బాన్సువాడ రూరల్, జనవరి 13 : బాన్సువాడ పట్టణ కేంద్రానికి 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న గ్రామం కాద్లాపూర్. ఇది పూర్తిగా అటవీ ప్రాంతానికి సమీపంలో ఉంది. ఇక్కడ నిరక్షరాస్యులు ఎక్కువే. ఈ గ్రామంలో ప్రాథమిక పాఠశాల ఉంది. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు సుమారు 50 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చదువుతున్నారు. పాఠశాలకు ఇప్పటివరకు ఒకే ఉపాధ్యాయురాలు ఉండేది. ఆమె నిజామాబాద్ నుంచి పాఠశాలకు రావాల్సి ఉండడంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. ఆమె సెలవు పెడితే పాఠశాల మూసి ఉంచాల్సిన పరిస్థితి. ప్రభుత్వం అమలు చేసిన 317 జీవోతో ఈ పాఠశాలకు మోక్షం లభించింది. ఈ పాఠశాలకు లోకల్ కింద ఇద్దరు ఉపాధ్యాయులు బదిలీపై వచ్చారు. దీంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందనుందని గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొత్త జోనల్ పద్ధతి ప్రకారం ఉద్యోగ, ఉపాధ్యాయ బదిలీల్లో జీవో 317 అమలు చేయడంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ జీవో కింద ఉపాధ్యాయులు సొంత జిల్లాకు బదిలీపై వస్తుండడంతో ఇక్కడి పాఠశాలలకు మోక్షం లభించనుంది.
63 మంది ఉపాధ్యాయులు..
బాన్సువాడ మండలంలో నాన్‌లోకల్ కింద ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్లు, పండిట్ ఉపాధ్యాయులు, పీఈటీలు కలుపుకొని మొత్తం 63 మంది బదిలీపై నిజామాబాద్ జిల్లాకు వెళ్లగా, లోకల్ కింద బాన్సువాడ మండలానికి 63 మంది ఉపాధ్యాయులు బదిలీపై వచ్చారు. జీవో అమలుతో మండలంలోని మారుమూల ప్రాంతాలైన కాద్లాపూర్, కిమ్యానాయక్తండా, పులిగుండు తండా, సంగోజీపేట్, హన్మాజీపేట్, కోనాపూర్ పాఠశాలలకు కొత్త ఉపాధ్యాయులు రానున్నారు. దీంతో గట్టుమీది గ్రామాల విద్యార్థులకు ఈ జీవో ఎంతగానో మేలు చేసింది. ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోతో తమ పిల్లలకు నాణ్యమైన విద్య అందనుందని మారుమూల గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.