హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ట్రాన్స్కోలో పలు ప్రాజెక్టుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. వాటికి సంబంధించిన టెండర్లపై అనేక ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల ఆ టెండర్లను ఆహ్వానించాక వాటి అంచనాలు, కొటేషన్లు పెంచాలంటూ ఓ ఉన్నతాధికారి తీవ్ర ఒత్తిడి తెస్తున్నారట. ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక ఇంజినీర్లు సతమతమవుతున్నారు. ఆ ఉన్నతాధికారి చెప్పినట్టు చేస్తే తాము ఇరుక్కోవాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. దీంతో ట్రాన్స్కో జారీచేసిన షాద్నగర్, కోకాపేట, పరిగి సబ్స్టేషన్ల టెండర్లతోపాటు ఎర్రగడ్డ, వనపర్తి, గజ్వేల్, గోల్కొండ విద్యుత్తు లైన్ల టెండర్లు పెండింగ్లో పడ్డాయి.
నిమ్స్ దవాఖానకు సంబంధించిన 220 కేవీలైన్ టెండర్లు ఇప్పటివరకు ఐదుసార్లు రద్దయ్యాయి. దీని వెనుక కాంట్రాక్టర్లు, కొందరు ఉన్నతాధికారులు ఉన్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సదరు కాంట్రాక్టర్లకు పైస్థాయి అధికారుల అండదండలుండటంతో బిడ్స్ దాఖలు చేయడంలేదట. అంచనాలు పెరిగిన తర్వాత టెండర్లు దాఖలు చేసేందుకు వారు సిద్ధమవుతున్నట్టు సమాచారం.
బిడ్స్ దాఖలు చేసిన తర్వాత మళ్లీ అంచనాలు సవరించే విషయంపై ఇంజినీర్లు సతమతమవుతున్నారు. ఉన్నతాధికారుల ఒత్తిళ్లకు తలొగ్గి నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో తామే బాధ్యత వహించాల్సి వస్తుందని, ఆ ఫైళ్లపై సంతకాలు చేసినందుకు తామే విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో విద్యుత్తు సంస్థలో అదనపు బాధ్యతలు నిర్వహించి, రెండు జీతాలు పుచ్చుకున్న ఓ ఉన్నతాధికారి వ్యవహారాన్ని ఇంజినీర్లు ఈ సందర్భంగా ప్రస్తావిస్తున్నారు.
వాస్తవానికి అదనపు బాధ్యతల్లో ఉన్నప్పుడు పూర్తి జీతం తీసుకోవడానికి నిబంధనలు అనుమతించవు. దీంతో కొన్ని నెలల తర్వాత ఆ అధికారి నుంచి సొమ్ము రికవరీ చేసేందుకు అధికారులు ప్రయత్నించగా.. తీసుకున్న మొత్తాన్ని తిరిగి ఇచ్చేందుకు ఆ ఉన్నతాధికారి నిరాకరించడమే కాకుండా తనకు జీతం ఇచ్చినవారిని సస్పెండ్ చేస్తానంటూ బెదిరించారట. దీనిపై ఆరా తీసేందుకు టీజీ ట్రాన్స్కో డైరెక్టర్ లతావినోద్ను ‘నమస్తే తెలంగాణ’ ఫోన్ ద్వారా సంప్రదించినప్పటికీ ఆమె స్పందించలేదు.