హైదరాబాద్, నవంబర్ 27 (నమస్తే తెలంగాణ): రాజ్యాంగ పరిరక్షణ దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చెప్పిన కుటుంబ పాలనకన్నా.. ఆర్ఎస్ఎస్ కుటుంబ పాలన చాలా ప్రమాదకరమైందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన ఒక వీడియోను విడుదల చేస్తూ.. మోదీ పాలనే దేశాన్ని అతలాకుతలం చేస్తూ, ప్రగతి వైపు కాకుండా ప్రగతినిరోధం వైపు తీసుకెళ్తున్నదని మండిపడ్డారు. అందుకే జాతీయ స్థాయిలో 19 రాజకీయ పార్టీలు మోదీ హటావో ఉద్యమానికి పిలుపునిచ్చాయన్నారు. అవినీతిపరులను ప్రోత్సహించొద్దంటున్న ప్రధాని మోదీ తన క్యాబినెట్లోనే 35 మంది అవినీతిపరులను పెట్టుకొని పని చేస్తున్నారని ఆరోపించారు. పార్లమెంట్లో చర్చలు సరిగా జరగడం లేదని అంటున్న మోదీ, ఆర్డినెన్స్లతో చట్టాలను ఆమోదించుకుంటుంటే చర్చలకు అవకాశం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. ఆత్మస్తుతి పరనింద మాని, నిజాయితీగా మాట్లాడి వ్యవస్థను కాపాడాలని డిమాండ్ చేశారు.