భద్రాచలం, జూన్ 27 : రాష్ట్రంలో రెవెన్యూ శాఖ మంత్రి ఆదాయం గణనీయం గా పెరుగుతుంటే రాష్ట్ర ఆదాయం మాత్రం తగ్గుతున్నదని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ ఆరోపించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శనివారం ఏర్పాటుచేసిన బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశంలో ఎమ్మెల్సీలు తకెళ్లపల్లి రవీందర్రావు, తాతా మధుతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పువ్వాడ మాట్లాడుతూ.. భద్రాచలం ఏజెన్సీలో గిరిజన సొసైటీల ముసుగులో ఇసుక దోపిడీ జరుగుతున్నదని పేర్కొన్నారు. భద్రాచలం, చర్ల, దుమ్ముగూడెం మండలాల్లో ఎటువంటి అభివృద్ధి లేకపోయినా, ఇసుక లారీల ద్వారా ఎమ్మెల్యేకు మాత్రం ఆదాయం వస్తున్నదని ఎద్దేవాచేశారు. పొరపాటున రేవంత్‌రెడ్డిని గద్దెనెకించామని, కేసీఆర్ సారే మళ్లీ వస్తే తమ బతుకులు మారతాయంటూ పేదలు ఆవేదన చెందుతున్నారని తెలిపారు. రానున్నది మళ్లీ గులాబీ ప్రభుత్వమేనని పేర్కొన్నారు. చంద్రబాబు మాటలు విని తెలంగాణకు రావాల్సిన కృష్ణా, గోదావరి నదీజలాల హక్కులను పోగొట్టుకుంటే భవిష్యత్ తరాలు క్షమించవని రేవంత్‌రెడ్డికి హితవు పలికారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే భద్రాచలం పట్టణం ముంపునకు గురయ్యే అవకాశం ఉందని, గ తంలో తాను మంత్రిగా ఇదే అంశాన్ని లేవనెత్తానని గుర్తుచేశారు. సీతమ్మసాగర్, సీతా రా మ ప్రాజెక్టులను పూర్తిచేసి తెలంగాణ జల హక్కులను కాపాడాలని డిమాండ్ చేశారు.
భద్రాచలం నియోజకవర్గంలోని బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఎమ్మెల్సీ, ఖమ్మం ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు ఇన్చార్జి తకెళ్లపల్లి రవీందర్రావు అన్నారు. ప్రభుత్వం నిర్వహించే సర్ ప్రోగ్రాంను పరిశీలిస్తూ ఓటు నమోదు సరళిపై అవగాహన కలిగి, బీఆర్ఎస్ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. బూత్ లెవల్ ఏజెంట్లు పార్టీ సూచనలు పాటించాలని ఆదేశించారు.
భద్రాచలంలో బీఆర్ఎస్ తరఫున ఎమ్మెలే ్యగా గెలిచిన తెల్లం వెంకట్రావు ‘జిత్తులమారి నక్క’ అని నియోజకవర్గ ప్రజలందరికీ అర్థమైందని ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ పేర్కొన్నారు. ప్రజల గుండెలమీద దెబ్బకొట్టిన ‘తెల్లం’ను భద్రాద్రి రాముడు కూడా క్షమించడని తెలిపారు. బీఆర్ఎస్ అంటే భద్రాచలం అడ్డా అని కార్యకర్తలు మరోసారి నిరూపించే సమ యం ఆసన్నమైందని చెప్పారు. సమావేశంలో బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి రావులపల్లి రాంప్రసాద్, నాయకులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం మండలం పెద్దనల్లబెల్లి గ్రా మ పంచాయతీ వార్డు సభ్యుడు పూసం దాసు మాజీ మంత్రి పువ్వాడ, ఎమ్మెల్సీలు తకెళ్లప ల్లి, తాతా మధు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీ లో చేరారు. ప్రభుత్వ విధానాలు నచ్చక బీఆర్ఎస్లో చేరుతున్నట్టు దాసు తెలిపారు.