అక్కడంతా హడావుడి వాతావరణమే కనిపిస్తుంది. హాలంతా ఒక్కరి కోలాహలమే ఉంటుంది. అతనే ప్రశ్న సంధిస్తాడు.. జవాబూ చెప్పేస్తుంటాడు.. ‘నా మాటే శాసనం’ అనేస్తూ, దాన్ని పాటించాలని హుకుం జారీ చేస్తాడు. తాను చెప్పినట్టు చేయకపోతే.. ‘మీ బతుకులు మారవు సరికదా.. మరింత దరిద్రంగా తయారవుతాయ’ని భయపెడతాడు. సభికుల ముఖాల్లో కన్ఫ్యూజన్ కనిపిస్తే.. ఓ రెండు పిట్టకథలు వదులుతాడు. మరో రెండు కుళ్లు జోకులు పేలుస్తాడు. తన స్వీయ అనుభవాలు చెబుతూ.. ఆ సందర్భంలో అవతలి వ్యక్తులకు తానెలా పాఠం చెప్పానో కాసేపు గర్వంగా చెప్పుకొంటాడు. గుణపాఠం నేర్చుకున్న విషయాలూ కొన్ని పంచుకుంటాడు (అవి అందరికీ వర్తించవు). చివరికి మనిషి.. ‘మని’షిగా మారడమే విజయసూత్రం అని బోధిస్తాడు. అలా మారడమే నిఖార్సైన వ్యక్తిత్వ వికాస విజయం అని తీర్మానిస్తాడు. చిత్రంగా ఉంది కదూ ఈ వ్యవహారం. ఇటీవల వ్యక్తిత్వ వికాస సదస్సుల్లో కొనసాగుతున్న ట్రెండ్ ఇది. అసలు వ్యక్తిత్వ వికాసం అంటే ఏమిటి? మోటివేషనల్ స్పీకర్ లక్ష్యం ఏదై ఉండాలి?

ఇటీవలి కాలంలో వ్యక్తిత్వ వికాసం, మోటివేషనల్ స్పీచెస్ అనేవి ట్రెండ్‌గా మారాయి. అయితే, శాస్త్రీయ దృక్పథం, సరైన శిక్షణ లేని కొందరు వ్యక్తుల వల్ల ఈ రంగం తప్పు దారి పడుతున్నది. వ్యక్తిత్వ వికాస శిక్షణ స్ఫూర్తినిచ్చే మార్గమా? అపోహల వలయమా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. చూడగా, చూడగా వ్యక్తిత్వ వికాస శిక్షణ ఓ ఆర్భాటంగా మారింది అనడం అతిశయోక్తి కాదేమో అనిపిస్తుంది. అర్హత, అనుభవం లేని శిక్షకులు ఊరికి ఒకరు పుట్టుకొస్తున్నారు. శిక్షణ ఇస్తున్న కొన్ని సంస్థలు కూడా వ్యక్తిత్వ వికాస శిక్షణకు, కోచ్‌గా మారడానికి ఎటువంటి అర్హతలు అవసరం లేదని తప్పు దారి పట్టించడం జరుగుతున్నది. కౌన్సిలింగ్‌కి కూడా ఎటువంటి అర్హతలు అవసరం లేదని వేదికలపై ప్రకటించడం విడ్డూరం. అసలు వ్యక్తిత్వ వికాసం గురించి సైకాలజీ ఏం చెప్తుంది, భారతీయ మూలాలు ఏం చెప్తున్నాయో తెలుసుకోకుండా, కేవలం మాటల గారడీనే వ్యక్తిత్వ వికాసంగా చెలామణి అవుతుండటం గర్హనీయం.
నేటి పోటీ ప్రపంచంలో ఒత్తిడిని అధిగమించడానికి, కెరీర్లో రాణించడానికి ప్రతి ఒక్కరికీ మానసిక స్థిరత్వం, వ్యక్తిత్వ వికాసం ఎంతో అవసరం. కానీ, ప్రస్తుతం పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న కొన్ని వ్యక్తిత్వ వికాస కేంద్రాలు, అర్హత లేని మోటివేషనల్ స్పీకర్లు యువతను తప్పుదోవ పట్టిస్తున్నారనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. పాజిటివ్ థింకింగ్ పేరుతో వాస్తవాలకు దూరంగా సాగుతున్న ఈ శిక్షణ వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ!

తప్పు దారి పట్టడానికి కారణాలు..
1. శాస్త్రీయ అవగాహన లేమి
వ్యక్తిత్వ వికాసం అనేది మానసిక శాస్త్రంతో ముడిపడి ఉన్న అంశం. ప్రతి మనిషి మానసిక స్థితి, వారి నేపథ్యం, సామర్థ్యాలు వేర్వేరుగా ఉంటాయి. నేటి తరం మోటివేషనల్ స్పీకర్లలో చాలామంది సైకాలజీలో ఎలాంటి అధికారిక శిక్షణ లేదా డిగ్రీ లేనివారే. వారు కేవలం కొన్ని పుస్తకాలు చదివి, స్టేజ్‌పై ఆకర్షణీయంగా మాట్లాడే నైపుణ్యంతో అందరికీ ఒకే రకమైన సూత్రాలు వర్తిస్తాయని బోధిస్తున్నారు. ఇది తీవ్రమైన మానసిక సమస్యలు లేదా ఒత్తిడిలో ఉన్న విద్యార్థులకు మరింత హాని కలిగిస్తుంది.
2.నువ్వు ఏదైనా చేయగలవు..
‘నువ్వు అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు’, ‘నీకు సాధ్యం కానిది లేదు’ అంటూ స్టేజీలపై ఇచ్చే ఉపన్యాసాలు వినడానికి తాత్కాలికంగా బాగుంటాయి. కానీ, ఇది యువతలో హద్దులు లేని అంచనాలను, అవాస్తవిక లక్ష్యాలను పెంచుతుంది. ప్రతి మనిషికీ కొన్ని పరిమితులు, బాహ్య పరిస్థితుల ప్రభావం ఉంటాయి. వాస్తవాలను గుర్తించకుండా కేవలం ‘పాజిటివ్ థింకింగ్’ని మాత్రమే నమ్ముకుంటే, వైఫల్యం ఎదురైనప్పుడు వారు తీవ్రమైన డిప్రెషన్‌కు లోనవుతున్నారు.
3. మార్కెటింగ్ మాయాజాలం
వ్యక్తిత్వ వికాసం అనేది నేడు ఒక లాభసాటి వ్యాపారంగా మారిపోయింది. కొన్ని రోజుల వర్క్‌షాప్‌ల పేరుతో వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తూ, జీవితాన్ని మార్చేస్తామనే అవాస్తవ ప్రకటనలతో విద్యార్థులను, తల్లిదండ్రులను ఆకర్షిస్తున్నారు. కేవలం రెండు రోజుల సెమినార్‌తో జీవితాంతం ఉండే అలవాట్లు లేదా వ్యక్తిత్వం మారిపోతుందని భావించడం కేవలం భ్రమ మాత్రమే.
4. క్లినికల్ సమస్యలను విస్మరించడం..
తీవ్రమైన యాంగ్జయిటీ, డిప్రెషన్ లేదా లెర్నింగ్ డిసేబిలిటీస్ లాంటి సమస్యలు ఉన్న విద్యార్థులకు నిపుణులైన సైకాలజిస్టులు లేదా సైకియాట్రిస్టుల కౌన్సిలింగ్ అవసరం. కొంతమంది ట్రైనర్లు ఇవన్నీ కేవలం ‘బద్ధకం’ లేదా ‘నెగెటివ్ ఆలోచనల’ వల్లే జరుగుతాయని చెప్తూ, వారి సమస్య తీవ్రతను తగ్గిస్తున్నారు. దీనివల్ల బాధితులు సరైన సమయానికి వైద్య సహాయం తీసుకోలేకపోతున్నారు.

అసలు సైకాలజీ ఏం చెప్తుంది?
పాశ్చాత్య మనస్తత్వ శాస్త్రం ప్రకారం వ్యక్తిత్వ వికాసం అనేది ఒక వ్యక్తి ఆలోచనలు, భావోద్వేగాలు, ప్రవర్తన, పర్యావరణంతో వారు జరిపే పరస్పర చర్యల కలయిక. ఆధునిక సైకాలజీ పితామహులుగా పేరున్న పలువురు ప్రసిద్ధ మనస్తత్వవేత్తలు వ్యక్తిత్వ వికాసాన్ని వేర్వేరు కోణాల్లో విశ్లేషించారు. అందులో అత్యంత ప్రాచుర్యం పొందిన కొన్ని ముఖ్యమైన సిద్ధాంతాలు, సైకాలజిస్టుల అభిప్రాయాలు ఇలా ఉన్నాయి..
మన మూలాల్లో..
ఉపనిషత్తుల ప్రకారం వ్యక్తిత్వ వికాసం అనేది కేవలం బాహ్య ప్రవర్తనను, నైపుణ్యాలను లేదా మాట్లాడే తీరును మార్చుకోవడం కాదు. అది అంతర్గత పరివర్తన. ఒక వ్యక్తి తనలోని లౌకిక అవగాహన నుంచి ఉన్నతమైన ఆధ్యాత్మిక చైతన్యం వైపు సాగించే ప్రయాణమే నిజమైన వ్యక్తిత్వ వికాసం. ఉపనిషత్తులు, తత్వశాస్త్రం ప్రకారం వ్యక్తిత్వాన్ని, దాని వికాసాన్ని అర్థం చేసుకోవడానికి ప్రధానంగా రెండు ముఖ్యమైన విశ్లేషణలను పరిశీలించాలి:
1. పంచకోశ సిద్ధాంతం
మానవ వ్యక్తిత్వం ఐదు పొరలు లేదా కోశాలతో నిర్మితమైందని తైత్తిరీయ ఉపనిషత్తు చెబుతుంది. ఈ ఐదు కోశాలను సమతుల్యంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడమే సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం.
2. రథ రూపకం
కఠోపనిషత్తులో మానవ జీవితాన్ని, వ్యక్తిత్వాన్ని ఒక రథంతో పోల్చారు. వ్యక్తిత్వ నిర్వహణకు ఇది అద్భుతమైన ఉదాహరణ ఆత్మానం రథినం విద్ధి శరీరం రథమేవ తు బుద్ధిం తు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవ చ॥
దీని అర్థం.. వికాసం అంటే బుద్ధి అనే సారథి, మనసు అనే పగ్గాల ద్వారా, ఇంద్రియాలనే గుర్రాలను సరైన మార్గంలో నడిపించినప్పుడే ఆ రథం గమ్యస్థానాన్ని చేరుకుంటుంది. అంటే, ఇంద్రియాల మీద మనసుకు, మనసు మీద బుద్ధికి నియంత్రణ సాధించడమే వ్యక్తిత్వ వికాసం.

ఉపనిషత్తుల ప్రకారం వికసించిన వ్యక్తిత్వ లక్షణాలు
శ్రేయస్సు వైపు పయనం: లౌకిక సుఖాలను ఇచ్చే ‘ప్రేయస్సు’ కంటే, జీవితానికి శాశ్వత హితాన్ని చేకూర్చే ‘శ్రేయస్సు’ మార్గాన్ని ఎంచుకోవడం.
ఉపనిషత్తుల దృష్టిలో వ్యక్తిత్వ వికాసం అంటే కేవలం సమాజంలో విజయం సాధించడం కాదు; అది ఒక వ్యక్తి ‘జీవన నైపుణ్యం’ నుంచి ‘ఆత్మ నైపుణ్యం’ వైపు ఎదగడం. బాహ్య ప్రపంచాన్ని గెలవడంతోపాటు అంతర్ ప్రపంచాన్ని జయించడమే నిజమైన వికాసం.
పాశ్చాత్య సైకాలజిస్టులు వ్యక్తిత్వాన్ని వ్యక్తి-సమాజం లేదా వ్యక్తి-పర్యావరణం మధ్య ఉండే సంబంధంగా చూశారు. భారతీయ తత్వశాస్త్రం వ్యక్తిత్వాన్ని ‘ఆత్మ-పరమాత్మ’ లేదా ‘అంతర్గత చైతన్యం’ వైపు నడిపించే సాధనంగా చూసింది. బాధాకరమైన విషయం ఏమిటంటే నేటి సమాజంలో వ్యక్తిత్వ వికాస శిక్షకులుగా చెప్పుకొంటున్న వారిలో ఈ అంశాలపై కనీస అవగాహన లేకపోవడం. అధ్యయనం చేయాలనే ఆసక్తి కూడా లేకపోవడం. రెండు, మూడు రోజుల శిక్షణకు హాజరు కావడం, ఆ అరకొర జ్ఞానంతో వ్యక్తిత్వ వికాస నిపుణులుగా రంగప్రవేశం చేస్తున్నారు.
అసలు మోటివ్ ఏంటి?
మనస్తత్వ శాస్త్రం ప్రకారం వ్యక్తిత్వంలో మార్పు అనేది క్రమశిక్షణ, నిరంతర సాధనతోపాటు ఆలోచనా విధానంలో మార్పు ద్వారా రావాలి! అంతేతప్ప, ఎవరో అరిచి చెప్పే డైలాగుల వల్ల అది రాదు. ఈ రోజుల్లో ఎలాంటి సైకాలజీ లేదా కౌన్సెలింగ్ నేపథ్యం లేని వారు కూడా కేవలం స్టేజ్ ఫియర్ లేకుండా మాట్లాడగలిగితే చాలు, ‘లైఫ్ కోచ్’ లేదా ‘పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్’ అని బోర్డులు పెట్టేస్తున్నారు. వీరికి మానవ మనస్తత్వంపై శాస్త్రీయమైన అవగాహన ఉండదు. మానసిక ఒత్తిడి, నిరాశ లేదా తీవ్రమైన ఆందోళనతో ఉన్న యువతీ యువకులకు వీరు ఇచ్చే ‘నువ్వు అనుకుంటే ఏదైనా సాధ్యం’, ‘నెగటివ్ ఆలోచనలు అస్సలు రానివ్వద్దు’ లాంటి పైపైన చిట్కాలు మరింత హాని చేస్తాయి.
‘నువ్వు గట్టిగా కోరుకుంటే విశ్వం నీకు తెచ్చి ఇస్తుంది’ అనే సిద్ధాంతాన్ని తెలుగులో విపరీతంగా వాడేస్తున్నారు. పొద్దున లేచినప్పటి నుంచి రాత్రి వరకు ‘నాకు డబ్బు వస్తోంది’, ‘నేను కోటీశ్వరుడిని అవుతున్నాను’ అని ఊహించుకుంటే చాలు, బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడిపోతాయనే స్థాయికి దీనిని దిగజార్చారు. ఇది యువతను వాస్తవిక ప్రపంచం నుంచి దూరం చేసి, కష్టపడి పనిచేసే గుణాన్ని చంపేసి, కేవలం పగటికలలకే పరిమితం చేస్తుంది.
కొన్ని వ్యక్తిత్వ వికాస శిక్షణ శిబిరాల వెనుక మల్టీ లెవెల్ మార్కెటింగ్ లేదా క్రిప్టో, ట్రేడింగ్ స్కామ్‌ల, రియల్ ఎస్టేట్ ప్రమోషన్ దాగి ఉంటున్నాయి. మొదట వ్యక్తిత్వ వికాసం, లీడర్షిప్ స్కిల్స్ నేర్పుతామని పిలిచి, ఆ తర్వాత ‘మనీ మంత్ర’ అసలు సీక్రెట్ ఇదంటూ యువతను ఏజెంట్లుగా మారుస్తున్నారు. దీనివల్ల చదువుకునే వయసులో విద్యార్థులు లక్షల రూపాయలు నష్టపోయి, కెరీర్ పాడుచేసుకున్న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. దీనికి పరాకాష్ట ఏంటంటే.. స్కూల్స్, కాలేజీల్లో చెప్పే చదువు ఎందుకూ పనికి రాదని, తాము చెప్పేదే అసలైన చదువు అంటూ యువతను తప్పుదోవ పట్టించడం. చదువు సంపాదన కోసమే కాదని, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడం కూడా అని మర్చిపోవడం.
సరైన మార్గం ఏమిటి?
జీవితంలో ఎదగడానికి స్ఫూర్తి అవసరమే, కానీ అది శాస్త్రీయమైన ఆలోచనలకు, శ్రమకు తోడవ్వాలి. ఇలాంటి తప్పుడు వక్తల వలలో పడకుండా… స్వీయ విశ్లేషణ, అర్హత కలిగిన మనస్తత్వవేత్తల మార్గదర్శకత్వం వైపు మొగ్గు చూపడమే దీనికి సరైన పరిష్కారం. వ్యక్తిత్వ వికాసం అనేది ఒక నిరంతర ప్రక్రియ. అది కేవలం స్టేజ్ ఉపన్యాసాల ద్వారా రాదు. ఇందులో మార్పు రావాలంటే అర్హత కలిగిన నిపుణులను ఎంచుకోవాలి. కౌన్సెలింగ్ లేదా శిక్షణ అవసరమైనప్పుడు గుర్తింపు పొందిన సైకాలజిస్టులు, సర్టిఫైడ్ కెరీర్ గైడెన్స్ నిపుణులను సంప్రదించాలి. ఒకరి మాటలు విని కాకుండా, తమ బలాలు, బలహీనతలు ఏమిటో స్వయంగా గుర్తించి, వాటిపై క్రమశిక్షణతో పని చేయాలి. జీవితంలో గెలుపోటములు రెండూ సమానమేనని, వైఫల్యాల నుంచి పాఠాలు నేర్చుకోవడమే నిజమైన వ్యక్తిత్వ వికాసమని గ్రహించాలి.
స్పూర్తినిచ్చే మాటలు అవసరమే, కానీ అవి వాస్తవానికి, సైన్స్‌కు దూరంగా ఉన్నప్పుడు ప్రమాదకరంగా మారుతాయి. యువత, తల్లిదండ్రులు ఈ మోటివేషనల్ మాయాజాలాన్ని గమనించి, శాస్త్రీయమైన, ఆచరణాత్మకమైన పద్ధతులను అలవర్చుకున్నప్పుడే నిజమైన వ్యక్తిత్వ వికాసం సాధ్యమవుతుంది.

మనీ.. మనీ
ప్రస్తుతం వ్యక్తిత్వ వికాసం రంగం ఊహించని రీతిలో వ్యాపారమయమైంది. నిజానికి వ్యక్తిత్వ వికాసం అంటే వ్యక్తి మానసిక ఎదుగుదల, భావోద్వేగాల నియంత్రణ, ప్రవర్తనా విధానాన్ని మెరుగుపరుచుకోవడం. దురదృష్టవశాత్తూ ఈ రోజుల్లో ఇది ‘మనీ మంత్ర’గా మారి యువతను తప్పుదోవ పట్టిస్తున్నది. ప్రస్తుతం జరుగుతున్న అనేక మోటివేషనల్ క్లాసులలో ‘విజయం’ అనే పదానికి తప్పుడు నిర్వచనం ఇస్తున్నారు. ‘లగ్జరీ కార్లు, పెద్ద బంగ్లాలు, కోట్లాది రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉంటేనే నువ్వు సక్సెస్ అయినట్టు, లేకపోతే నీ జీవితం వ్యర్థం’ అనే రకమైన భావజాలాన్ని నూరిపోస్తున్నారు.
దీనివల్ల యువతలో సంపాదన పట్ల విపరీతమైన వ్యామోహం, తోటివారితో అనారోగ్యకరమైన పోటీ పెరుగుతుంది తప్ప, మానసిక ప్రశాంతత, నైతిక విలువలు, సత్సంబంధాలు అనే అసలైన వ్యక్తిత్వ వికాస మూలాలు కనుమరుగయ్యే ప్రమాదం ఉంది. ఈ ‘మనీ మంత్ర’వక్తలు వేదికలపై బిగ్గరగా అరుస్తూ, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్లతో సభికులలో తాత్కాలికంగా రక్తం ఉడికేలా చేస్తారు. ఆ సమయంలో వినేవారికి ‘నేనేదో సాధించేయగలను’ అనే భ్రమ కలుగుతుంది. కానీ, ఆ హడావుడి దాటి ఇంటికి వచ్చాక, నిత్య జీవితంలోని వాస్తవ సమస్యలను ఎలా ఎదుర్కోవాలో తెలియక మళ్లీ నిరాశలోకి వెళ్లిపోతారు.
యువతకు నష్టం ఇలా..
తాత్కాలిక ఉత్సాహం- దీర్ఘకాలిక నైరాశ్యం: స్పీచ్ విన్నప్పుడు వచ్చే ఉత్సాహం కొన్ని రోజుల్లోనే ఆవిరైపోతుంది. ఆ తర్వాత మళ్లీ పాత స్థితికి చేరినప్పుడు, తమలో ఏదో లోపం ఉందనే గిల్ట్ పెరుగుతుంది.
వైఫల్యాలను తట్టుకోలేకపోవడం: జీవితంలో ఒడుదొడుకులు సహజం అనే విషయాన్ని నేర్పకుండా, కేవలం ‘విజయం’ మాత్రమే ఏకైక లక్ష్యంగా బోధించడం వల్ల చిన్న ఓటమిని కూడా యువత తట్టుకోలేకపోతున్నది.
సమయం, డబ్బు వృథా: ఆచరణ సాధ్యం కాని కోర్సుల వెనుక పడి విద్యార్థులు తమ విలువైన సమయాన్ని, తల్లిదండ్రుల డబ్బును వృథా చేసుకుంటున్నారు.
సరైన మార్గం
శాస్త్రీయ దృక్పథం
సరైన శిక్షణ
నైపుణ్యం
అనుభవం
నైతికత
వ్యక్తిత్వ వికాసం
సమాజ సేవ
తప్పుదారి
జీవితాన్ని మార్చే మంత్రం!
వారాల్లోనే విజయం
100% గ్యారెంటీ!
నేనే గురువు!
నా మాటే శాసనం!
సీక్రెట్ ఫార్ములా