TG Speaker : ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ ప్రారంభించారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌పై ఆయన విచారణ చేపట్టారు. బీఆర్ఎస్ నేత పాడి కౌశిక్ రెడ్డి, బీజేపీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఇతరులు వేసిన అనర్హత పిటిషన్లపై విచారణ కొనసాగుతున్నది.
పిటిషనర్ల వాదనలు విన్న తర్వాత స్పీకర్ సాక్ష్యాలను నమోదు చేయనున్నారు. స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశాలతో ఈ విచారణ చేపట్టారు. పెండింగ్‌లో ఉన్న మూడు అనర్హత పిటిషన్లపై సుప్రీంకోర్టు గతంలోనే వివరణ కోరింది. విచారణ జరిపి రెండు వారాల్లో నివేదిక ఇవ్వాలని స్పీకర్‌ను ఆదేశించింది. ఈ క్రమంలో పెండింగ్ పిటిషన్లపై స్పీకర్ విచారణ జరుపుతున్నారు. విచారణ అనంతరం స్పీకర్ కార్యాలయం సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించనుంది.