ఒక నాయకుడిని, తన అనుచరుల నుంచి వేరు చేసి ప్రత్యేకంగా చూపించేది ఆవిష్కరణే అంటాడు స్టీవ్ జాబ్స్. కొత్త విషయాలు ఆలోచించటం సృజనాత్మకత అయితే, వాటిని సాకారం చేయడం ఆవిష్కరణ. అలాంటి ప్రతి ఆవిష్కరణా మార్కెట్లో విజయవంతం కావాలనేం లేదు. కానీ, అందుకోసం చేసే ప్రయత్నం, సాగే ప్రయాణం వ్యక్తిని ఓ ఉన్నతమైన స్థాయికి చేరుస్తుంది. అసలు వైఫల్యం అనేది లేకుండా సృజనాత్మకత గానీ, ఆవిష్కరణ గానీ ఉండవనేది పెద్దలు చెప్పే మాట. కాబట్టి ఫలితం ఎలా ఉన్నా… ఆ అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకోగలిగితే, తనను తాను తీర్చిదిద్దుకోగలిగితే.. అది మరో ఆవిష్కరణకు పునాది అవుతుంది.
వాళ్లు అందరిలా ఆలోచించలేదు.అందరూ నడిచే దారిలో నడక సాగించలేదు. వాళ్లు ప్రపంచాన్ని కొత్తగా చూశారు. దానికి తగిన అవకాశాలు సృష్టించారు.వ్యక్తిగతంగా అభివృద్ధి సాధిస్తూనే.. సమాజ అభ్యున్నతికి కొత్త బాటలు వేస్తున్నారు. సృజనాత్మకతకు మార్కెటింగ్ నైపుణ్యాలను అద్ది సంపద సృష్టిస్తున్నారు.ఇప్పుడు వాళ్లది ఒంటరి నడక కాదు.. పదిమందికి దారి చూపే తీరం!ఈ ఆవిష్కర్తల ప్రపంచం ఎప్పుడూ సంచలనాలకు నెలవు.
సాహసాల కొలువు. ఇప్పుడు అందులో కొన్ని మెరుపులను చూద్దాం.

ప్రతి అలా ఓ సంద్రమై!
ఆలోచనలను ఆచరణ స్థాయికి తెచ్చి, దాన్ని వ్యాపార వనరుగా మార్చుకోవడంలోనే స్టార్టప్‌లకు బీజం పడుతుంది. మన దేశంలో అలాంటి ప్రయోగాలకు ఆరు దశాబ్దాల చరిత్ర ఉంది. 1968లో టాటా కన్సల్టెన్సీ సర్వీసు ప్రారంభంతో మన దేశంలో స్టార్టప్‌ల ప్రయాణం స్టార్టయింది. ఇండియాలో ఐటీ రంగ సేవలకు అదే నాంది. 1990వ దశకం వరకూ ఒకొక్కటిగా వెలుగు చూస్తూ వచ్చిన స్టార్టప్ ప్రయత్నాలు ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ల వేగంతో పాటు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ఆ దశలో వచ్చిన నౌకరీ డాట్ కాం (1997), మేక్ మై ట్రిప్ (1998) లాంటివి ఇంటర్నెట్ను ఉపయోగించుకొని వ్యక్తిగత అవసరాలు తీర్చుకోవడం ఎలాగో, ఎంతో శ్రమించాల్సిన పనులను సైతం సులువుగా ఎలా సాధించవచ్చో నేర్పాయి. ప్రస్తుతం దేశంలో 2.07 లక్షల స్టార్టప్‌లు పనిచేస్తున్నాయి. ఇందులో దాదాపు సగం ద్వితీయ శ్రేణి నగరాలలో పనిచేస్తున్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది.
భారతీయ స్టార్టప్ ప్రయాణాలు, అవి పనిచేసిన పరిస్థితులను పరిశీలిస్తే.. ఫ్లిప్‌కార్ట్‌ది ఓ విజయవంతమైన చరిత్ర. 2007లో ప్రారంభమైన ఈ సంస్థ ఆన్లైన్ రిటైల్ రంగాన్ని మార్చేసింది. యూనీకార్న్ హోదా (వంద కోట్ల డాలర్ల విలువ) సంపాదించింది. 2018లో వాల్‌మార్ట్ సంస్థ 16 బిలియన్ డాలర్ల మొత్తానికి దానిని సొంతం చేసుకోవడం ఓ సంచలనం. ఫుడ్ డెలివరీ రంగంలో జొమాటో, ఫిన్‌టెక్ రంగంలో పేటీంఎం, వాహన ప్రయాణ రంగంలో ఓలా విజయవంతమైన స్టార్టప్‌లుగా పేరు తెచ్చుకున్నాయి. బ్యూటీ యూనికార్న్‌గా నైకా, ఈ -కామర్స్ రంగంలో మీషో రాణించాయి. జెప్టో, స్విగ్గీ వంటి స్టార్టప్‌లు ఇంటర్నెట్ స్థానిక అవసరాలు తీర్చుకోవడం ఎలాగో నేర్పాయి.ఇదంతా గతం. వర్తమానంలోకి వస్తే కొందరు ఉత్సాహవంతులు సరికొత్త ఆవిష్కరణలతో ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదుతున్నారు. వారి గురించి తెలుసుకుంటే ఆసక్తికరంగా ఉంటుంది. ఇవన్నీ భిన్న రంగాలు కావడం విశేషం.
శ్రీధర్ బవేరా ఆయు ఏఐ వ్యవస్థాపకుడు

Sridhar Bavera
ఆరోగ్య సంరక్షణలో సరికొత్త మెరుపులు మెరిపిస్తున్నాడు ఆయు ఏఐ వ్యవస్థాపకుడు శ్రీధర్ బవేరా. ఇది ఓ సంపూర్ణమైన డిజిటల్ హెల్త్ ప్లాట్‌ఫామ్. దుబాయ్ బిట్స్ పిలానీలో దీని రూపకల్పన జరిగింది. రోగి సమస్య, లక్షణాల ఆధారంగా తనకు తగిన వైద్యుడిని, వైద్య పరీక్షలను సూచించే ఈ యాప్ మెరుగైన చికిత్సలకు దోహదం చేస్తుంది. ఈ సంస్థకు మహేష్ అద్వాని, రాకేష్ బెహ్రా , హితేష్ భయానీ లాంటి యాంజిల్ ఇన్వెస్టర్లు 5 లక్షల డాలర్లను సమకూరిస్తే, గూగుల్ క్లౌడ్స్ ద్వారా 2 లక్షల డాలర్లు రుణంగా లభించింది. ఆయు ఏఐకి ఇప్పటికే గుర్తింపు లభించింది. స్టార్టప్ ఇండియా, డీఎస్టీలు దీనిని ఇప్పటికే గుర్తించాయి. బిట్స్ పిలానీ, ఏఎంటీజెడ్లు దీనిపైన ఆసక్తి కనబరిచాయి. అద్భుతమైన ప్రభావాన్ని చూపగల ఆవిష్కరణ అని ప్రధాని మోదీ ప్రశంసలు అందుకున్నారు బవేరా. ఐఐటీ, బిట్స్ పిలానీ టాలెంట్‌తో రూపొందిన ఈ ఆవిష్కరణ ఈ నెలాఖరు నాటికి సేవలు ప్రారంభించే అవకాశం ఉంది.
జోవిత మస్కారెన్హాస్ బార్టిసన్స్ సహ వ్యవస్థాపకురాలు

Jovita Jordan Mascarenhas
జీవితంలో కచ్చితంగా రెండో అవకాశం వస్తుంది. చొరవ, స్పష్టత ఉంటే దాన్ని అందుకోవచ్చు అని నమ్ముతారు జోవిత. 40 ఏళ్ల వయసులో తన కొడుకుతో కలిసి కాక్టెయిల్స్ పట్ల తనకి ఉన్న అభిరుచిని ఓ మార్కెటింగ్ బ్రాండ్‌గా మలిచారు. అదే బార్టిసన్స్ పేరుతో సంచలనం సృష్టిస్తున్న కాక్టెయిల్ ఫ్లేవర్స్. కుటుంబాన్ని, వ్యాపారాన్ని సమతుల్యం చేసుకుంటూ కాక్టెయిల్ కల్చర్‌ని మరింతగా అందుబాటులోకి తేగలిగారు జోవిత.
హోల్‌సేల్ వ్యాపారులు, మధ్యవర్తులు, థర్డ్ పార్టీ రిటైలర్ల గోల లేకుండా తమ ఉత్పత్తులు నేరుగా దేశం నలుమూలలా ఉన్న వినియోగదారులకు చేరగలిగేలా బార్టిసన్ను తీర్చిదిద్దారు. దీని ద్వారా భారతీయ రుచులకు అనుగుణంగా అన్ని రకాల ఉత్పత్తులను తీర్చిదిద్దవచ్చు. అదీ తక్కువ చక్కెరతో! ఈ ఉత్పత్తుల సాయంతో ఇంట్లోనే సులువుగా, సరదాగా కాక్ టెయిల్స్ తయారు చేసుకోవచ్చు. వినియోగదారులతో సన్నిహితంగా మసలుతూ వాళ్ల అనుభవాల నుంచి వచ్చిన సమాచారంతో ఉత్పత్తుల్లో మార్పులు చేసే వ్యాపార వ్యూహాన్ని అమలు చేస్తున్నారు.
పార్థ్ చోప్రా ఎర్లీ.ఫిట్ సీఈఓ, సహ వ్యవస్థాపకుడు

Parth
ఆరోగ్య సంరక్షణలో పెట్టుబడి లాభదాయకం అన్న నమ్మకంతో పార్థ్ చోప్రా ఎర్లీ.ఫిట్ ప్రారంభించారు. ప్రపంచంలో మూడో వంతు ఊబకాయులు భారతదేశంలోనే ఉన్నారు. 2050 నాటికి మన దేశం ఊబకాయుల రాజధానిగా మారిపోతుందని గణాంకాలు హెచ్చరిస్తున్నాయి. అయినా కూడా ఇక్కడ వెయిట్ లాస్ ఇండస్ట్రీ తక్కువ స్థాయి, స్వల్పకాలికమైన పరిష్కారాలను మాత్రమే అందిస్తున్నది. ఊబకాయులకు భద్రమైన, సురక్షితమైన, విశ్వసనీయమైన… అది కూడా శాశ్వతమైన ఫలితాలు అందించటానికి ఎర్లీ.ఫిట్ ప్రారంభించారు. ఊబకాయాన్ని దూరం చేసుకోవడం వల్ల మన ఆయుష్షు పదేళ్లకు మించి పెరుగుతుందని చెబుతారు పార్థ్. ఈ ప్రాజెక్టు వెనక అనుభవజ్ఞులైన ఎండోక్రైనాలజిస్టులు, జీఎల్ఎపీ-1 (ఇన్సులిన్, ఆకలిలాంటి చర్యలను నియంత్రించే హార్మోన్) నిపుణులు ఉన్నారు. వాళ్లు తమ నైపుణ్యాన్ని, సాంకేతికతను జోడించి న్యూట్రిషన్, ఫిట్నెస్ రంగాలలో సలహాలు అందిస్తున్నారు. అమెరికాలోని కొలంబియా బిజినెస్ స్కూల్లో బిజినెస్ మేనేజ్మెంట్లో గ్రాడ్యుయేట్ అయిన పార్థ్కి ఈ రంగంలో 13 ఏళ్ల అనుభవం ఉంది. ఆ అనుభవం ఇప్పుడు తనకు విజయంగా, ఊబకాయులకు వరంగా మారనుంది.
సాహిల్ అగర్వాల్ సాహిల్ అగర్వాల్ అండ్ కంపెనీ వ్యవస్థాపకుడు

Sahil Agarwal
ముంబయిలో చార్టర్డ్ అకౌంటెంట్‌గా దాదాపు ఏడేళ్ల అనుభవం ఉన్న సాహిల్ అగర్వాల్ ఈ కంపెనీ స్థాపించారు. వ్యాపారం ఒకప్పటిలా లేదు. దాని ఆర్థిక అవసరాలూ మారుతున్నాయి. పెట్టుబడి దగ్గర నుంచీ మార్కెటింగ్ వరకూ ప్రతి పైసా మన దగ్గరకు రావడంలోనూ దాన్ని ఖర్చు చేయడంలోనూ నైపుణ్యం అవసరం. ఏ దశలో వెనకబడినా, తప్పటడుగు వేసినా సంస్థ అనే నౌక మునిగిపోవడం ఖాయం. బడాబడా కంపెనీలే నేర్పిన పాఠమిది.మారుతున్న ఈ వ్యాపార అవసరాలకు అనుగుణంగా అర్థిక సలహాలను అందించేందుకు ఈ సంస్థ కృషి చేస్తున్నది. దాని కోసం సంప్రదాయ విధానాలను పక్కన పెట్టి డేటా, వ్యాపార రంగం, మార్కెట్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని సలహాలు అందిస్తున్నది. వ్యాపారంలో ఉండే వాస్తవ పరిస్థితులను అర్థం చేసుకుంటూ, సాంకేతిక నైపుణ్యాన్ని జోడించి క్లయింట్లకు ఆత్మవిశ్వాసంతో కూడిన నిర్ణయాలు తీసుకోవటానికి సహకరిస్తున్నది.
అర్కా బైద్య గోల్డెన్ ఫ్లిచ్ డిజైన్ స్టూడియో సీఈఓ

Arka Baidya Golden Flitch
మార్కెట్లో ఇండియన్ బ్రాండ్స్ చెలామణీ తీరుతెన్నులను మార్చివేయడంలో గోల్డెన్ ఫ్లిచ్ డిజైన్ స్టూడియోకి ఐదేళ్ల అనుభవం ఉంది. 2021లో అర్కా బైద్య, వినయ్ కృష్ణ గుప్తాలు దీనిని ప్రారంభించారు. ఈ స్టూడియో 120 కంటే ఎక్కువగా బ్రాండ్లతో అనుసంధానమైంది. 500కి పైగా డిజిటల్ బ్రాండ్లను రూపొందించింది.ఈ డిజిటల్ ప్రపంచంలో కేవలం ఉత్పత్తి మాత్రమే ఉంటే సరిపోదు. వెబ్సైట్ దగ్గర నుంచీ యాప్ వరకూ, లోగో నుంచి ప్యాకెట్ వరకూ అంతా ఆకర్షణీయంగా ఉండాలి. ఆధునిక అవసరాలకు అనుగుణంగా కనిపించాలి. ఈ డిజిటల్ అవసరాలను తీర్చేదే గోల్డెన్ ఫ్లిచ్. సృజనాత్మక వ్యూహాలతో వ్యాపార ఫలితాలను తిరగరాయవచ్చు అని ఈ సంస్థ నమ్ముతుంది. వాటితో కంపెనీ బ్రాండ్ వ్యాల్యూ పెంచడం, మార్కెట్లో కచ్చితంగా అనుకున్న ఫలితాలను సాధించడానికి గోల్డెన్ ఫ్లిచ్ తోడ్పాటును అందిస్తున్నది. ‘ఇండియా ప్రపంచస్థాయి కంపెనీలను ఉత్పత్తి చేస్తున్నది. వాటికి తగినట్టుగానే ప్రపంచ స్థాయి బ్రాండింగ్ అవసరం’ అంటారు అర్కా బైద్య.
అంబుజా సక్సేనా లింక్డిన్ పర్సనల్ బ్రాండింగ్ కోచ్

Ambuj Saxena
అంబుజా సక్సేనా లింక్డిన్లో వేలమంది ఫాలోవర్లు ఉన్న పర్సనల్ బ్రాండింగ్ కోచ్. ఆ మాధ్యమం ద్వారా దాదాపు 300 మంది స్టార్టప్ వ్యవస్థాపకులు, విద్యార్థులు.. నాయకులుగా ఎదిగేందుకు శిక్షణ అందించారు. ఇప్పటి ప్రపంచంలో కేవలం వ్యాపారం చేస్తేనో, ఏదన్నా స్టార్టప్ ప్రారంభిస్తేనో సరిపోదు. ఇక్కడి వ్యక్తి కూడా ఓ ఉత్పత్తే! తనకు కూడా బ్రాండ్ ఇమేజ్ ఉండాలి. అందుకే మన మాట, సవాళ్లను ఎదుర్కొనే ప్రయత్నం, నలుగురితో మెలిగే తీరు.. అన్నీ ముఖ్యమే. బలంగా తన గొంతును వినిపించేవాడికే విలువ ఎక్కువ. ఈ నాయకత్వ లక్షణాలను తీర్చదిద్దడమే సక్సేనా ప్రత్యేకత. సక్సేనా కేవలం లింక్డిన్ ద్వారా మాత్రమే కాకుండా సోషల్ బజ్ అనే సంస్థ ద్వారా కూడా బ్రాండింగ్ సేవలు అందిస్తున్నారు. తన పుస్తకాలు, పాడ్‌కాస్టులు, సమావేశాలతోనూ.. వ్యక్తులు నాయకులుగా ఎదిగేందుకు, సంస్థలు స్థిరంగా నిలబడేందుకు సాయపడుతున్నారు.
దివ్యశిక్ష గుప్తా మిల్ వైజ్ వ్యవస్థాపకురాలు

Divyashikha Gupta
ఇప్పటి పిల్లల నుంచి చాక్లెట్లు, బిస్కట్లు, కూల్ డ్రింక్స్, చిప్స్… వీటన్నిటినీ దూరం చేయడం కష్టమే. మహా అయితే వాటి వాడకాన్ని కాస్త తగ్గించగలం. ఇవే రూపంలో ఆరోగ్యకరమైన తృణధాన్యాలను అందించగలిగితే ఎలా ఉంటుంది అనే ఆలోచన వచ్చింది దివ్యశిక్ష గుప్తాకి. అలాగని వ్యాపారంలోకి దూకేయలేదు. ఆహార రంగంలో దశాబ్దాల అనుభవం ఉన్న డాక్టర్ శ్రీకృష్ణ లాంటి శాస్త్రవేత్తల సలహాలు తీసుకుంది. ప్రాచీన ఆహార విజ్ఞానాన్నీ, నవతరం అవసరాన్నీ కలిపి రూపొందించిందే మిల్ వైజ్. పామ్ ఆయిల్, గ్లూటెన్ లాంటి పదార్థాలు లేకుండా కుకీస్, చాక్లెట్లు లాంటి ఉత్పత్తులు అందిస్తున్నది.
ప్రస్తుతం నేరుగాను ఇంకా తమ వెబ్సైట్ ద్వారా వినియోగదారులకు ఉత్పత్తులను అందిస్తున్నారు. ఇక నుంచి క్విక్ కామర్స్‌లోనూ, అంతర్జాతీయ ఎగుమతి ద్వారా విస్తరించేందుకు మిల్ వైజ్ ప్రయత్నిస్తున్నది. ఇప్పటి తరానికి రుచితో పాటు ఆరోగ్యాన్ని అందిస్తున్నది.
యష్ ఫత్నాని మీడియాకప్ వ్యవస్థాపకుడు

Yash Fatnani
చాలా సంస్థలు మార్కెటింగ్ కోసం కోట్లు ఖర్చు చేస్తాయి. కానీ, ప్రతి సంస్థా అనుకున్న ఫలితాన్ని రాబట్టలేదు. కారణం… తన ప్రచారం చీకట్లో బాణంలా సాగడం. కానీ మీడియా కప్ ఇందుకు భిన్నమైన వ్యూహంతో అద్భుతాలు సాధిస్తున్నది. కేవలం మన దేశంలోనే కాకుండా బ్రిటన్, అమెరికా, అరబ్ దేశాల్లోనూ మార్కెట్ ఆధిపత్యాన్ని ప్రదర్శించగలుగుతున్నది. ఇంతకీ తను అనుసరిస్తున్న వ్యూహం ‘ఒక్క శాతం సూత్రం’. నీ ఉత్పత్తిని నమ్మే ఆ కచ్చితమైన కొనుగోలుదారుడు ఎవరో గుర్తించడం. తన చుట్టూనే బ్రాండ్‌ను నిర్మించుకోవడం. అదే ఆ ఒక్క శాతం సూత్రం. ఈ ఒక్క శాతం కొనుగోలుదారులే లక్ష్యంగా బ్రాండ్ నిర్మించుకుంటే… లాభాలు వాటంతట అవే వస్తాయని నిరూపిస్తున్నది మీడియాకప్. ఆ ఫలితాన్ని సాధించాక క్రమంగా ఆ ఒక్క శాతం కాస్తా వంద శాతంగా మారుతుంది.
వచ్చే రోజులలో ఎక్కువ హడావుడి చేసే బ్రాండ్స్ కాకుండా కచ్చితత్వంతో పనిచేసే బ్రాండ్స్ మాత్రమే విజయం సాధిస్తాయి అంటున్నాడు సంస్థ వ్యవస్థాపకుడు యష్ ఫత్నాని.
మానస రాజన్ జుపిటర్ మెటా ల్యాబ్స్ సీఈఓ, సహవ్యవస్థాపకురాలు

Manasa Rajan
ఇప్పుడు లోకం అంతా డేటా మీదే నడుస్తున్నది. కానీ ఆ డేటాకు భద్రత ఉంటుందా? మరో మనిషి తొంగిచూడలేనంత రక్షణ దానికి ఉంటుందా! ఆ డేటా ఆధారంగా కావాల్సిన గణాంకాలు రూపొందించుకోగలిగే స్వేచ్ఛ ఉంటుందా.. అనే సందేహాలకు జవాబే జుపిటర్ మెటా ల్యాబ్స్. ఇది మన హైదరాబాద్‌లోనే ఉండటం విశేషం. అధునాతన బ్లాక్ చెయిన్ సాంకేతికత ఆధారంగా సురక్షితమైన డేటా భద్రతను అందిస్తున్నదీ సంస్థ. అందుకే ప్రపంచవ్యాప్తంగా 2 కోట్ల మందికి సంబంధించిన సమాచారం.. తన దగ్గర సురక్షితంగా ఉంది. HUL, ICICI, అమూల్.. లాంటి ప్రముఖ కంపెనీలు సైతం జుపిటర్ మెటా ల్యాబ్స్ సేవలు వినియోగించుకుంటున్నాయి. ఆ సమాచారం ఆధారంగా తమ లాభనష్టాల దగ్గర నుంచీ వినియోగదారుల తీరు వరకూ ప్రతి అంశాన్నీ అంచనా వేయగలుగుతున్నాయి.
కొన్ని గుణపాఠాలు

Startup1
స్టార్టప్ ఓ రంగుల కల మాత్రమే కాదు, స్థిరత్వం సాధించకుండా కేవలం దూకుడైన మార్కెటింగ్ మీద మాత్రమే ఆధారపడితే పేలిపోయే బుడగ కూడా! అందుకు ఉదాహరణే బైజూస్. విద్యారంగంలో ఎన్నో సంచలనాలను నమోదు చేసిన బైజూస్‌ను తర్వాత రోజుల్లో ఎన్నో సంక్షోభాలు చుట్టుముట్టాయి. సంస్థ వాల్యుయేషన్ 95 శాతం పడిపోయింది. దానితోపాటు ఫెమా నిబంధనల ఉల్లంఘన, దివాలా వంటి చట్టపరమైన సమస్యలను ఎదుర్కొంది. ఇక ఆడిట్ అవకతవకలు వెల్లడి కావడంతో ఫ్యాషన్ టెక్ జిలింగో కుప్పకూలింది. హోమ్ స్టే సంస్థ స్టేజిల్లా, ఈ- కామర్స్ సంస్థ ఆస్క్ మి డాట్ కామ్, ఫుడ్ డెలివరీ సంస్థ టైనీ ఔల్, గ్రోసరీ స్టార్టప్ పెప్పర్ టాప్ తదితరాలు ఫ్లాప్‌ల జాబితాలో చేరిపోయాయి.
స్టార్టప్ విప్లవం!

Importance Of Startup
దేశాభివృద్ధి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో పథకాలు రూపొందించాయి. ఎప్పటికప్పుడు నూతన విధానాలు తీసుకొస్తున్నాయి. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్లలో కోట్లాది మంది ఆకలి తీర్చడం కోసం హరిత విప్లవానికి బాటలు వేశారు. ధాన్యపు రాశులు పెంపు చేశారు. ఆ తర్వాత శ్వేత విప్లవంతో పాల ధారలు పారించారు. తర్వాతి కాలంలో సాంకేతిక విప్లవం జోరందుకుంది. కాలాన్ని బట్టి అవకాశాలను అందుకుంటూ ఆర్థిక వృద్ధి సాధించాలి. ఇప్పుడు అన్ని వృత్తుల్లోనూ టెక్నాలజీదే పైచేయి. ఇంటర్నెట్ సేవలు వేగవంతమయ్యాయి. రోజు రోజుకీ మరింత సులభతరమవుతున్నాయి. చవకైన సేవల కోసం స్టార్టప్‌లు ప్రపంచ మార్కెట్లో పోటీ పడుతున్నాయి. స్టార్టప్ విజయాలు వ్యక్తిగతం కాదు. అవి దేశ ప్రగతికి కొలమానాలని ప్రభుత్వాలు భావిస్తున్నాయి. తెలంగాణలో టీ హబ్ ఏర్పాటైనట్లే ఎన్నో ఇంక్యుబేషన్ సెంటర్లు ఆవిర్భవించాయి. ఈ కామర్స్ ఒక్కటే కాదు వ్యవసాయం, విద్య, వైద్యం, రవాణా, భద్రత, బ్యాంకింగ్ మరెన్నో రంగాల్లో స్టార్టప్ ప్రయోగాలను ప్రభుత్వాలు ప్రోత్సహిస్తున్నాయి. అలాగే పెట్టుబడిదారుల్ని ఆకర్షిస్తున్నాయి. 2025-26 ఆర్థిక సంవత్సరంలోనే 55,200 స్టార్టప్‌లు కొత్తగా నమోదయ్యాయి. దేశంలో స్టార్టప్‌ల వెల్లువకు, యువత ఆసక్తికి ఇదో ఓ ఉదాహరణ.
…? డాక్టర్ పార్థసారథి చిరువోలు