‘విజాతి ధ్రువాలు ఆకర్షించుకుంటాయి’ అని అయస్కాంత సూత్రాలు చెబుతాయి. ప్రేమ వ్యవహారాల్లోనూ, దాంపత్య సంబంధాల్లోనూ ఇదే నిజమని అనుకుంటారు. కానీ, ఇది అన్నివేళలా నిజం కాదని తాజా అధ్యయనం ఒకటి కనుక్కొంది. అదీ లక్షలాది జంటల నుంచి సమాచారం సేకరించిన తర్వాతే పరిశోధకులు ఈ నిర్ధారణకు వచ్చారు. మొత్తానికి నేచర్ హ్యూమన్ బిహేవియర్ పత్రికలో అచ్చయిన ఈ అధ్యయనం ‘విభిన్న ధ్రువాలు ఆకర్షించుకుంటాయి’ అనే నమ్మకాన్ని తోసిపుచ్చింది. రాజకీయాలు మొదలుకుని మొదటిసారి కలవడం, వివిధ అలవాట్ల వరకు అధ్యయనంలో పాల్గొన్న జంటల్లో 82 నుంచి 89 శాతం మంది పరస్పరం విరుద్ధమైన అభిప్రాయాల కంటే, ఒకే రకమైన అభిప్రాయాలు కలిగి ఉన్నారని ఈ నివేదిక విశ్లేషించింది.
కేవలం 3 శాతం మంది మాత్రమే, అదీ అన్ని విషయాల్లో కాకుండా ఏవో కొన్నిటిలో మాత్రమే తమ భాగస్వాములకు విభిన్నంగా ఉన్నారట. కాగా ఈ అధ్యయనం కోసం జంటల జన్యుపరమైన వివరాలు కూడా పరిశీలించారు. మనుషుల కలయిక అనుకోకుండా జరుగుతుందని అనుకుంటాం. కానీ, ఒకేరకమైన ఆలోచన ఉన్నవాళ్లే కలవడానికి అవకాశం ఉందనేది ఈ పరిశోధన సారాంశం. ఇక అధ్యయనం కోసం విడాకులు పొందిన జంటలు, నిశ్చితార్థం జరిగినవారు, పెండ్లయిన వారు, సహజీవనం చేస్తున్న వారిని పరిగణనలోకి తీసుకున్నారు.
రాజకీయ, మతపరమైన, విద్యా స్థాయి, ఐక్యూ మొదలైన విషయాల్లో జంటలు ఒకే రకంగా ఉన్నారని వెల్లడైంది. ధూమపానం, మద్యపానం, మద్యం తాగనివారి విషయంలోనూ ఇదే సామ్యం కనిపించింది. ఇలా ఉంటే ఎత్తు, బరువు, ఆరోగ్యం, వ్యక్తిత్వం విషయాలు అంతగా సరిపోలకపోయినా, ఇవి కూడా జంటల్లో ఒకే విధంగా ఉన్నాయట. అయితే, ఇతరులతో కలవడం లాంటి కొన్ని విషయాల్లో మాత్రం ఫలితాల్లో పొంతన కనిపించలేదని పరిశోధకులు పేర్కొన్నారు. ఈ అంశానికి సంబంధించిన అధ్యయనం తొలిసారిగా 1903లో జరిగింది.