హైదరాబాద్, సెప్టెంబర్ 26 (నమస్తే తెలంగాణ): సంక్షేమశాఖల్లో ఇన్చార్జుల పాలన కొనసాగుతున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, దివ్యాంగశాఖల్లో ఏ ఒక్కదానికీ పూర్తిస్థాయి అధికారి లేకుండాపోయారు. ఉన్నవాళ్లకు, లేదంటే ఇతర శాఖల ఉన్నతాధికారులకే అదనపు బాధ్యతలను అప్పగించి ప్రభుత్వం నెట్టుకొస్తున్నది. దళితులు, గిరిజనులు, ఆదివాసీలు, బీసీల సంక్షేమం, అభివృద్ధికి సర్కార్ ఇస్తున్న ప్రాధాన్యత ఏపాటిదో తెలిసిపోతున్నది. ఇన్చార్జుల పాలనతో సంక్షేమశాఖల్లో పాలన పూర్తిగా గాడి తప్పింది. ప్రశ్నించేవారు, పర్యవేక్షించేవారు లేక ఇన్చార్జులు ఆడింది ఆట, పాడింది పాటగా మారిందని సంక్షేమభవన్ వర్గాలే చర్చించుకుంటున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేనాటికి బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా బుర్రా వెంకటేశం ఉన్నారు. ఆ తరువాత ప్రభుత్వం ఆయన స్థానంలో శ్రీధర్‌ను సెక్రటరీగా నియమించింది. 9 నెలల క్రితం ఆయనను ఇరిగేషన్‌శాఖకు బదిలీ చేస్తూ, రాహుల్‌బొజ్జాను బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కు నియమించింది. కానీ ఆయన విధుల్లో చేరిన రెండు రోజులకే సెలవుపై వెళ్లారు. దీంతో బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ కమిషనర్, కన్ఫర్డ్ ఐఏఎస్ బాలమాయదేవికే అదనపు బాధ్యతలను అప్పగించింది. నెలల తరబడి ఆమే కొనసాగుతున్నారు. ఎస్సీ కార్పొరేషన్ ఎండీ మల్లయ్యభట్టుకే బీసీ కార్పొరేషన్ ఎండీగా అదనపు బాధ్యతలను అప్పగించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన అనంతరం ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కు దా దాపు సగం కాలంవరకు మంత్రితోపాటు రెగ్యులర్ సెక్రటరీ లేకుండా పోయారు. ఇటీవలే పూర్తిస్థాయి సెక్రటరీగా విజయేంద్రబోయిని నియమితులయ్యారు. ఇక ఎస్సీ వెల్ఫేర్ కమిషనర్‌గా ఆమెకే అదనపు బాధ్యతలు అప్పగించారు. ఎస్సీ గురుకుల సెక్రటరీగా ఆ సొసైటీ చరిత్రలోనే ఎన్నడూ లేనివిధంగా కనీసం గ్రూప్1 ఆఫీసర్‌ను కూడా సర్కార్ నియమించలేదు. కేవలం సాధారణ టీచర్‌ను సెక్రటరీగా నియమించి సొసైటీని నిర్వహిస్తుండడం గమనార్హం.
తాజాగా 2015 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, ప్రస్తుతం తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు (టీజీపీసీబీ) మెంబర్ సెక్రటరీగా చేస్తున్న జీ రవికి బాధ్యతలు అప్పగించారు. తదుపరి ఆదేశాలు వచ్చేంతవరకు ఆయన టీజీపీసీబీ మెంబర్ సెక్రటరీగా పూర్తి అదనపు బాధ్యతలు (ఎఫ్ఏసీ) కూడా నిర్వర్తిస్తారని సీఎస్ సంజయ్ జాజు శనివారం జారీచేసిన ఉత్తర్వులో తెలిపారు.
సంక్షేమశాఖలకు సంబంధించి ప్రభుత్వం రెగ్యులర్ అధికారులను నియమించకపోవడం వెనుక భారీ స్కెచ్ ఉన్నదని ఉద్యోగవర్గాల్లో చర్చ నడుస్తున్నది. గురుకులాలు, హాస్టళ్లకు సంబంధించి రూ. 2 వేల కోట్ల విలువైన టెండర్లను ఇన్చార్జి అధికారి ఆధ్వర్యంలోనే ప్రభుత్వం నిర్వహించింది. టెండర్లలో వందల కోట్ల విలువైన గోల్మాల్ జరిగిందని ఇప్పటికే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుట్టుమిషన్లు, ఎలక్ట్రిక్ వాహనాల పంపిణీకి సంబంధించి సైతం టెండర్లను సర్కార్ ఖరారు చేసింది. అందులోనూ అవకతవకలు జరిగినట్టు తెలుస్తున్నది. రెగ్యులర్ ఐఏఎస్‌లు ఉన్నట్టయితే తమ ఆటలు సాగబోవనే ప్రభుత్వం ఎఫ్‌ఏసీలతో కొనసాగిస్తున్నదని ఆరోపణలు ఉన్నాయి. టెండర్ల ప్రతిపాదనలకు అంగీకరించకుండా పలువురు అధికారులు చార్జి తీసుకునేందుకు విముఖత చూపారని సమాచారం.