల వృద్ధాప్యాన్ని నివారిస్తుంది. తీవ్రమైన ఎండల్లో పనిచేసేవారిని ప్రాణాంతక చర్మ క్యాన్సర్ బారిన పడకుండా కాపాడుతుంది. అయితే.. ఇన్ని ప్రయోజనాలు కలిగిస్తున్న సన్‌స్క్రీన్ లోషన్ వల్ల.. శరీరానికి అవసరమైన విటమిన్ డి అందకుండా పోతుందని చాలామంది భావిస్తుంటారు. అలా అనుకోవడం ఒక అపోహ మాత్రమే! సన్‌స్క్రీన్ లోషన్లు ఉపయోగించినా.. సూర్యకాంతి మన చర్మాన్ని చేరుతుంది. కాబట్టి, శరీరానికి అవసరమైన విటమిన్ డి ఉత్పత్తి అవుతుంది. అంతేకాకుండా, శరీరంలోని అన్ని భాగాలకు లోషన్ రాసుకోరు.
ముఖం, చేతులకు మాత్రమే అప్లయి చేసినప్పుడు.. శరీరంలోని ఇతర భాగాలపై పడే సూర్యకాంతితో విటమిన్ డి అందుతుంది. ఇందుకోసం గంటల తరబడి ఎండలో ఉండాల్సిన అవసరం లేదు. వారానికి రెండుమూడు సార్లు కేవలం 10 నుంచి 15 నిమిషాల ఎండ తగిలినా.. శరీరానికి కావాల్సిన విటమిన్ డి అందుతుంది. ఇక ఎక్కువ వాడకంలో ఉన్న ఎస్పీఎఫ్ 30 ఉన్న సన్‌స్క్రీన్ లోషన్ 97శాతం కిరణాలను అడ్డుకున్నా.. మిగిలిన 3శాతం కిరణాలు విటమిన్ డి తయారీకి సరిపోతాయి. సన్‌స్క్రీన్ లోషన్ ఉపయోగించినప్పటికీ.. చర్మం సహజంగానే శరీరానికి అవసరమైన మేర విటమిన్ డి ఉత్పత్తి చేసుకునేలా సూర్యకాంతిని పొందుతుందని అనేక అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి, సన్‌స్క్రీన్ లోషన్ వల్ల మన శరీరంలో విటమిన్ డి లోపం పెరుగుతుంది అనడంలో ఏమాత్రం నిజం లేదు.