అమీర్పేట్ : సెప్టెంబర్ 2న జరిగే టీఆర్ఎస్ జెండా పండుగను సతన్నగర్ నియోజకవర్గంలో విజయవంతం చేయాలని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సోమవారం ఉదయం వెస్ట్మారేడ్పల్లిలోని తన నివాసంలో నియోజకవర్గం కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ల అధ్యక్షులతో మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా జెండా పండుగ విజయవంతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఢిల్లీలో అత్యంత శోభాయమానంగా నిర్మించ తలపెట్టిన టీఆర్ఎస్ కార్యాలయానికి అదే రోజున సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారన్నారు.
నియోజకవర్గం నలుదిశలా టీఆర్ఎస్ జెండా రెపరెపలాడే విధంగా జెండా ఆవిష్కరణలు జరిగేలా చూడాలని పార్టీ నాయకులను ఆదేశించారు. నియోజకవర్గంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి టీఆర్ఎస్ మాత్రమే చిత్తశుద్ధితో కృషి చేసిందని, నియోజకవర్గంలో గతంలో ఎన్నడూ లేని రీతిలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని, టీఆర్ఎస్ విజయాలను ప్రజలకు వివరిస్తూ పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు.
ఈ కార్యక్రమంలో డివిజన్ కార్పొరేటర్లు కూర్మ హేమలత, మహేశ్వరి, కొలను లక్ష్మిరెడ్డి, మాజీ కార్పొరేటర్లు ఎన్.శేషుకుమారి, అత్తెల్లి అరుణగౌడ్, ఉప్పల తరుణిలతో పాటు డివిజన్ల అధ్యక్షులు అత్తెల్లి శ్రీనివాస్ గౌడ్, కొలను బాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.