టీనేజ్లోనే కన్నవారి మరణం. అయినా ఆశావాదంతో ఒంటరితనాన్ని అధిగమించింది. ధైర్యమే ఆమె ఆయుధమైంది. హాస్టల్లో ఉంటూ చదువుకుంది. ఐటీ నిపుణురాలిగా పేరు తెచ్చుకుంది. తల్లిగా, కోడలిగా, భార్యగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే.. తన కల నిజం చేసుకుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారతీయ వివాహితల కోసం నిర్వహించిన ‘మిసెస్ ఇండియా, మై ఐడెంటిటీ’ పోటీలో తెలంగాణ కీర్తిని నలుదిశలా చాటిచెప్పింది హైదరాబాద్‌కు చెందిన సుష్మ తోడేటి, మిసెస్ ఇండియా ఫైనలిస్ట్.
థాయ్‌లాండ్.
‘మిసెస్ ఇండియా, మై ఐడెంటిటీ’ వేదిక. ‘బెస్ట్ కల్చర్ డ్రెస్’ పోటీలు. ఒకరి తర్వాత ఒకరు.. తమ ఆహార్యం
గురించి వివరిస్తున్నారు. కంటెస్టెంట్ నంబర్ 58 వంతు వచ్చింది. ఓ మెరుపు మెరిసింది. ‘అందరికీ నమస్కారం’ అంటూ చేతులు జోడించిందామె. ఆ తర్వాత తాను ధరించిన డ్రెస్ గురించి ఇంగ్లిష్‌లో ఇలా చెప్పింది.. ‘ఈ చీర బోర్డర్ మొత్తం గద్వాల నేత. దానికి పోచంపల్లి ఇక్కత్ జోడించాను. నారాయణపేట కాటన్ మెటీరియల్‌తో బ్లౌజ్ డిజైన్ చేయించుకున్నా. బోర్డర్‌గా గద్వాల పట్టు ఎంచుకున్నా. అదనంగా బంజారా ఎంబ్రాయిడరీ. నేను కట్టుకున్నది మామూలు చీర కాదు. నా ప్రాంతపు సంస్కృతి, సంప్రదాయం. ఆ వైభవాన్ని మీ ముందు ప్రదర్శిస్తున్నందుకు గర్వంగా ఉంది’ అంటూ తన పరిచయాన్ని ముగించింది. చప్పట్లు మార్మోగాయి. ఆ తర్వాత, విజేతల ప్రకటన.. ‘ది బెస్ట్ కల్చర్ డ్రెస్ అవార్డ్ గోస్ టు మిసెస్ సుష్మా తోడేటి ఫ్రమ్ తెలంగాణ’. మరొక్కమారు హోటల్ పరిసరాలు దద్దరిల్లాయి. ఆ తర్వాత ‘మిసెస్ వెల్ స్పోకెన్’ అవార్డు. వెనువెంటనే ‘సోషల్ ఇన్స్టిట్యూట్’ అవార్డు. ఇలా ప్రతి రౌండ్లోనూ తనదైన శైలితో దూసుకెళ్లింది సుష్మ. కాబట్టే.. మిసెస్ ఇండియా పోటీల్లో నాలుగోస్థానంలో నిలిచింది.
కష్టాలు దాటుకొని..
అందాల పోటీల్లో పాల్గొనాలన్నది సుష్మ కోరిక. తల్లిదండ్రులు మరణించడంతో ఆశలన్నీ పక్కనపెట్టి, వీలైనంత త్వరగా జీవితంలో స్థిరపడాలని నిర్ణయించుకుంది. చదువులపై దృష్టిపెట్టింది. ఇంజినీరింగ్ తర్వాత హైదరాబాద్‌లోనే ఉద్యోగం వచ్చింది. ప్రమోషన్‌పై ముంబై, అమెరికా వెళ్లింది. మళ్లీ హైదరాబాద్ వచ్చేసింది. ఇన్ఫోసిస్ లాంటి పెద్ద కంపెనీల్లో పనిచేసింది. ప్రస్తుతం మెడికల్ ఫీల్డ్‌లో సప్లయ్ చైన్ మేనేజ్మెంట్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్నది. శ్రీనాథ్‌రెడ్డితో పరిచయం ప్రేమగా మారడంతో, ఇరువైపుల పెద్దలను ఒప్పించి పెండ్లిచేసుకున్నారు. ఆ దంపతులకు ఇద్దరు పిల్లలు.
వేలలోంచి ఒకరిగా..
అందాల పోటీల్లో ముందుగా చూసేది ఎత్తు, బరువు, అందం, అభినయం. ఆ అర్హతలేవీ లేవని మథనపడేది సుష్మ. ఏటా పోటీలకు దరఖాస్తు చేయాలనుకోవడం.. అంతలోనే ఆత్మన్యూనతతో వెనక్కి తగ్గడం. నాలుగు ప్రయత్నాల తర్వాత.. ధైర్యంగా బరిలో దిగాలని నిర్ణయించుకుంది. ధైర్యంగా అప్లికేషన్ పంపింది. తమకు అందిన వేలాది దరఖాస్తుల నుంచి 35 మాత్రమే మిసెస్ ఇండియా తుది పోటీలకు ఎంపిక చేశారు నిర్వాహకులు. 2021లో జరగాల్సిన పోటీలు కరోనా కారణంగా 2022లో కానీ పూర్తికాలేదు. ఈ వ్యవధిలో బరువు తగ్గడంపై దృష్టిపెట్టింది సుష్మ. హెల్త్, ఫిట్నెస్ లెవెల్స్ తగ్గకుండా చూసుకుంది. ఆన్లైన్లో నెలకో టాస్క్ ఇచ్చేవారు. పోటీలు దగ్గరపడుతున్న కొద్దీ వారానికో టాస్క్ ముందుంచారు. సుష్మ ఎక్కడా తగ్గలేదు. ప్రతి దశలో తన ప్రతిభను నిరూపించుకుంది. ఫైనలిస్ట్‌గా పేరు ప్రకటించిన తర్వాతే ఇంట్లో చెప్పింది. ఆ శుభవార్త విని అత్తామామలు సంతోషించారు. భర్త శ్రీనాథ్ వెన్నంటి ప్రోత్సహించారు. కూతురు కూడా మంచి మేకప్ సామగ్రిని వెతికివెతికి తెచ్చేది. కాబట్టే, ‘కుటుంబమే నా బలం’ అంటుంది సుష్మ.
చేనేతను ప్రోత్సహిస్తా..
పెండ్లి తర్వాత తామేమీ సాధించలేమని చాలామంది భయపడుతుంటారు. అది నిజం కాదు. కుటుంబ సభ్యుల మద్దతు ఉంటే ఏదైనా సాధ్యమే. మిసెస్ ఇండియా పోటీలకు తెలంగాణ నుంచి నేనొక్కదాన్నే ప్రాతినిధ్యం వహించాను. మొదటి ఈవెంట్లోనే నాలుగో స్థానంలో నిలిచాను. ఇదేస్ఫూర్తితో ప్రపంచ స్థాయిలో జరిగే పోటీలకు సిద్ధపడతాను. థాయ్‌లాండ్ నుంచి వచ్చిన తర్వాత మనవాళ్లు అభినందనలతో ముంచెత్తుతున్నారు. ప్రపంచ వేదికలపై తెలంగాణ సంస్కృతిని పరిచయం చేయడం మర్చిపోలేని అనుభూతి. ఇక నుంచీ తెలంగాణ చేనేత గురించి విస్తృతంగా ప్రచారం చేయాలనే ఆలోచన ఉంది. – సుష్మ తోడేటి