క్రీడలు
ఒలింపిక్స్
టోక్యో ఒలింపిక్స్ 2021 జూలై 23 నుంచి ఆగస్ట్ 8వ తేదీ వరకు కొనసాగాయి. ఒలింపిక్స్‌ను జపాన్ నిర్వహించడం ఇది నాలుగోసారి. గతంలో టోక్యోలో 1964లో సమ్మర్ ఒలింపిక్స్‌ను నిర్వహించారు. 2020 ఒలింపిక్స్‌ను 2021లో నిర్వహించారు. కరోనా వల్ల ఏడాది పాటు వాయిదా వేశారు. శీతాకాల ఒలింపిక్స్‌ను 1972లో సపోరోలో, 1998లో నగానోలో నిర్వహించారు. ఒలింపిక్స్‌ను రెండుసార్లు నిర్వహించిన తొలి ఆసియా వేదికగా టోక్యో ఘనత సాధించింది.
అగ్రస్థానంలో అమెరికా: పతకాల సాధనలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఆ దేశం మొత్తం 113 పతకాలను దక్కించుకుంది. ఇందులో 39 బంగారు, 41 వెండి, 33 కాంస్య పతకాలు ఉన్నాయి. రెండో స్థానంలో చైనా నిలిచింది. భారత్ 48వ స్థానంలో ఉంది.
భారత్: భారత్ తరఫున ప్రారంభ వేడుకల్లో పతాకధారులుగా మేరీ కోమ్, మన్‌ప్రీత్ సింగ్‌లు నిలిచారు. ముగింపు వేడుకలకు బజ్రంగ్ పూనియా పతాకధారి.
భారత విజేతలు
నీరజ్ చోప్రా స్వర్ణం (జావెలిన్ త్రో)
మీరాబాయి చాను వెండి (వెయిట్ లిఫ్టింగ్)
రవి దహియా- రజతం (రెజ్లింగ్)
లవ్లీనా బోర్గోహెయిన్- రజతం (బాక్సింగ్)
పీవీ సింధు- రజతం (బ్యాడ్మింటన్)
బజ్రంగ్ పూనియా- రజతం (రెజ్లింగ్)
భారత హాకీ జట్టు- రజతం
పారాలింపిక్స్
టోక్యోలో పారాలింపిక్స్‌ను ఆగస్ట్ 24 నుంచి సెప్టెంబర్ 5వ తేదీ వరకు నిర్వహించారు. దీనిలో 207 పతకాలు సాధించి చైనా అగ్రస్థానంలో నిలిచింది. 96 స్వర్ణ, 60 రజత, 51 కాంస్య పతకాలు సాధించింది. పతకాల పట్టికలో భారత్ 24వ స్థానంలో ఉంది.
భారత్: ప్రారంభ వేడుకల్లో టెక్ చంద్ పతాకధారి కాగా, ముగింపు ఉత్సవాలకు అవని లేఖరా పతాకధారిగా నిలిచారు.
స్వర్ణ పతకాలు
సుమిత్ అంటిల్ :అథ్లెటిక్స్
ప్రమోద్ భగత్ :బ్యాడ్మింటన్ (పురుషుల సింగిల్స్)
కృష్ణ నగర్ :బ్యాడ్మింటన్ (పురుషుల సింగిల్స్)
మనీష్ నర్వాల్:షూటింగ్
అవని లేఖరా :షూటింగ్
రజతం
యోగేశ్ కతునియా: డిస్కస్ త్రో
నిషాద్ కుమార్: అథ్లెటిక్స్
మరియప్పన్ తంగవేలు :అథ్లెటిక్స్
ప్రవీణ్‌కుమార్ :అథ్లెటిక్స్
దేవేంద్ర జారియా: అథ్లెటిక్స్
సుహాస్ యతిరాజ్: బ్యాడ్మింటన్
సింగ్‌రాజ్ అధానా: షూటింగ్
భవీన పటేల్ :టేబుల్ టెన్నిస్
కాంస్యం
హర్విందర్ సింగ్ :ఆర్చరీ
శరద్ కుమార్ :అథ్లెటిక్స్
సుందర్ సింగ్ గుర్జర్ :అథ్లెటిక్స్
మనోజ్ సర్కార్ :బ్యాడ్మింటన్
సింగ్‌రాజ్ అధానా :షూటింగ్
అవని లేఖరా :షూటింగ్
క్రికెట్
టెస్టుల్లో భారత్ రికార్డ్ విజయం
ముంబయిలో భారత్, న్యూజిలాండ్‌ల మధ్య డిసెంబర్ తొలి వారంలో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో భారత్ 372 పరుగుల తేడాతో గెలిచింది. టెస్టుల్లో భారత్‌కు ఇదే అతిపెద్ద విజయం. ఈ మ్యాచ్‌లో పలు రికార్డ్‌లు నమోదయ్యాయి. న్యూజిలాండ్‌కు చెందిన అజాజ్ పటేల్ ఒకే ఇన్నింగ్స్‌లో పది వికెట్లు తీయడం ద్వారా ఈ ఘనత సాధించిన మూడో బౌలర్‌గా నిలిచాడు. మొదట జిమ్ లేకర్, తర్వాత అనిల్ కుంబ్లేలు ఈ రికార్డ్ సాధించారు.
ట్వంటీ-20 విజేత ఆస్ట్రేలియా
ట్వంటీ-20 పురుషుల ప్రపంచ కప్ అక్టోబర్ 17 నుంచి నవంబర్ 14వ తేదీ వరకు యూఏఈ, ఒమన్లలో నిర్వహించారు. ఆస్ట్రేలియా ఈ టోర్నీని తొలిసారి గెలుచుకుంది. ఫైనల్లో న్యూజిలాండ్‌ను ఆసిస్ ఓడించింది. ఆస్ట్రేలియాకు చెందిన వార్నర్ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా ఎంపికయ్యాడు. వచ్చే ఏడాది ట్వంటీ-20 అక్టోబర్‌లో ఆస్ట్రేలియాలో నిర్వహించనున్నారు.
ఐపీఎల్ విజేత చెన్నై సూపర్ కింగ్స్
ఐపీఎల్ 2021 విజేతగా చెన్నై సూపర్ కింగ్స్ నిలిచింది. తుదిపోరులో ఆ జట్టు కోల్‌కతా నైట్ రైడర్స్‌ను ఓడించింది. ఈ టోర్నీ ఈ ఏడాది మార్చిలో ప్రారంభమైంది.. కరోనా కారణంగా 31 మ్యాచ్‌ల అనంతరం వాయిదా వేశారు. తర్వాత సెప్టెంబర్ నుంచి అక్టోబర్ వరకు యూఏఈలో నిర్వహించారు.
టెస్ట్ చాంపియన్‌షిప్ విజేత న్యూజిలాండ్
టెస్ట్ చాంపియన్‌షిప్‌ను న్యూజిలాండ్ గెలుచుకుంది. తుదిపోరులో భారత్‌పై ఆ జట్టు విజయం సాధించింది. ఈ చాంపియన్‌షిప్‌లో అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్‌గా లబుషేన్ (ఆస్ట్రేలియా) నిలిచాడు. అత్యధిక వికెట్లు తీసింది రవిచంద్రన్ అశ్విన్. మొత్తం 14 మ్యాచుల్లో అతను 71 వికెట్లు పడగొట్టాడు.
ఇతర క్రీడాంశాలు
బ్యాడ్మింటన్
కిడాంబి శ్రీకాంత్
ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో కిడాంబి శ్రీకాంత్ రజత పతకం సాధించాడు. తుదిపోరులో సింగపూర్‌కు చెందిన కిన్యూ చేతిలో ఓడిపోయాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రజతం సాధించిన తొలి భారత పురుష షట్లర్‌గా శ్రీకాంత్ ఘనత సాధించాడు.
సింధు
బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ టూర్లో సింధు రన్నరప్‌గా నిలిచింది. తుదిపోరులో ఆమె కొరియాకు చెందిన ఆన్సియాంగ్ చేతిలో ఓడిపోయింది.
వెయిట్ లిఫ్టింగ్
పూర్ణిమకు స్వర్ణం
కామన్వెల్త్ వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్‌లో భారత లిఫ్టర్ పూర్ణిమ పాండే +87 కిలోల విభాగంలో స్వర్ణ పతకం గెలిచింది. ఈ క్రమంలో ఎనిమిది జాతీయ రికార్డ్లను నెలకొల్పింది.
చెస్
ప్రపంచ చెస్ చాంపియన్‌షిప్‌లో నార్వే క్రీడాకారుడు కార్ల్సన్ విజయం సాధించాడు. రష్యా గ్రాండ్ మాస్టర్ ఇయాన్ నెపోమ్ను తుదిపోరులో కార్ల్సన్ ఓడించాడు. ఈ టైటిల్‌ను అతడు గెలవడం ఇది అయిదోసారి.
జాతీయ యోగాసన క్రీడలు
భారత దేశ తొలి జాతీయ యోగాసన భౌతిక చాంపియన్‌షిప్‌ను భువనేశ్వర్‌లో నవంబర్ 11 నుంచి 13 వరకు నిర్వహించారు. వీటిని జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య నిర్వహించింది. దాదాపు 560 మంది ఇందులో పోటీ పడ్డారు.
క్రీడా పురస్కారం పేరు మార్పు
దేశ అత్యున్నత క్రీడా పురస్కారం రాజీవ్ గాంధీ ఖేల్ రత్న అవార్డ్ పేరును మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారంగా మార్చారు. ఈ అవార్డ్‌ను 1991-92లో నెలకొల్పారు.
భారత్‌లో ఫిఫా ప్రపంచకప్
ఫిఫా అండర్-17, మహిళల ప్రపంచ ఫుట్‌బాల్ టోర్నీని భారత్‌లో 2022లో నిర్వహించనున్నారు. ఈ టోర్నీ భారత్‌లో నిర్వహించం ఇది రెండోసారి. 2022లో అక్టోబర్ 11 నుంచి 30 వరకు ఈ పోటీలు నిర్వహిస్తారు.