నల్లగొండ, డిసెంబర్ 29 : నల్లగొండ జిల్లాలో చైనీస్ మాంజ (నైలాన్/ప్లాస్టిక్ పూతతో తయారు చేసిన ప్రమాదకర దారం) వినియోగం, నిల్వ, విక్రయాలపై పూర్తిస్థాయి నిషేధం అమలులో ఉందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. ఈ నిషేధాన్ని ఉల్లంఘించే వ్యాపారులపై ఎలాంటి సడలింపు లేకుండా చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. చైనీస్ మాంజ కారణంగా చిన్నపిల్లలు, యువకులు, పాదచారులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర గాయాలకు గురవుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయని, ముఖ్యంగా మెడ, ముఖం, చేతులకు ప్రాణాంతక గాయాలు సంభవిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా పక్షులు, విద్యుత్ తీగలు, ప్రజా ఆస్తులకు కూడా భారీ నష్టం జరుగుతోందన్నారు.
చైనీస్ మాంజ విక్రయాలు పూర్తిగా అరికట్టేందుకు జిల్లాలోని అన్ని మండలాలు, పట్టణాలు, గ్రామాల్లో ప్రత్యేక తనిఖీ బృందాలను ఏర్పాటు చేసి, దుకాణాలు, గోదాములు, తాత్కాలిక స్టాళ్లు, రహస్య నిల్వలు అదేవిధంగా ఆన్లైన్ విక్రయాలపై జిల్లా వ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. తనిఖీల్లో చైనీస్ మాంజ విక్రయాలు లేదా నిల్వలు బయటపడితే మాంజను వెంటనే స్వాధీనం చేసుకుని, సంబంధిత వ్యాపారులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, అవసరమైతే అరెస్టులు కూడా చేస్తామని హెచ్చరించారు. అలాగే నిషేధాన్ని ఉల్లంఘించిన వ్యాపారుల లైసెన్సులు రద్దు చేయించడంతో పాటు, దుకాణాలు, గోదాములను సీజ్ చేయడానికి రెవెన్యూ, మున్సిపల్ శాఖలతో సమన్వయ చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
చిన్నపిల్లలకు చైనీస్ మాంజ అందించినా, బహిరంగ ప్రదేశాల్లో చట్ట విరుద్ధంగా మాంజ ఎగరేసినా లేదా ప్రమాదాలకు కారణమైనా చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. చైనీస్ మాంజ విక్రయాలు జరుగుతున్నట్లు ఎక్కడైనా తెలిసిన వెంటనే డయల్ 100 లేదా సమీప పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. ప్రజల ప్రాణ భద్రతే పోలీస్ శాఖకు ప్రధాన లక్ష్యమని, చైనీస్ మాంజ విషయంలో చట్టం అమలు ఖచ్చితమని, ఎలాంటి మినహాయింపులు ఉండవని ఎస్పీ తేల్చి చెప్పారు.