వాషింగ్టన్: వెనెజువెలా అధ్యక్షుడు మదురోను బంధించడంలో అమెరికా అత్యంత పకడ్బందీగా వ్యవహరించింది. మదురోకు సంబంధించిన ప్రతి విషయాన్నీ సేకరించింది. అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ (సీఐఏ) రహస్య బృందం నిరుడు ఆగస్టులో వెనెజువెలా రాజధాని నగరం కారకాస్‌లో అడుగు పెట్టింది. ఈ బృందంలో అనుభవజ్ఞులైన ఏజెంట్లు ఉన్నారు. మదురో ప్రతి కదలికను నిశితంగా గమనించడమే వారి విధి. ఈ బృందం సభ్యులు ఇతరులు గుర్తు పట్టకుండా వీధుల్లో తిరిగారు. కొన్ని నెలలపాటు మదురో కదలికలను గమనించారు.
ఆయన ఉదయాన్నే ఏం చేస్తారు? ఎక్కడికి వెళ్తారు? ఎవరితో మాట్లాడతారు? ఆయన అలవాట్లు ఏమిటి? ఆయన పెంపుడు జంతువుల అలవాట్లు ఏమిటి? వంటి వివరాలను కూడా సేకరించారు. మదురోకు సన్నిహితంగా ఉండే అంతర్గత సభ్యుల్లో ఒకరు అమెరికన్ ఇన్సైడర్ కావడంతో అత్యంత ముఖ్యమైన వివరాలు ఈ ఆపరేషన్ నిర్వహించడానికి ఉపయోగపడ్డాయి. అంతేకాకుండా, అనేక అమెరికన్ స్టెల్త్ డ్రోన్లు ఆకాశంలో ఎగురుతూ, రహస్యంగా వీడియోలు, ఫొటోలను తీసి, పంపిస్తూ ఉండేవి.
మదురో ప్రెసిడెన్షియల్ ప్యాలస్ పూర్తి స్థాయి నమూనాను కెంటకీలో జాయింట్ స్పెషల్ ఆపరేషన్స్ కమాండ్ నిర్మించింది. దాడులను అనేకసార్లు రిహార్సల్ చేసింది. మదురోను అరెస్ట్ చేసే ఆపరేషన్‌కు ‘ఆపరేషన్ అబ్సల్యూట్ రిజాల్వ్’ అని పేరు పెట్టారు. స్టీల్ డోర్స్‌ను పగలగొట్టడం, చీకట్లో నడవడం, ఎదురయ్యే ప్రమాదాన్ని తిప్పికొట్టడానికి సిద్ధమవడంలో రాత్రి, పగలు తేడా లేకుండా ఈ బృందంలోని సభ్యులకు శిక్షణ ఇచ్చారు. మదురో తరచూ 6-8 ప్రదేశాలకు మారుతూ ఉంటారని డెల్టా ఫోర్స్‌కు తెలిసింది. సాయంత్రం అయ్యే వరకు ఆయన ఎక్కడ బస చేస్తారో స్పష్టత ఉండదు.
వెనెజువెలాపై దాడిని నిరోధించేందుకు మదురో డిసెంబర్ 23న ప్రయత్నించారు. వెనెజువెలా చమురు నిక్షేపాలను అమెరికాకు ఇస్తానని చెప్పారు. అయితే, దేశం విడిచి, తుర్కియేకి వెళ్లిపోవాలని మదురోకు ట్రంప్ చెప్పారు. మదురో అందుకు అంగీకరించలేదు.
ట్రంప్ డిసెంబర్ 25న దాడికి ఆదేశించారు. ఎప్పుడు దాడి చేయాలో నిర్ణయించే అధికారాన్ని పెంటగాన్‌కు అప్పగించారు. క్రిస్మస్ సెలవుల్లో దాడి చేయాలని అధికారులు భావించారు. అయితే ఈ నెల 3న అనుకూల పరిస్థితులు ఏర్పడటంతో దాడి చేశారు.