
సత్వరం.. ఆమోదయోగ్యం.. ఇదే జాతీయ లోక్ అదాలత్ ఉద్దేశం. ఏండ్ల తరబడి కోర్టుల్లో పేరుకుపోయిన కేసులను రాజీమార్గం ద్వారా పరిష్కరించుకునేందుకు న్యాయ సేవాధికార సంస్థ సదావకాశం కల్పిస్తున్నది. ఈనెల 11న ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా లోక్ అదాలత్‌ను నిర్వహించనున్నది. ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించనుండగా, అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తిచేశారు. క్రిమినల్, భూ వివాదం, రోడ్డు ప్రమాదాలు, ఆస్తి తగాదాలు, వరకట్నం, చెక్‌బౌన్స్ తదితర కేసుల్లో కక్షిదారులు రాజీ కుదుర్చుకుని న్యాయం పొందవచ్చు. ఇందుకోసం ఉమ్మడి జిల్లా కోర్టుల్లో 17 బెంచ్‌లను ఏర్పాటు చేయనున్నారు. ఉదయం 11 గంటల నుంచి 5 వరకు ఈ కార్యక్రమం కొనసాగనుంది.ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సమయాన్ని, డబ్బును ఆదా చేసుకోవాలని న్యాయనిపుణులు సూచిస్తున్నారు.
సంగారెడ్డి/ మెదక్ అర్బన్, డిసెంబరు 9 : కోర్టు అనగానే చాలామందిలో ఒకలాంటి భయం ఉంటుంది. ఇక్కడ కేసులు పరిష్కారం కావాలంటే ఆస్తులన్నీ అమ్ముకోవాల్సి వస్తుందనే భావన చాలామందిలో ఉంది. అనేక సందర్భాల్లో కేసుల నిమిత్తం కోర్టుల చుట్టూ తిరిగి ఆర్థికంగా చితికిపోయిన వారు ఎందరో ఉన్నారు. అలాంటి పరిస్థితులు ఎవరికీ రావొద్దనే ఉద్దేశంతో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ‘లోక్ అదాలత్’ ద్వారా రాజీకి అవకాశం కల్పిస్తున్నది. వివిధ కేసుల పరిష్కారానికి ఇదొక సదావకాశమని న్యాయమూర్తులు, న్యాయవాదులు అభిప్రాయపడుతున్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు దేశవ్యాప్తంగా అన్ని కోర్టుల్లో జాతీయ లోక్‌అదాలత్ ఈనెల 11న శనివారం నిర్వహించనున్నారు.
ఉమ్మడి జిల్లాలో..
మెదక్ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 2021 జనవరి నుంచి అక్టోబర్ వరకు 413 లోక్ అదాలత్‌లు నిర్వహించి 24, 795 కేసులను రాజీమార్గంలో పరిష్కరించారు. బాధితులకు న్యాయ సేవలు అందించారు. పలు కేసుల్లో బాధితులకు రూ.5.04 కోట్ల పరిహారాన్ని వసూలు చేసి న్యా యం చేశారు. ఈనెల 11న జిల్లాకేంద్రం సంగారెడ్డి కోర్టు ప్రాంగణంలో ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి లోక్ అదాలత్‌ను ప్రారంభించనున్నారు. జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఉత్తర్వుల మేరకు, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశాలతో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, ఉమ్మడి జిల్లా ప్రధాన న్యాయమూర్తి పాపిరెడ్డి అధ్యక్షతన నిర్వహిస్తారు. భూ తగాదాలు, క్రిమినల్ కేసులు, వాహన ప్రమాద, సివిల్, బా్ంయకు కేసుల పరిష్కారానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. కక్షిదారులు కేసులను రాజీ చేసుకోవడానికి లోక్ అదాలత్‌లను సద్వినియోగం చేసుకోవాలని న్యాయమూర్తులు సూచిస్తున్నారు. లోక్‌అదాలత్‌లో ఇచ్చిన తీర్పు అన్ని రకాల తీర్పులతో సమానం. అన్ని విషయాలను క్షుణ్ణంగా పరిశీలించాకే ఇరుపక్షాలకు తగిన సమయం ఇచ్చి వారందరి ఆమోదం మేరకే తీర్పు ఇస్తారు. ఈ తీర్పుపై అప్పీలు చేసుకునే అవకాశం ఉండదు.
ఉమ్మడి జిల్లాలో 17 బెంచ్‌ల ఏర్పాటు..
ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్న కోర్టుల్లో లోక్ అదాలత్‌ను ఏర్పాటు చేసి బాధితులకు సత్వర న్యాయం అందించేందుకు జాతీయ న్యాయ సేవాధికార సంస్థ చర్య లు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా సంగారెడ్డి జిల్లా కేంద్రం కోర్టులో 5 బెంచ్‌లు, మెదక్ 3, సిద్దిపేట 3, జహీరాబాద్ 2, నారాయణఖేడ్, అందోల్-జోగిపేట్, నర్సాపూర్, గజ్వేల్ కోర్టుల్లో ఒక్కొక్కటి చొప్పున బెంచీలు ఏర్పా టు చేయనున్నది. ఉదయం 11 గంటల నుంచి సాయం త్రం 5 వరకు లోక్ అదాలత్ కేసులు పరిష్కరిస్తారు.
కక్షిదారులకు న్యాయ సాయం..
ఉమ్మడి మెదక్ జిల్లావ్యాప్తంగా 413 లోక్ అదాలత్‌లు నిర్వహించి బాధితులకు న్యాయ సహాయం అందించారు. జిల్లా న్యాయసేవాధికార సంస్థ సంగారెడ్డిలో 230, సిద్దిపేటలో మండల న్యాయ సేవాధికార సంస్థ 32, జహీరాబాద్‌లో 24, మెదక్‌లో 35, గజ్వేల్‌లో 27, అందోల్-జోగిపేట్‌లో 25, నర్సాపూర్‌లో 23, నారాయణఖేడ్‌లో 17 మార్లు లోక్ అదాలత్‌లు నిర్వహించి 24,795 కేసులను పరిష్కరించారు. అంతేకాకుండా ఊరూరా న్యాయ సహాయంపై 4,138 అవగాహన సదస్సులు నిర్వహించి చట్టా లు, న్యాయ సేవలపై వివరించారు. కోర్టుల్లో కేసులు వేసేందుకు ఆర్థిక స్థోమత లేని కక్షిదారులకు జిల్లా న్యాయసేవాధికార సంస్థ 209 మంది బాధితులకు ఉచితంగా న్యాయవాదులను ఏర్పాటు చేసింది. ప్రజలు ఎప్పుడైనా ఉచిత న్యాయ సేవలు పొందడానికి జిల్లా న్యాయ సేవాధికార సం స్థను సంప్రదించాలని న్యాయమూర్తులు సూచిస్తున్నారు.
సమయం, డబ్బు ఆదా అవుతుంది..
వివిధ కేసుల్లో కోర్టుల చుట్టూ తిరగడంతో విలువైన సమయంతోపాటు డబ్బు కూడా వృథా అవుతుంది. ముఖ్యంగా ఇరువర్గాలు సమస్యను పరిష్కరించుకుంటే డబ్బు , సమయం రెండూ కలిసి వస్తాయి. ఈ నెల 11న నిర్వహించే జాతీయ లోక్ అదాలత్‌ను కక్షిదారులు సద్వినియోగం చేసుకోవాలి.